ఆ రిజర్వుడు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నిలువునా రెండు వర్గాలుగా విడిపోయిందా? వ్యవహారం ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ లీడర్స్‌గా మారిపోయిందా? జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా అయిన ఎమ్మెల్యే అందర్నీ కలుపుకుని పోవడంలో ఎందుకు విఫలం అవుతున్నారు? ఎక్కడుందా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే?
దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో సీనియర్ లీడర్స్, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మధ్య గ్యాప్ పెరిగిందా.. అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిస్థితులు. సామాజిక సమీకరణలతో మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని ఇద్దరు ముఖ్య నేతల మధ్య చెరో సగం టర్మ్ పంచడంతో అన్యాయం చేశారంటూ…ఎమ్మెల్యే పై ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. దేవరకొండ ఎంపీపీ పదవి విషయంలో కూడా ఎమ్మెల్యే… పనిచేసేవారిని వదిలేశారంటూ ఆగ్రహంతో ఉన్నారట సీనియర్ నాయకులు. అందుకే చాలా మంది సీనియర్ లీడర్స్ ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉండటం, రవీంద్రకుమార్ వ్యతిరేకులంతా కలిసి ట్రిప్‌లకు వెళ్ళడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా… జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్న రవీంద్రకుమార్ సొంత నియోజకవర్గంలోనే పరిస్దితి ఇలా ఉంటే.. ఇక ఆయన జిల్లా మొత్తాన్ని ఎలా సరిచేస్తారని ప్రశ్నిస్తున్నారు నేతలు. 2004లో సీపీఐ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన రవీంద్రనాయక్, 2014లో కూడా తిరిగి అదే పార్టీ నుంచి గెలిచినా… తర్వాత బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. 2018లో బీఆర్ఎస్ టిక్కెట్ మీద గెలిచి మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారాయన. మూడోసారి గెలిచాక పార్టీని వదిలేసి సొంత పనులు, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉండడంపై గుర్రుగా ఉన్నారట స్థానిక నేతలు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కావడంతో పార్టీ పదవుల్ని సక్రమంగా పంపిణీ చేయలేదన్న అసహనం కూడా ఉంది. రియల్టర్లు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమానులతో కలిసి మెలిసి తిరుగుతున్న ఎమ్మెల్యే… సొంత పనులు మాత్రమే సకాలంలో చక్కబెట్టుకుంటున్నారని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. వామపక్ష నేపధ్యం ఉన్న ఎమ్మెల్యే వ్యవహార శైలిలో మార్పును గమనిస్తున్న క్యాడర్ ఆయన తీరును తప్పుపడుతున్నారు.
గ్రామ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వారికి అసలు అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా మారిందన్న అభిప్రాయం కూడా దేవరకొండ బీఆర్‌ఎస్ నేతల్లో ఉంది. రాజకీయంగా ప్రభావితం చేసే సామాజిక వర్గాలు ఎమ్మెల్యే కారణంగా పార్టీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని, ఇది నష్టం కలిగిస్తుందని అంటున్నారు కొందరు నాయకులు. ఎమ్మెల్యే వైఖరితో అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలు గ్రూప్ కట్టేశారట. ఈ గ్రూప్‌నకు మాజీ మున్సిపల్ చైర్మన్ నాయకత్వం వహిస్తుండగా.. ఓ కీలక నేత ఆ వర్గానికి నైతిక మద్దతు ఇస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయిందట.. క్యాడర్ లో అసంతృప్తి పెరుగుతున్నా..సరిదిద్దడంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నిర్లక్ష్యంగా ఉన్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇలాంటి గ్రూపు రాజకీయాలు నష్టం కలిగిస్తాయన్న ఆందోళనలో ఉన్నారు పార్టీ అభిమానులు. అగ్ర నాయకత్వం జోక్యం చేసుకుని సరిదిద్దకుంటే..ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.