Off The Record: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ హాట్‌గా మారిపోయింది. బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కూడా అయిన ఆరూరికి బీజేపీ గేట్లు తెరవడం, అలా ఎలా? మేమెలా వదులుతామంటూ బీఆర్‌ఎస్ కారు డోర్స్ క్లోజ్ చేయడంతో యవ్వారం యమహో యమ అన్నట్టుగా మారిపోయింది. పార్టీ మారేందుకు సిద్ధమైన ఆరూరి రమేష్ ఆల్రెడీ బీజేపీ ముఖ్య నేత అమిత్ షాను కలిశారు. ఇక… ఇంకొద్ది క్షణాల్లో ప్రకటనే తరువాయి అనుకుంటున్నటైంలో బీఆర్‌ఎస్ ఎంటరై ఆయన్ని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలతో హై డ్రామా నడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన ఆరూరికి ఉన్నట్టుండి ఇప్పుడు అంత డిమాండ్ ఎలా వచ్చింది? ఆయన కోసం బీఆర్‌ఎస్, బీజేపీ పోటీలు పడటం ఏంటన్నదే అసలు చర్చ. 2014, 2018లో వర్ధన్నపేట నుంచి గెలిచారాయన. 2023లో మూడో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓడిపయారాయన. తర్వాత బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. అక్కడ కడియం కావ్యతో టిక్కెట్ పోటీ ఉన్నాసరే… తనకే దక్కుతుందన్న నమ్మకం ఉన్నా…. ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారన్నది లోకల్ టాక్. అలా ఎందుకయ్యా అంటే…. ఎన్నికలో గెలుపు కష్టమేనన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ను వదిలి బీజేపీలో చేరాలనుకున్నట్టు తెలిసింది. అంతకు ముందే చేరాలని అనుకున్నా… పార్టీ పెద్దల బుజ్జగింపుతో ఆగారని, ఆ తర్వాత ఇక కడియం శ్రీహరి రాజకీయాన్ని తట్టుకోలేక ఈసారి గట్టి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. కడియం ఎప్పటికప్పుడు తన కూతుర్ని తెరమీదకి తీసుకొచ్చి ఆరూరిని ఇబ్బంది పెడుతున్నారని, ఆ వ్యవహారాలతో విసిగిపోవడమే కాకుండా… ఒకవేళ బీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తే… ఆ పార్టీ మీదున్న వ్యతిరేకత వల్ల తనకు నష్టం జరుగుతుందని అనుకుంటున్నారట ఆరూరి. అందుకే ఆప్షన్‌గా బీజేపీని ఎంచుకుని గోడ దూకేందుకు సిద్ధమైన ఆఖరి క్షణంలో గులాబీ పెద్దల జోక్యంతో ఆయన ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది. అంగ బలం, ఆర్థిక బలం ఉన్న రమేష్‌ను వదులుకోవడం బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వానికి ఎంత మాత్రం ఇష్టం లేదంటున్నారు. అందుకే పార్టీ నేతల్ని ఇంటికి పంపి కారెక్కించుకుని ఆఘమేఘాల మీద హైదరాబాద్ తీసుకొచ్చి కేసీఆర్ సమక్షంలో ప్రవేశపెట్టినట్టు చెబుతున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. పార్టీ మారబోతున్నానని వరంగల్‌లో ఆయన ప్రెస్‌మీట్ పెట్టి చెప్పబోతున్న టైంలో ఎంటరైన గులాబీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి దయాకర్ రావు.. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో పాటు మరి కొందరు పార్టీ ముఖ్య నేతలంతా కలిసి తమతో పాటు కారెక్కించుకుని హైదరాబాద్ తీసుకువచ్చారు. ఆ టైంలో ఆరూరి అనుచరులు, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య పెనుగులాట సైతం జరిగింది.
మరోవైపు వారు ప్రయాణిస్తున్న కారు పెంబర్తి దగ్గరకు రాగానే జనగామ జిల్లా బీజేపీ నేతలు సైతం ఆరూరి రమేష్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. తమ పార్టీలో చేరబోతున్న నాయకుడిని బీఆర్‌ఎస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ వాహనం నుంచి దించే ప్రయత్నం చేశారు. దీంతో స్వయంగా ఆరూరి జోక్యం చేసుకుని…బీఆర్‌ఎస్ పెద్దలతో మాట్లాడి వచ్చి బీజేపీలో చేరతానని వెళ్ళారట. ఒక నాయకుడి కోసం ఇంతతా రెండు పార్టీలు పట్టుబట్టడానికి కారణం ఆయనకున్న అంగ, అర్ధ బలాలేనన్నది లోకల్ టాక్. బలమైన నేతను వదులుకునేందుకు బీఆర్‌ఎస్ సుముఖంగా లేకపోవడం, అదే యాంగిల్‌లో బీజేపీ కూడా ఆసక్తి కనబరచడంతోనే రచ్చ రంబోలా అయిందంటున్నారు.