*దుబాయ్‌లో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై సీఎం సమావేశాలు
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆదివారం దుబాయ్‌లో ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లతో సవివరంగా చర్చించారు. వివిధ సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి లండన్ నుంచి దుబాయ్ వెళ్లారు. బ్యాక్-టు-బ్యాక్ సమావేశాలు ప్రధానంగా 56-కిమీ పొడవున్న మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి చేయడం మరియు వాణిజ్య అనుసంధానాలు మరియు పెట్టుబడి నమూనాలను అన్వేషించడంపై దృష్టి సారించాయి. అధికారిక ప్రకటన ప్రకారం, దుబాయ్‌లోని సమావేశాలు 70కి పైగా విభిన్న ప్రధాన గ్లోబల్ డిజైన్, ప్లానింగ్ మరియు ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీలు మరియు నిపుణులతో వివిధ సమావేశాల పొడిగింపు మరియు కొనసాగింపు. చర్చల్లో గ్లోబల్ సంస్థలు తమ పనిని సమలేఖనం చేసిన ప్రాంతాలు మరియు ప్రస్తుత ప్రాజెక్టులు, గతం మరియు ప్రస్తుతం యూరప్, మధ్యప్రాచ్యం మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సంస్థలు హైదరాబాద్ మరియు తెలంగాణతో భాగస్వామ్యానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. తదుపరి సంప్రదింపుల కోసం వారు రానున్న రోజుల్లో తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన సంస్థలను స్వాగతించిన ముఖ్యమంత్రి, చారిత్రాత్మకంగా, నీటి సమీపంలో నగరాలు అభివృద్ధి చెందాయని అన్నారు. “నదులు మరియు సరస్సులు నగరాలను సహజంగా నిర్వచించాయి. మూసీని పునరుద్ధరించిన తర్వాత, హైదరాబాద్ నది మరియు అనేక ప్రధాన సరస్సుల ద్వారా నిర్వచించబడే ప్రపంచంలోనే అరుదైన నగరంగా మారుతుంది, ”అని ఆయన అన్నారు, అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందస్తు ప్రణాళిక నమూనాలను రూపొందించాలని సంస్థలను అభ్యర్థించారు. “నేను ఇతర భారతీయ నగరాలు లేదా రాష్ట్రాలతో పోటీ పడడం లేదు. నేను ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన వాటికి వ్యతిరేకంగా బెంచ్‌మార్క్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను మరియు దానిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాను” అని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ముందు ఆదివారం అర్థరాత్రి (దుబాయ్‌లో ఒక పని దినం) వరకు సంప్రదింపులు కొనసాగుతాయని ప్రకటన పేర్కొంది.
*అక్కడ రాజకీయాలు చేసి ఇక్కడకు వచ్చి మాట్లాడితే ఎలా..?
షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాదు ఎవరు వచ్చిన తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయలేరన్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్ళేవారని ప్రశ్నించారు. రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నాం.. తమతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తామని తెలిపారు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఆమె మాట్లాడితే ఎలా అని దుయ్యబట్టారు. రాష్ట్రంకు వచ్చిన మొదటి రోజే అభివృద్ధి జరగలేదని షర్మిల ఎలా అనగలుగుతారని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ ఆశయాల కోసం పోరాడుతున్నది వైసీపీ అయితే, రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది సోనియా కాంగ్రెస్ అని ఆరోపించారు. ఢిల్లీ కాంగ్రెస్ లో చేరి మమ్మల్ని టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్టో షర్మిల సమీక్షించుకోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యామే తప్ప.. తాము ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదని పేర్కొన్నారు. ఈనెల 27న ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యమంత్రి ఎన్నికల శంఖారావం పూరిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 34 నియోజకవర్గాల నుంచి 2లక్షల మంది బహిరంగ సభకు తరలివస్తారని చెప్పారు. సభ విజయవంతం కోసం కమిటీల ఏర్పాటు, స్థల పరిశీలన పూర్తయిందని పేర్కొన్నారు. షర్మిల ఎన్ని విమర్శలు చేసినా ఆంధ్ర ప్రదేశ్ జగన్ వెంటేనని అన్నారు. రాష్ట్రంలో కనీసం పర్యటించకుండానే బిల్డింగ్ లు, రోడ్లు లేవని చెప్తోందా? అని ప్రశ్నించారు. అభివృద్ది అంటే రోడ్లు, బిల్డింగ్ లేనా? అని దుయ్యబట్టారు.
*పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం
పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అనువైన రాష్ట్రమని, కాబట్టి తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ముందుకురావాలని పలు బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టబడులు సాధనలో భాగంగా సౌదీ అరెబియాలో పర్యటిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం నాడు జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో రాత్రి వరకు వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయపు జనరల్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయెస్ తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యి తెలంగాణ విధానాలు, ఐటీ పరిశ్రమకు సహకారం అందించడం వంటి అంశాలపై వివరించారు. సౌదీ కంపెనీలు తెలంగాణలు పెట్టబడులు పెట్టేలా చొరువ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆరాంకో సంస్థ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చలు జరిపారు. ఆ సంస్థ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాల మద్ధతిస్తామని హామీ ఇచ్చారు. అరాంకో కంపెనీ రసాయనాలు, ఇంధన రంగాలకు సంబంధించి అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థగా పేరుపొందింది. అలాగే, ఆల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్స్ సంస్థ సీఈవో ఆల్ షరీఫ్ నవాబ్ బిన్ ఫైజ్ బిన్ అబ్దుల్ హకీమ్, ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఇంజనీర్ సులైమన్ కే తో సమావేశమయ్యి పెట్టుబడులపై మాట్లాడారు. ఈ సంస్థ విద్యుత్తు, హాస్పెటాలిటీ, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆవిష్కరణ రంగంలో అగ్రగామిగా ఉంది. కాగా, ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో, జెడ్డా ఛాంబర్స్ తో, ఆహార ఉత్పత్తుల దిగ్గజ సంస్థ అయిన సవోలా గ్రూప్ సీఈవో వలీద్ ఫతానాతో, సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈవో, బోర్డ్ సభ్యులతో పెట్రోమిన్ కార్పోరేషన్ ప్రతినిధులతో, బట్టర్జీ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ మాజెన్ బెట్టర్జీతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి గానూ ఉన్న అనువైన పరిస్థితుల గురించి మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాల వంటి విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో నిరంతర విద్యుత్తు సరఫరా, పుష్కలమైన నీటి లభ్యత, నాణ్యమైన మానవ వనరులు, మంచి మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయని మంత్రి చెప్పారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి కనబర్చాయి. అనేక సంస్థలు సానుకూలంగా స్పందించాయి. మంత్రి శ్రీధర్ బాబు వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ అండ్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఉన్నారు.
*ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే..
ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దు .భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావలా వంతుకు మీంచి అమలు చేయలేరని, మల్కాజ్ గిరి లో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచాడన్నారు. రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లో ఈ సారి మనం గెలిచి సత్తా చాటాలన్నారు హరీష్ రావు. ఇది పరీక్షా సమయం .మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలన్నారు హరీష్ రావు. కర్ణాటకలో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైందన్నారు హరీష్ రావు. అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయని హరీష్ రావు అన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుందని ఆయన అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 100 రోజులు డెడ్ లైన్ పూర్తి అవుతోందని.. అప్పటిలోగా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఎలక్షన్ కోడ్ పేరుతో కాంగ్రెస్ హామీల అమలును వాయిదా వేసే అవకాశం ఉందని హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ప్రజా పోరాటం చేస్తోందని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసి ఎక్కువ కార్పొరేటర్ల సీట్లు గెల్చిందని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని.. అసెంబ్లీ ఎన్నికలల్లో నగర ఓటర్లు నిరూపించారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఈ సందర్భంగా హరీష్ రావు ఆరోపించారు.
*దేవుడు అద్భుతం చేయాలి.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి..
