Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి పొలిటికల్ సన్యాసం తీసేసుకున్నారు. దీంతో ఇది తాత్కాలికమా? లేక అలవాటైన ప్రాణం కాబట్టి మళ్ళీ మనసు మారుతుందా అన్న చర్చ మొదలైంది. ప్రస్తుతానికైతే… వైసీపీ నగర అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారాయన. పార్టీకి అధికారం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అన్న చర్చ జరుగుతోంది గుంటూరు వైసీపీ వర్గాల్లో. అలా .. ఎందుకంటే.. 2019లో టీడీపీ ఓడిపోయి కష్టకాలం వస్తే… నాడు ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మద్దాలి గిరి ఏ మాత్రం ఆలోచించకుండా అప్పుడు పవర్‌లో ఉన్న వైసీపీలోకి జంపై పోయారు. ఇక ఇప్పుడు చూస్తే వైసీపీకి కష్టాలు వచ్చాయి కాబట్టి.. తిరిగి పాత పద్ధతిలో రాజీనామా నిర్ణయం తీసుకున్నారన్నది పొలిటికల్ పరిశీలకుల అంచనా. అంటే ఆయనకు రాజకీయ ఈత రాదు. కష్టాల్లో ఉన్న పార్టీని నిలువునా వదిలేసి ఎక్కడ సుఖం ఉంటే అక్కడికి వెదుక్కుంటూ పోతారన్న టాక్ బలంగా ఉంది. కాకుంటే ఆల్రెడీ గతంలో టీడీపీకి హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికిప్పుడు అటువైపు చూడకపోవచ్చంటున్నారు.
Read Also: IND-W vs NEP-W: ఆసియా కప్లో భారత్ మూడో విజయం.. నేపాల్పై విక్టరీ
మామూలుగానే గుంటూరు పశ్చిమలో పోటీ చేసి గెలిచిన నాయకులు రాజకీయంగా ఎదగరన్న సెంటిమెంట్ బలంగా ఉంది. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన శనక్కాయల అరుణ, తాడిశెట్టి వెంకటరావు, చల్లా వెంకట కృష్ణారెడ్డి లాంటి వారు ఆ తర్వాత పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించకుండా పోయారు. ఇప్పుడు మద్దాలి విషయంలో కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతోందా అన్న చర్చ సైతం నడుస్తోంది గుంటూరులో. అదే సమయంలో సడన్‌గా ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయాల నుంచి వైదొలగాల్సిన అగత్యం ఏమొచ్చిందన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఆ క్రమంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచినా.., మద్దాలి గిరికి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయట. అందుకే… నాటి అధికార వైసీపీలోకి వెళితే… నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరత్రా వ్యవహారాల్లో ,కీలక పాత్ర పోషించడంతోపాటు… కాస్త ఆర్ధికంగా వెసులుబాటు దక్కుతుందని అనుకున్నట్టు తెలిసింది. కానీ… తీరా పార్టీ మారాక ఆ అంచనాలు తల్లకిందులయ్యాయట. పార్టీ పరంగా ప్రాధాన్యత దక్కకపోగా… అటు ఆర్థికంగా కూడా పెద్దగా పాముకున్నదేం లేదన్నది మాజీ ఎమ్మెల్యే అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు సన్నిహితులు.
Read Also: Off The Record: రేవంత్ సర్కార్ ఆపరేషన్ బుల్డోజర్.. పొలిటికల్ హాట్ టాపిక్..!
వైసిపి నగర అధ్యక్షుడిగా తనకు పదవి ఉన్నా, పార్టీ నాయకులు ఎవరూ అంతగా గౌరవించలేదని, పేరుకే పదవి తప్ప… పెత్తనమంతా మరో కీలక నాయకుడు చేస్తున్నారన్న ఆవేదనతో ఇన్నాళ్ళు మద్దాలి గిరి రగిలిపోయారన్నది ఇన్‌సైడ్ టాక్. ఇప్పుడిక ఎలాగూ పార్టీకి పవర్ పోయింది… తనకు గౌరవం లేదు… అలాంటప్పుడు ఆ ముద్ర ఎందుకనుకుంటూ పక్కకు తప్పుకుని ఉండవచ్చని కూడా అంటున్నారు. ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నా… పార్టీ పరంగా తనకేమీ లబ్ది చేకూరకపోగా… తాను ఎమ్మెల్యేగా ఉండగానే, తన సామాజిక వర్గంలో పైసాకు పనికిరాడని భావించే మరో నాయకుడిని చేర్చుకుని, ఆయనకు పెద్ద మొత్తంలో తాయిలాలు ముట్టజెప్పారని కూడా మద్దాలి రగిలిపోతున్నట్టు చెబుతోంది ఆయన వర్గం. వైసిపిలోకి వెళ్ళి ఇంటి కూటికి, బంతికూటికి చెడ్డానంటూ తీరిగ్గా ఇప్పుడు ఫీలైపోతున్నారట మాజీ ఎమ్మెల్యే. చివరికి మా కులంలో కూడా నన్ను చూసి జాలిపడే పరిస్థితి వచ్చిందని తెగ ఫీలైపోతున్నట్టు తెలిసింది. మరోవైపు ఇలాంటి వాతావరణంలో నీకు రాజకీయాలు అవసరమా అంటూ కుటుంబ సభ్యుల నుంచి కూడా వత్తిడి వస్తోందని, అందుకే తెగేదాకా లాగకుండా ముందే గౌరవంగా తప్పుకుని ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్న కొంతమంది నాయకులు మాత్రం, వైసిపి అధికారంలో లేకపోవడం , కేసుల విషయంలో టిడిపి సీరియస్ గా ఉండటం వంటి విషయాలను ముందుగానే పసిగట్టిన మద్దాలి గిరి మనకెందుకు వచ్చిన రాజకీయాలు, మనకెందుకు వచ్చిన కేసులు, గొడవలు అవుకుంటూ… తెలివిగా ముందే సర్దేసుకుని ఉండవచ్చంటున్నారు. ఈ ప్రచారాలు, అంచనాల్లో ఏది కరెక్టోగానీ… మొత్తంగా చూస్తే.. ఒక్కటి మాత్రం కరెక్ట్ అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ గెలిచిన వాళ్ళకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న గుంటూరు పశ్చిమ పొలిటికల్ సెంటిమెంట్‌లోమరో నాయకుడు జత కలిశాడన్నది మాత్రం వాస్తవం అంటున్నారు.