Off The Record: ఇటీవల నల్గొండ నిరుద్యోగ నిరసన సభ జరిగినప్పుడు మీడియాతో చిట్‌చాట్ చేసిన సీనియర్ లీడర్ జానారెడ్డివచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు. తన స్థానంలోకుమారుడు బరిలో నిలుస్తారని చెప్పారు. కానీ.. ఇద్దరు కొడుకులు రఘువీర్, జయవీర్‌లో ఎవరన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనే.. కుమారుడిని బరిలో దింపాలని అనుకున్నా… పార్టీ అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జానానే నేరుగా పోటీకి దిగారు. వచ్చే సాధారణ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి చావో.. రేవో లాంటివి. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జునసాగర్ బరి నుంచి తాను తప్పుకుంటానని జానారెడ్డి చెప్పినా.. పార్టీ ఒప్పుకుంటుందా? అన్నది బిగ్ క్వశ్చన్. ఈసారి పోటీచేయనన్న మాట ఆయన వ్యూహాత్మకంగా చెప్పినా… మరో రకంగా చెప్పినా…ఇప్పుడు అలా మాట్లాడి ఉండకూడదన్నది పార్టీ వర్గాల మాట. తాను యాక్టివ్‌గా ఉండగానే కొడుకుల్ని పొలిటికల్‌గా సెటిల్ చేయాలన్నది జానారెడ్డి ఆశ. అందుకే సాగర్ బరిలో ఒకరిని దింపాలని అనుకుంటున్నారట. కొడుకులు ఇద్దరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ ఒకే కుటుంబంలో.. అదీ అన్నదమ్ములకు రెండు టికెట్లు ఇస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి.
నిజంగానే జానారెడ్డి బరి నుంచి తప్పుకుంటే.. నాగార్జునసాగర్ టికెట్‌ను ఎవరికి ఇస్తారు..? అనేది కూడా కీలకమైన అంశమే. సాగర్ ఉపఎన్నికల్లో రఘువీర్, జయవీర్ ఇద్దరూ పనిచేశారు. రఘువీర్ 2018 ఎన్నికల్లోనే మిర్యాలగూడ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. అంతా సిద్ధం చేసుకున్నాక చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చింది. ఈసారి ఎలాగైనా… మిర్యాలగూడ నుంచే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు రఘువీర్. త్వరలోనే అక్కడ కార్యకలాపాలు పెంచాలనుకుంటున్నారు. అదే జరిగితే నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి పోటీ చేస్తారా? లేక ఇంకో కుమారుడు జయవీర్ ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే గెలుపు గుర్రాల వైపే మొగ్గు చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికీ టికెట్ల అంశాన్ని పక్కన పెడతారా ? లేదంటే మరేదైనా వ్యూహాన్ని అమలు చేస్తారా..? అనేది కూడా చూడాలి. కానీ…రెండు టిక్కెట్ల నిబంధన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికేనని, రఘువీర్ ఇప్పటికే మిర్యాలగూడలో పోటీకి సిద్ధమైనందున ఆయనకు వర్తించదన్న మరో వాదన కూడా ఉంది.
ఈ గందరగోళానికి త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల మూడ్ మొదలైతే జానారెడ్డి నిజంగానే బరి నుంచి తప్పుకుంటారా..? లేదా అనేది క్లారిటీ వస్తుంది. అప్పుడు ఆయన వారసుల్లో ఎవరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న క్లారిటీ వస్తుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో జానారెడ్డికి సన్నిత సంబంధాలు ఉన్నాయి. రఘువీర్ ..జయవీర్ ఇద్దరినీ రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇద్దరిలో రఘు వీర్ …రేవంత్ మధ్య దోస్తీ ఎక్కువ. అన్నదమ్ముల్లో చివరికి ఎవరు నిలుస్తారో.. ఎవరు సైడవుతారో చూడాలి.