Mohammad Kaif React on Jasprit Bumrah’s fitness: వెన్నుగాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. దాదాపుగా ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు బుమ్రానే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఏడాది కాలంగా క్రికెట్ ఆడని బుమ్రా.. ఎలా రాణిస్తాడనే అంశంపై అందరికి ఆసక్తి పెరిగింది. వన్డే ప్రపంచకప్ 2023 ముందుర అతడు ఫామ్ అందుకోవాలి భారత ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే బుమ్రా పునరాగమనంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పిచ్‌సైడ్-మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మహమ్మద్ కైఫ్ మీడియాతో మాట్లాడుతూ భారత ఆటగాళ్ల గాయాలపై స్పందించారు. ‘భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో మన అవకాశాలు మెరుగ్గా ఉండాలంటే ఓ మార్గం ఉంది. గాయపడి వచ్చిన ఆటగాళ్లంతా ఫామ్ అందుకోవాలి. జస్ప్రీత్ బుమ్రా దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చాడు. ఫిట్‌నెస్ సాదించేందుకు ఐర్లాండ్ పర్యటన ఉపయోగపడనుంది. ప్రపంచకప్ నాటికి బుమ్రా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధిస్తే భారత్‌కు ఎంతో మేలు కలుగుతుంది. బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారతుంది. ఒకవేళ బుమ్రా ఈసారి మెగా టోర్నీలోనూ ఆడకపోతే భారత్‌కు చాలా నష్టం జరుగుతుంది. 2022 ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ 2022లో ఏం జరిగిందో తెలుసు’ అని కైఫ్ అన్నాడు.
Also Read: WOLF Teaser: ప్రభుదేవా పాన్ ఇండియన్ మూవీ ‘వూల్ఫ్’ టీజర్ వచ్చేసింది.. సరికొత్తగా అనసూయ!
‘జస్ప్రీత్ బుమ్రాకు బ్యాకప్ పేస్ బౌలర్ లేడు. ఇప్పుడైతే పేపర్ మీదా భారత్ బలమైన జట్టుగా అనిపించడం లేదు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా కనిపిస్తోంది. విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ప్రయోగాలు చేసింది. వాటిపై ఎలాంటి కామెంట్ చేయను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుని యువకులకు అవకాశం ఇచ్చారు. అయితే ఆసియా కప్ నుంచి భారత్ తీసుకునే నిర్ణయాలపై మాత్రం స్పందిస్తా. ఆ టోర్నీకి 15 మంది ఆటగాళ్లను ఎలా ఎంపిక చేస్తారనేది చాలా కీలకం. ఎందుకంటే ఆసియా కప్‌లో ఆడే జట్టే ప్రపంచ కప్‌లోనూ ఆడుతుంది’ అని కైఫ్ చెప్పుకొచ్చారు.
2022 సెప్టెంబర్ నుంచి జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2022, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023, వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆపై బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. ఫిట్‌నెస్ సాధించిన అతడు ఏకంగా టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. బుమ్రా చివరిగా గతేడాది సెప్టెంబర్‌లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో ఆడాడు.