Off The Record: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే ముగిసిందిగానీ…. సైలెంట్‌గా ఒక పార్టీకి పడాల్సిన ఓట్లు మరో పార్టీకి పడ్డాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. తాము ఓడినా ఫర్లేదుగానీ.. కాంగ్రెస్‌కు మాత్రం సీట్లు రాకూడదన్న కసితో బీఆర్‌ఎస్ కేడర్ క్రాస్ ఓటింగ్ చేసిందన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ ఓట్లన్నీ బీజేపీకి పడి ఉంటాయని అనుమానిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. మల్కాజ్‌గిరి, చేవెళ్ల, జహీరాబాద్, వరంగల్, కరీంనగర్ , సికింద్రాబాద్, నిజామాబాద్ , మహబూబ్ నగర్ ఎంపీ సీట్లలో ఇలా క్రాస్ అయిందన్న చర్చ జరుగుతోంది. ఉదాహరణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ, మల్కాజ్‌గిరినే తీసుకుంటే.. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఈ దోబూచులాట జరిగినట్టు తెలుస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థుల్ని బట్టి ఓటింగ్ జరగడం ఒక ఎత్తయితే.. బీఆర్‌ఎస్ కేడర్ పరోక్షంగా బీజేపీకి చేసిందన్నది మరో వెర్షన్.
వాస్తవానికి చేవెళ్లలో కాంగ్రెస్ తరపున పట్నం కుటుంబం పోటీ చేస్తుందని భావించారు. కానీ… చివర్లో రంజిత్ రెడ్డి బరిలో నిలిచారు. దీంతో… పట్నం కుటుంబ సభ్యులతో పాటు కేడర్ కూడా అంతర్గతంగా… కమలం పార్టీకి మద్దతు తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గెలిస్తే పట్నం ఫ్యామిలీ నిజంగానే తమ మకాం పట్నానికి మార్చాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో ఆ వర్గం క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు బీఆర్‌ఎస్ కేడర్ కూడా.. తమ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను కాదని.. బీజేపీకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కాసాని నామ మాత్రంగా ప్రచారం చేయడం, పార్టీ కేడర్‌ని పట్టించుకోకుండా నామమాత్రంగా మిగిలిపోవడం లాంటి కారణాలతో తాము బీజేపీవైపు మొగ్గినట్టు బీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి, కార్యకర్తలు బాహాటంగానే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక మరో ముఖ్యమైన సీటు మల్కాజిగిరిలో కూడా అభ్యర్థులకు క్రాస్ కంగారు పెరుగుతున్నట్టు తెలిసింది. ఇక్కడ వెరైటీగా… బీజేపీ, కాంగ్రెస్ ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి పోలయ్యాయన్న అంచనాలున్నాయి. అదీకూడా లోకల్, నాన్ లోకల్ ఫ్యాక్టర్‌తోనన్న వార్తలు అంకా ఆసక్తి రేపుతున్నాయి.
హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓడిపోయిన ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయడం ఇక్కడున్న కొందరు బీజేపీ నాయకులకు ఇష్టం లేదట. అందుకే వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేయలేదని తెలుస్తోంది. ఇక్కడ గెలిచి ఈటల కరీంనగర్ నుంచి మల్కాజిగిరికి మకాం మారిస్తే తమకు ఇబ్బందిగా మారతారని భావించిన స్థానిక బీజేపీ నాయకులు కొందరు… అటు కాంగ్రెస్‌కు వేయలేక బీఆర్‌ఎస్ వైపునకు మొగ్గారన్న సమాచారం కలకలం రేపుతోంది. అదే సమయంలో అటు బీఆర్‌ఎస్ ఓట్లు కొన్ని బీజేపీకి క్రాస్ అయ్యాయన్న ప్రచారం సైతం ఉంది. బీజేపీ అభ్యర్థి ఈటలతో ఉన్న వ్యక్తిగత పరిచయాలతో కొందరు అటు మొగ్గినట్టు తెలిసింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా అయ్యిందన్న అభిప్రాయం స్థానికంగా బలపడుతోంది. చేవెళ్లకు చెందిన పట్నం సునీతా మహేందర్‌రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గట్టి రాజకీయ నేపధ్యం ఉన్న పట్నం ఫ్యామిలీ వచ్చి మల్కాజ్‌గిరిలో పాతుకుపోతే.. తమకు రాజకీయంగా భవిష్యత్ ఉండదన్న భయంతో.. సొంత పార్టీ నేతలే మహేందర్ రెడ్డికి దొరక్కుండా ముఖం చాటేశారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మల్కాజ్‌గిరి మీద దృష్టి పెట్టినా… నియోజకవర్గ నాయకుల మధ్య ఐక్యత లేక ఓటర్లను పట్టించుకోలేదన్న వాదన ఉంది. ఇలా మూడు పార్టీల మధ్య రకరకాల మేజిక్‌లు జరిగినట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇవిగాక ఇంకో ఐదారు లోక్‌సభ సీట్లలో బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయన్న సమాచారం కూడా సంచలనమైంది. తాము బలహీనంగా ఉన్నాం… గెలిచే అవకాశం లేదనుకున్న చోట్ల కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాలన్న టార్గెట్‌తో బీఆర్‌ఎస్ నాయకులు సైలెంట్‌గా బీజేపీకి చేశారన్న వాదన బలంగా ఉంది. ఇలా… ఎక్కడికక్కడ వివిధ కారణాలతో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న వార్తలు అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి.