MLA Vasantha Krishna Prasad: మైలవరం పాలిటిక్స్‌లో కొన్ని రోజులుగా కొనసాగుతోన్న సస్పెన్స్‌కు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి రావటం దురదృష్టకరమన్నారు. ఐతవరం నుంచి మైలవరం వచ్చి ఆరేళ్లు పనిచేశానన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిన్నరగా ఇబ్బందులు పడుతున్న కారణంగా స్లో అయ్యానని ఆయన అన్నారు. మైలవరం ఇంఛార్జి ఇచ్చిన దగ్గర నుంచి పార్టీ కోసం పని చేశానన్నారు. తాను వర్గాలకు అతీతంగా పనిచేసి గ్రూపులను ప్రోత్సహించను అని చెప్పానన్నారు. కొన్ని సంఘటనల వల్ల చాలా బాధ పడ్డానన్నారు. నియోజకవర్గంలో కొంత భాగానికి మాత్రమే ఎమ్మెల్యేగా ఉండాల్సి వచ్చిందన్నారు. మైలవరంలో గ్రూపులను ప్రోత్సహించారని.. వైసీపీ వాళ్లే కొండపల్లి మున్సిపాలిటీని ఓడించారని ఆయన ఆరోపించారు.
ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. మైలవరం నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. గతంలో నందిగామ ఎస్సీ రిజర్వు చేయటంతో మైలవరానికి వచ్చాను గుర్తుచేసుకున్నారు.. గత ఆరేళ్లుగా మైలవరం నుంచే పనిచేస్తున్నా, ఇక్కడే ఉంటాను అని స్పష్టం చేశారు. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడం పక్కా అనే సంకేతాలు ఇచ్చారు.. కానీ, నిద్ధిష్టమైన నిర్ణయం త్వరలోనే చెబుతాను అన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను పార్టీలో చేరాలని అడిగారు.. దానిపై త్వరలోనే నా నిర్ణయం ఉంటుందన్నారు. మరోవైపు, మంత్రి జోగి రమేష్ వల్ల పార్టీలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాను అని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ ఓడి పోవటానికి జోగి రమేష్ తమ్ముడికి టికెట్ ఇవ్వక పోవటమే కారణంగా చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి వెన్నుపోట్లు చేస్తుంటే వచ్చే ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఎలా పోటీ చేస్తాను..? అని నిలదీశారు. ఎన్నికల ముందు అధిష్టానం ఎన్ని హామీలు ఇచ్చినా అది ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకున్నట్టే అవుతుందని హాట్ కామెంట్లు చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.