ఏపీ కాంగ్రెస్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షర్మిలతో పాటు రఘువీరారెడ్డి, కెవిపి, పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, జె.డి.శీలం, చింతామోహన్, తులసీ రెడ్డి, సాకే శైలజానాధ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్ధానిక నేతలను షర్మిలకు పరిచయం చేశారు. అనంతరం.. ఎన్నికల కార్యాచరణ ఎలా ఉండాలి అనే దానిపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లాల పర్యటనకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. ప్రతీరోజూ షర్మిల మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇచ్ఛాపురం నుంచి పర్యటన ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని చెప్పారు. ఈనెల 23 నుంచి షర్మిల పర్యటన ప్రారంభం కానుంది. ఇకపై వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఆలోచన లేకుండా నియోజకవర్గాలకే పరిమితం అయ్యే పనిలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక జిల్లాల పర్యటనలో షర్మిలతో పాటు రఘువీరారెడ్డి కూడా వెంట నడవనున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. దేవుడు అద్భుతం చేయాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. నాయకుడు అంటే రాజశేఖరరెడ్డిలా ఉండాలని షర్మిల తెలిపారు. రీజనల్ పార్టీల నేతలు ఆకస్మిక నియంతలా మారిపోతారు.. నా రీజనల్ పార్టీ కాంగ్రెస్ లో కలిసి కాంగ్రెస్ ఉన్నంతవరకూ ఉంటుందని చెప్పారు. వెళ్ళిపోయిన వారిని వెనక్కి రావాలని మాజీలకు తెలపాలని షర్మిల కోరారు.24 నుంచి అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్ధుల దరఖాస్తులు మాణిక్కం ఠాకూర్ స్వీకరిస్తారని.. వచ్చిన అప్లికేషన్స్ బ్యాక్ గ్రౌండ్ చెక్ జరుగుతుందని షర్మిల చెప్పారు.
*ఏపీలో షర్మిల హడావిడి చూసి బాధపడ్డాం, జాలి పడుతున్నాం..
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వైఎస్ షర్మిల హడావిడి చూసాకా బాధ పడ్డాం.. జాలి పడుతున్నామని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసిందని ఆరోపించారు. వైఎస్ఆర్ పేరును కూడా చార్జిషీట్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. సోనియా గాంధీ చెబితేనే కేసు వేశానని శంకర్ రావు చెప్పారు.. ఆజాద్ కూడా జగన్ మాట విని ఉంటే ఇలా జరిగేది కాదు అన్నారని సజ్జల తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఉనికి లేదని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు డైలాగ్ లను వైఎస్ షర్మిల ఇవాళ మాట్లాడారన్నారు. షర్మిల ఇస్తున్న పిలుపు గందర గోళంకు దారి తీసేలా ఉన్నాయని తెలిపారు. జగన్ ను నియంత అని షర్మిల అన్నారని గుర్తు చేశారు. షర్మిల ఇప్పటి వరకు తెలంగాణలో ఏమి చేశారు.. ఇప్పుడు హఠాత్తుగా ఏపీకి వచ్చారు.. ఎవరి ప్రయోజనాల కోసం వచ్చారు ? అని ప్రశ్నించారు. షర్మిల చంద్రబాబును ఏపీ సీఎం చేయడానికి వచ్చారన్నారు. చంద్రబాబు అన్ని అస్త్రాలతో పాటు వైఎస్ఆర్ ఓట్లు చీల్చడానికి షర్మిలను ఏపీకి తీసుకువచ్చారని తెలిపారు. ఏపీకి అన్యాయం చేసింది కాంగ్రెస్ తో పాటు టీడీపీనేనని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2019 ఏపీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చాయని సజ్జల విమర్శించారు.
*శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 41.4 కోట్ల విలువ చేసే 5.92 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సౌత్ ఆఫ్రికా లేడి కిలాడి హ్యాండ్ బ్యాగ్‌లో హెరాయిన్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాంబీయా నుండి హైదరాబాద్ వచ్చిన సౌత్ ఆఫ్రికా జాతీయురాలి వద్ద డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. హ్యాండ్ బ్యాగేజ్‌లో దాచిన హెరాయిన్ గుట్టును రట్టు చేశారు కస్టమ్స్ అధికారులు. తెల్లటి పౌడర్ కలిగిన హెరాయిన్ ను హ్యాండ్ బ్యాగ్ తో పాటు ఫైల్ ఫోల్డర్ లో దాచి తరలించే ప్రయత్నం చేసింది ఆమె. అయితే.. ప్రయాణికురాలి ఫ్రోఫైల్ ఆధారంగా సౌత్ ఆఫ్రికా లేడి కిలాడిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. తన వెంట తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ ను క్షుణ్ణంగా పరిశీలించిన కస్టమ్స్ బృందం. బ్యాగ్ లోపలి భాగంలో హెరాయిన్ దాచినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎయిర్‌పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వెనెజులా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ. కోట్లు విలువ చేసే కొకైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారం మేరకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వెనెజులా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా కొకైన్ బయటపడింది. అతడి బ్యాగ్‌లో 628 గ్రాముల 57 కొకైన్ క్యాప్సూల్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుపడిన కొకైన్ విలువ రూ.6.2 కోట్ల మేర ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
*‘‘నేను దావూద్ అనుచరుడిని అయోధ్య రామాలయాన్ని పేల్చేస్తా’’.. వ్యక్తి అరెస్ట్..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం రామనామ స్మరణతో నిండిపోయింది. రేపు(జనవరి22)న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం హిందువులు, రామ భక్తులు ఎదురుచూస్తు్న్నారు. శ్రీ రామ్ లల్లా (బాల రాముడి) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్య ముస్తాబైంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దేశంలోని ప్రముఖులు ఈ ఈవెంట్‌కి రానుండటంతో అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు పలు ఉగ్రసంస్థల నుంచి బెదిరింపులు వస్తుండటంతో అన్ని విధాల భద్రత ఏర్పాట్లను పటిష్టం చేశారు. ఇదిలా ఉంటే బీహార్‌కి చెందిన వ్యక్తి తాను దావూద్ ఇబ్రహీం అనుచరుడినని జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని పేల్చేస్తాంటూ పోలీసులకు బెదిరింపు కాల్ చేశాడు. అరారియా జిల్లాకు చెందిన ఇంతేఖాబ్ ఆలమ్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అర్థరాత్రి పలాసి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలువా కలియగంజ్‌లోని అతని ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. జనవరి 19న నిందితుడు 112 నంబర్‌కి ఫోన్ చేసి, తన పేరును ఛోటా షకీల్ అని, దావూద్ ఇబ్రహీం అనుచరుడినని, రామ మందిరాన్ని పేల్చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అయితే అతనికి క్రిమినల్ రికార్డ్ లేదని, మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు తెలుస్తోందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. సమస్య సున్నితమైంది కావడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
*రామ మందిర వేడుక వేళ.. 100కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన కేంద్రం..
రామ మందిర వేడుకకు యావత్ దేశం సిద్ధమైంది. రేపు జరిగే కార్యక్రమం కోసం ప్రజలంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా, 7000 మందికి పైగా అతిథులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి యూపీ సర్కార్‌తో పాటు కేంద్ర భద్రత ఏజెన్సీలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉంటే కొన్ని ఉగ్రవాద సంస్థల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో భద్రతా ఎజెన్సీలు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్, ఏఐ కెమెరాలతో భద్రతను పటిష్టం చేశారు. ఇదిలా ఉంటే రామ మందిర వేడుక వేళ విష ప్రచారం చేసేందుకు పాకిస్తాన్‌కి చెందిన సోషల్ మీడియా అకౌంట్లు ప్లాన్ చేస్తున్నాయని కేంద్రహోం శాఖ ఇటీవల పేర్కొంది. మత సామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను లేదా అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులను కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలోనే 100 సోషల్ మీడియా ఖాతాలను కేంద్రం బ్లాక్ చేసింది. హోం మంత్రిత్వ శాఖ (MHA), సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, CERT-IN, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) యొక్క ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారులతో కూడిన సైబర్ నిపుణుల బృందాన్ని ఇప్పటికే అయోధ్యకు పంపింది. శ్రీరామ మందిరంపై ఏవైనా నకిలీ/డీప్‌ఫేక్ వీడియోలు ఉంటే వెంటనే తీసివేయాలి మరియు అలాంటి కేసులును కేంద్ర హోంమంత్రి శాఖ, నార్త్ బ్లాక్ కంట్రోల్ రూమ్‌కి నివేదించనున్నారు. తప్పుడు కంటెంట్ వ్యాప్తి చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్(ట్విట్టర్) లకు సంబంధించిన 100 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసింది.