Off The Record: కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటుకు సిద్ధం అవుతున్నారట. ఇన్నాళ్ళు అసంతృప్తిగా ఉన్న నాయకులు ఎన్నికలు దగ్గరపడుతున్నందున ఇదే అదను అనుకుంటున్నారట. అసంతృప్త నేతలంతా కలిసి ఏకంగా ఎమ్మెల్యేకు సమాతరంగా కార్యక్రమాలు నిర్వహించడమే ఇప్పుడు కోదాడ బీఆర్‌ఎస్‌లో హైలైట్. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, 2014లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, మరి కొంతమంది ప్రజాప్రతినిధులు కలసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోటీ కార్యక్రమాలు నిర్వహించడం, ఆ వేదికల మీద నుంచి బహిరంగంగానే ఆరోపణలు చేస్తుండడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.
విపక్ష పార్టీల కంటే సొంత పార్టీ నేతల వైఖరి, దూకుడే ఇప్పుడు బొల్లం మల్లయ్యకు మింగుడుపడటం లేదట. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన అనుచరులకే ముఖ్య పదవులు కట్టబెట్టడం… పదవుల పంపకాల్లో సీనియర్ల సూచనలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం లాంటి వాటితో మొదలైన రచ్చ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. దీంతో నియోజకవర్గంలో ఆయనకు మిత్రుల కంటే సొంత పార్టీ శత్రు వర్గమే ఎక్కువగా ఉన్నట్లయిందట. మెజారిటీ జెడ్పిటిసి, ఎంపీపీలతో పాటు కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ శిరీషా లక్ష్మీనారాయణతో ఎమ్మెల్యేకు చాలా గ్యాప్ ఉందట. మల్లయ్య తీరుకు నిరసనగా శిరీష నిరసనకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తనను వ్యతిరేకించే నాయకులున్న మండలాల్లో గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం చేయకపోగా వారిని ఇంకా రెచ్చగొట్టేలా వాళ్ళ ప్రమేయం లేకుండానే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట ఎమ్మెల్యే. దీంతో సందర్భం వచ్చినప్పుడల్లా, వేదికలపైనే ఆయా నేతలు నేతలు ఎమ్మెల్యే లక్ష్యంగా విమర్శలు చేయడం కోదాడ బీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని అడ్డుకున్న, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారట. విపక్ష పార్టీలు సైతం ఎమ్మెల్యే లక్ష్యంగా అక్రమ రవాణాపై విమర్శలు చేయడం… వారికి సొంత పార్టీకి చెందిన అసంత్రుప్త నేతలు జతకట్టడంతో వ్యవహారం మరింత ముదురుతోంది.
అయితే ఈ వ్యవహారం అంతా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక మహిళా ప్రజాప్రతినిధి కనుసన్నల్లో జరుగుతోందన్నది లోకల్ టాక్. నియోజకవర్గానికే చెందిన ఓ ఎంపీపీతో ఎమ్మెల్యే అత్యంత సన్నిహితంగా ఉండటం…ఆయన నిర్ణయాలను ఆమె ప్రభావితం చేస్తోందని చెప్పుకుంటున్నారట నియోజకవర్గంలో. నిబంధనలకు విరుద్ధంగా సమీక్ష సమావేశాల్లో ఆమె ఎమ్మెల్యేతో కలిసి పాల్గొనడంపై ఇటు అధికారులు, అటు సొంత పార్టీలోనూ చెవులు కొరుక్కొంటున్నారట. కొందరు ఎంపీపీలను తన వెంట పర్యటనలకు కూడా పిలవని ఎమ్మెల్యే… ఆ ఎంపీపీకి మాత్రం సమీక్షా సమావేశాల్లో కూడా ఎక్కడలేని ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని మాట్లాడుకుంటున్నారట బీఆర్‌ఎస్ కేడర్. మొత్తంగా ఆ మహిళా ఎంపీపీ దూకుడుతో ఎమ్మెల్యేకు తిప్పలు తప్పవన్నది కోదాడ బీఆర్‌ఎస్‌లో ఉన్న అభిప్రాయమట. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి వ్యవహారాలు ఎటు దారితీస్తోయోనన్న ఆందోళన కేడర్‌లో ఉందట.