లక్నో జైలులో హెచ్ఐవీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. జైలులో మొదటగా 47 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా.. తాజాగా ఆ సంఖ్య 63కు చేరుకుంది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరికీ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 2023లో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ కేసులు బయటపడ్డాయి. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్ఐవీ సోకిన ఖైదీలలో చాలా మంది డ్రగ్స్ కు బానిసైన వారే ఉన్నారని పేర్కొన్నారు. వాటిని శరీరంలోకి ఎక్కించుకునే క్రమంలో ఒకరు ఉపయోగించిన సిరంజిల కారణంగానే ఖైదీలకు ఈ వైరస్ సోకినట్లు జైలు యాజమాన్యం పేర్కొంది. వీరందరికీ ముందే హెచ్ఐవీ ఉందని.. జైలుకు వచ్చిన తర్వాత ఏ ఖైదీకి హెచ్‌ఐవీ సోకలేదని తెలిపింది.
Read Also: Rahul Gandhi: బొగ్గు రవాణా కార్మికులతో రాహుల్.. 200 కిలోల బొగ్గు ఉన్న సైకిల్ నడిపిన నేత
కాగా.. హెచ్ఐవీ బాధితులు లక్నోలోని యాంటీ రెట్రో వైరల్ థెరపీ(ART) సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. ఖైదీలకు హెచ్ఐవీ సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వ్యాధి సోకిన వారికి ఆహార మార్పులను అనుమతించారు. అలాగే, పాజిటివ్‌గా తేలిన ఖైదీలందరినీ వైద్యుల పరిశీలనలో ఉంచారు. ఇదిలా ఉంటే.. గత ఐదేళ్లలో
ఇన్ని హెచ్‌ఐవి కేసులు బయటపడటం ఇదే తొలిసారి. ఒక్కసారిగా భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడంతో ఇక్కడి మిగతా ఖైదీల ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.