Off The Record: ఒక రాజకీయ పార్టీని వదిలి బయటికి వెళ్ళే నాయకులు ఆ పార్టీని విమర్శించడం, పరిస్థితినిబట్టి వీలైనంత ఎక్కువ బురద చల్లేయడం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. అటు పార్టీలు కూడా ఒక నాయకుడు బయటికి వెళ్ళిపోతున్నాడన్న ఫీలర్ రాగానే… ముందే బహిష్కరించడమో… లేదా పొమ్మనకుండా పొగబెట్టడమో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫలానా పార్టీని నమ్ముకుని చెడ్డవాళ్ళనో, లేక ఫలానా పార్టీ అధ్యక్షుడి వైఖరితో నష్టపోయిన వాళ్ళనో… రకరకాల చర్చలు జరుగుతుంటాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. కానీ… ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా… బీఆర్‌ఎస్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హాట్ టాపిక్ అయింది. పార్టీని వదిలి వెళ్లిపోతున్న నాయకుడికి… రిటైరైన ఉద్యోగిని సన్మానించి పంపినట్టుగా… వీడ్కోలు పలకడాన్ని ఆశ్చర్యంగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెన్నంటి నడిచి, పార్టీకి సుదీర్ఘ కాలం సేవలందించిన మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డికి గౌరవ సన్మానం చేసి వీడ్కోలు పలికింది పార్టీ నాయకత్వం.
Read Also: CM and Deputy CM Meeting: సీఎం, డిప్యూటీ సీఎం భేటీ.. అసలు వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది..?
దాదాపు 25 ఏళ్లుగా పార్టీలో ఉండి, తెలంగాణభవన్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ఛార్జ్‌గా ఉన్న శ్రీనివాసరెడ్డి పొలిటికల్ రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన్ని అలా వదిలేయకుండా సన్మానించి బీఆర్‌ఎస్ కొత్త ట్రెండ్ మొదలుపెట్టినట్టు అయిందంటున్నాయి రాజకీయవర్గాలు. బీఆర్‌ఎస్ ఏర్పాటు నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ. ఆయన కొడుకు, కూతురు అమెరికాలో సెటిల్ అవడంతో… ఇక శేష జీవితాన్ని అక్కడే గడిపేందుకు వెళ్తున్నారట. అమెరికా వెళ్లి ఇక తిరిగి రాను అని కేసీఆర్‌కు చెప్పడానికి వెళ్ళినప్పుడు.. చాలా ఎమోషనల్ అయ్యారట మాజీ సీఎం. ఆ నిర్ణయం చెప్పిన వెంటనే కేసీఆర్ తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి శ్రీనివాస్ రెడ్డి మెడలో వేయడంతో పాటు ఘనంగా వీడ్కోలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ మేరకే తెలంగాణ భవన్‌లో వీడ్కోలు సభ పెట్టి సన్మానించారని అంటున్నారు. అంతవరకు బాగానే ఉన్నా… ఇక్కడే మరో వాదనా వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. శ్రీనివాసరెడ్డి మీద కేసీఆర్‌కు ప్రేమ ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే… ఇందులో రాజకీయ కోణం ఉండిఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను నమ్మి మోసపోయినవాళ్లు అంటుూ… ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో పోస్ట్‌లు తిరిగేస్తున్నాయి. కొందరైతే… ఓ అడుగు ముందుకేసి ఇదిగో లిస్ట్ అంటూ పదుల సంఖ్యలో పేర్లు, ఫోటోలతో పోస్టింగ్స్ పెడుతున్నారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి ఆ ప్రచారం నష్టం చేస్తుందన్న చర్చ జరుగుతోందట బీఆర్‌ఎస్ వర్గాల్లో.
Read Also: CM and Deputy CM Meeting: సీఎం, డిప్యూటీ సీఎం భేటీ.. అసలు వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది..?
తెలంగాణ కోసం త్యాగాలు చేసినవాళ్ళు, తమ పార్టీలను బీఆర్‌ఎస్‌లో విలీనం చేసి అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు, పార్టీ నుంచి బలవంతంగా బయటికి పంపేసినవాళ్ళు అంటూ ప్రచారం తీవ్రంగానే జరుగుతోంది. దానికి కౌంటర్‌గానే.. ఇప్పుడు పార్టీ నాయకత్వం మాజీ ఎమ్మెల్సీ సన్మాన ప్రోగ్రామ్‌ని ఎంచుకుని ఉండవచ్చన్నది కొందరి అనుమానంగా తెలిసింది. పాత విమర్శలు, ఆరోపణలకు చెక్ పెట్టడంతోపాటు…పార్టీలో ఇకపై సీనియర్స్, కష్టపడిన వాళ్ళకు తగిన గౌరవం ఉంటుందని చెప్పే ఉద్దేశ్యం కావచ్చంటున్నారు. పార్టీలో ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక మీదట మరో లెక్క అని చెప్పదల్చుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం శ్రీనివాసరెడ్డితో ఆగుతుందా లేక ఇంకొందరికి కూడా ఇలాంటి సన్మానాలు చేసి కేడర్, లీడర్స్‌కు బలమైన సంకేతాలు పంపుతారా చూడాలంటున్నారు పరిశీలకులు.