Off The Record: అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి పినిపే విశ్వరూప్. అయితే ఈసారి తాను కాకుండా…తన కుమారుడు శ్రీకాంత్‌ను బరిలో దింపాలనుకుంటున్నారట ఆయన. దాని మీద ఇన్నాళ్ళు క్లారిటీ లేకున్నా.. ఇటీవల సి.ఎం జగన్ టూర్ సందర్భంగా స్పష్టత వచ్చేసిందట. నియోజకవర్గంలో నువ్వు తిరుగు… లేదా నీ కుమారుడిని తిప్పు అంటూ బహిరంగ సభ వేదిక నుంచే సీఎం చెప్పడంతో ఇక తన కుమారుడికి లైన్ క్లియర్ అయినట్టేనని ఎగిరి గంతేశారట మినిస్టర్. అయితే అదే సందర్భంలో… మరో రూపంలో అసంతృప్తి పురుడు పోసుకుంది. నిరుడు అమలాపురం అల్లర్ల ఘటనల టైం నుంచి మంత్రి విశ్వరూప్‌కు శెట్టిబలిజ నేత వాసంశెట్టి సుభాష్ విరోధిగా మారారు. కోనసీమ అల్లర్ల కేసుల కారణంగా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న సుభాష్ ఒక దశలో వై.సి.పికి గుడ్ బై చెప్పేందుకు సైతం సిద్ధమయ్యారు.
ఈ పరిస్థితుల్లోనే.. అమలాపురం పర్యటనలోనే.. సి.ఎం జగన్ ను కలిశారు సుభాష్ తండ్రి సత్యం. మిమ్మల్ని నేను చూసుకుంటాను అంటూ సత్యంకు కూడా భరోసా ఇచ్చారట సీఎం. తన వ్యతిరేక వర్గం సీఎంను కలవడంపై మంత్రి అసహనంతో ఉండగా… తిరిగి తన వర్గాన్ని రీ ఛార్డ్ చేస్తున్నారట వాసంసెట్టి. ఇక్కడే అమలాపురం వైసీపీ అంతర్యుద్ధం కొత్త మలుపు తీసుకుంటోంది. ప్రస్తుతం మంత్రి విశ్వరూప్ కు అమలాపురం ఎం.పి చింతా అనురాధకు అస్సలు పొసగడం లేదు. దీంతో శతృవుకు శతృవు మిత్రుడన్నట్టుగా…. మంత్రికి వ్యతిరేక వర్గమైన ఎంపీతో సుభాష్ కలిసి పనిచేయాలనుకుంటున్నారట.
ఈ దిశలో ఇప్పటికే ఓ సమావేశం కూడా జరిగినట్టు తెలిసింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈసారి మంత్రి, సుభాష్ వర్గాలు కలిసి పినచేస్తేనే అమలాపురంలో వైసీపీ విజయం సాధ్యమన్నది లోకల్ టాక్. దీంతో ఎన్నికల నాటికి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరకపోతే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. దీనికి పరిష్కారంగా ఎంపీ అనురాధను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించి… విశ్వరూప్ లేదా ఆయన కుమారుడిని ఎంపీగా పంపితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వచ్చిందట. ఎన్నికల నాటికి ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.