Off The Record: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ముమ్మరంగా దరఖాస్తులు చేసుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అయితే గతానికి భిన్నంగా ఈసారి చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఇందులో అతి ముఖ్యమైన, అందర్నీ ఆకట్టుకుంటున్నది సీనియర్ లీడర్ జానారెడ్డి ఫ్యామిలీ డ్రామా. జానారెడ్డి వారసులు తొలిసారి ఎన్నికల తెరంగేట్రం చేయాలనుకుంటున్నారు. ఫలానా నియోజకవర్గం నుంచి మేం పోటీ చేస్తాం.. మాకూ అవకాశం కల్పించమంటూ జానారెడ్డి ఇద్దరు కొడుకులూ దరఖాస్తులు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. తొలి నుంచి నాగార్జునసాగర్ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారు జానా. ఆ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో సైతం ఆయనే బరిలో నిలిచారు. కానీ.. కొద్ది రోజులుగా ఆ నియోజకవర్గంలో జానారెడ్డి రెండో కుమారుడు జైవీర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తండాలన్నింటిని ఇప్పటికే ఒక రౌండ్ చుట్టి వచ్చారు. టికెట్ ఆశావాహుల దరఖాస్తులో కూడా ఈసారి పార్టీ నాగార్జునసాగర్ టికెట్ తనకే ఇవ్వమని అప్లై చేశారాయన. అదే సమయంలో అక్కడ పెద్ద దిక్కుగా ఉన్న జానారెడ్డి మాత్రం అప్లై చేయలేదు. ఇక్కడే… పార్టీ వర్గాలకు తేడా కొడుతోంది. మరోవైపు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఆయనైతే…నాగార్జునసాగర్‌తో పాటు మిర్యాలగూడ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఓ వైపు జానారెడ్డి అప్లై చేయలేదు. మరోవైపు ఆయన చేతిలో ఉన్న నియోజకవర్గం కోసం ఇద్దరు కొడుకులు చేశారు. అంటే… ఏంటీ ఫ్యామిలీ డ్రామా అన్న చర్చ జరుగుతోంది పార్టీలో. సరే… ఒకరు దరఖాస్తు చేశారంటే వేరే సంగతి. అన్నదమ్ములిద్దరూ నాగార్జున సాగర్‌ని కోట్ చేయడం ఏంటన్నది పార్టీ వర్గాలకు కూడా అంతుబట్టడం లేదట. అంటే… ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇచ్చినా ఫర్లేదంటూ కలిసే దరఖాస్తు చేశారా? లేక నేనంటే నేనంటూ పోటా పోటీగా రేస్‌లోకి వచ్చారా అన్న అనుమానాలు సైతం కలుగుతున్నాయి. అదే సమయంలో జానారెడ్డి ఇక రిటైర్‌మెంట్ తీసుకున్నట్టేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పెద్ద కొడుకు రఘువీర్ ఇప్పటికే మిర్యాలగూడపై కన్నేశారు. ఆయన అక్కడ బరిలో ఉంటారని ప్రచారం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తి దాంతో పాటు సాగర్‌కి కూడా ఎందుకు దరఖాస్తు చేశారన్న ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదంటున్నాయి పార్టీ వర్గాలు. జానారెడ్డి ఇద్దరు కుమారులకు టిక్కెట్స్ ఇప్పించుకోగలుగుతారా? ఆయన పోటీలో లేకపోవడానికి కారణాలు ఏంటి? దానివెనక ఉన్న వ్యూహం ఏంటన్న చర్చ జోరుగా జరుగుతోంది. నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తిగా మారింది.