*తెలంగాణలో బీజేపీ అగ్ర నేతల విస్తృత ప్రచారం
తెలంగాణలో బీజేపీ అగ్ర నేతల విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. అందులో భాగంగానే.. 3 రోజుల షెడ్యూల్ రిలీజ్ అయింది. 24, 25, 26 తేదీలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వేర్వేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
అమిత్ షా ఎన్నికల ప్రచారం
24న(రేపు) మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్ లో జరుగునున్న సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అంబర్పేట నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు.
ఇక.. 25న(శనివారం) ఉదయం 11 గంటలకు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సకల జనుల విజయసంకల్ప సభ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న సకల జనుల విజయసంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పటాన్ చెరు నియోజకవర్గం సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు.
26న(ఆదివారం) ఉదయం 11 గంటలకు మక్తల్ నియోజకవర్గంలో సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ములుగు నియోజకవర్గంలో సకల జనుల విజయసంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి నియోజకవర్గంలో సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కూకట్ పల్లిలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.
జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం
ఇదిలా ఉంటే.. ఈనెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మధ్యాహ్నం 2 గంటలకు హుజూర నగర్ నియోజకవర్గంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రాత్రి 7 గంటలకు పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.
రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 24న ఉదయం 11 గంటలకు మేడ్చల్, సాయంత్రం 4 గంటలకు కార్వాన్ నియోజకవర్గం, సాయంత్రం 5 గంటలకు కంటోన్మెంట్లో జరగనున్న బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు.
*అధికారంలోకి వస్తే ముస్లిం యువత కోసం కొత్త ఐటీ పార్క్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 30న ఎన్నికలు జరగోతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అన్ని పార్టీలు కూడా హమీల వర్షం కురిపిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా హమీలను ప్రకటిస్తోంది. తాజాగా మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం కేసీఆర్ కీలక హామీలను ఇచ్చారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం యువత కోసం ప్రత్యేక ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ(ఐటీ) పార్కును ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్ రావు గురువారం తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో కేసీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వానికి ముస్లింలు, హిందువులు రెండు కళ్లుగా భావించి, అందరి అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ముస్లింలకు పింఛన్లు, ముస్లిం విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్లను తెరిచామని తెలిపారు. ముస్లిం యువత కోసం ప్రత్యేక ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, ఇది హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ సమీపంలో రానున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం శాంతియుతంగా ఉందని, కాంగ్రెస్ తన పదేళ్ల పాలనలో రూ. 2000 కోట్లను మైనారిటీల కోసం ఖర్చు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీల కోసం రూ. 12,000 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ సాధ్యమైందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 24 గంటల కరెంటు ఉంటుందని, ఇంటింటికి కుళాయి నీరు వస్తుందని అన్నారు. సాగు, తాగు నీరు లేక గతంలో తెలంగాణ ఇబ్బందులను ఎదుర్కొందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తుందని అన్నారు. వ్యవసాయానికి రైతుబంధు ఇస్తున్నామని, కాంగ్రెస్‌కి రైతుబంధుకు ఇచ్చే డబ్బుల్ని వృథా అని విమర్శిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.10,000 సాయాన్ని క్రమంగా రూ.16,000కి పెంచుతామని తెలిపారు. ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని ఓటర్లకు సూచించారు.
*రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతాడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ మక్తల్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 3 తర్వాత కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2014లో సిలిండర్ కు మొక్కండి.. ఓటు వేయండి అని మోదీ అన్నారు. ఆనాడు రూ.400 సిలిండర్ ఇప్పుడు రూ.1200 అయ్యిందని కేటీఆర్ తెలిపారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా.. అసైన్డ్ భూములు ఉన్నవాళ్లకు హక్కులు కల్పిస్తామన్నారు. కేసీఆర్ కు తెలివి లేదు.. 3ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు అనవసరంగా కరెంట్ ఇస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నాడని మంత్రి కేటీఆర్ చెప్పారు. రైతుల వద్ద 10HP మోటర్ ఉంటదా అని ప్రశ్నించారు.? కరెంట్ వస్తుందా, లేనే లేదు ఎక్కడ వస్తుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి అని తెలిపారు. మక్తల్ గడ్డ నుంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా… కాంగ్రెస్ నేతల కోసం పెడతాం.. బస్సు ఎక్కి మక్తల్ లో ఎక్కడికైన వెళ్లి కరెంట్ తీగలను గట్టిగా పట్టుకొండి.. రాష్ట్రానికి ఓ దరిద్రం పోతుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటున్నారు.. ఆకలికేకలు, గంజి కేంద్రాలు, ఎరువుల కోసం లాఠీఛార్జ్ లు, నక్సలైట్ల పేరు చెప్పి కాల్పులా? అని ప్రశ్నించారు. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉంటే… కరెంట్ ఉండదు. కరెంట్ ఉంటే… కాంగ్రెస్ ఉండద అని అన్నారు. ధరణిలో చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు.. ధరణి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూస్తున్నారు కదా అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ కు 11 ఛాన్స్ లు ఇచ్చాం.. ఏం చేశారని అన్నారు. ఇక.. సోషల్ మీడియా అయితే అస్సలు నమ్మకండని చెప్పారు. స్వయంగా కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓడిపోతాడని మంత్రి కేటీఆర్ అన్నారు.
*వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవల్లో పనిచేసే వారికి హోమ్ ఓటింగ్
ఈ సారి సాధారణ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ చేస్తున్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. బ్యాలెట్ పేపర్ ముద్రణ జరిగిందని, ఈవీఎం బ్యాలెట్స్ ప్రింట్ కూడా అయ్యాయన్నారు. 36 వేల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు. 51 లక్షల ఎపిక్ కార్డులు ప్రింట్ చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. జనరల్, పోలీస్, వ్యయ పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారన్నారు. కౌంటింగ్ సెంటర్‌కు ఒకరు చొప్పున కౌంటింగ్ పరిశీలకులు ఉంటారన్నారు. తొలిసారి హోమ్ ఓటింగ్ నిర్వహిస్తున్నామని.. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర విధులు నిర్వహించేవ అధికారులు హోమ్ ఓటింగ్‌ను వినియోగించుకోవచ్చని సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు. 9396 మంది వృద్ధులు, 5022 దివ్యాంగులు, 1053 అత్యవసర విధులు నిర్వర్తించే అధికారులు ఓటింగ్ పూర్తి చేశారన్నారు. ఓటర్ స్లిప్స్, ఓటర్ గైడ్ లైన్స్ బుక్ లెట్ పంపిణీ చేస్తున్నామని, ఎల్లుండి వరకు ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి చేస్తామన్నారు. సర్వీస్ ఓటర్లు 9811 మంది డౌన్లోడ్ చేసుకున్నారని.. 275 ఇప్పటి వరకు పోల్ అయ్యాయని.. ఇంకా సమయం ఉందన్నారు. ఒక నియోజకవర్గంలో 4 ఈవీఎంలు ఉపయోగించబోతున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. 6 నియోజకవర్గాల్లో 500 మించి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. దాని కోసం కౌంటింగ్ ప్రక్రియలో తగు మార్పులు ఉంటాయన్నారు. సీ-విజిల్ యాప్ ద్వారా ప్రతీ వాహనానికి జీపీఎస్ అమర్చబడి ఉంటుందని సీఈవో వికాస్‌రాజ్ పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఎన్నికల పరిశీలకులు ఉన్నారన్నారు. ఇప్పటివరకు రూ.669 కోట్లు పట్టుకున్నామన్నారు. 260 కోట్ల నగదు, 109 కోట్ల విలువైన లిక్కర్, 35 కోట్ల విలువైన మత్తు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
*ఎమ్మెల్యే రసమయికి రేవంత్ రెడ్డి చురకలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానకొండూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి, బై బై కేసీఆర్ నినాదంతో రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపారు. కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది.. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిందని అన్నారు. రెండు తెలుగు రాష్టాలలో అధికారం కోల్పోయినా.. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ప్రతీకలు కరీంనగర్ ప్రజలు.. అందుకే ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అవకాశాన్ని ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. 2004 నుండి 2009 వరకు కరీంనగర్ ప్రజలను కేసీఆర్ నమ్మించి మోసం చేసిండని ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రాంత ప్రజలను నట్టేట ముంచి ఇప్పుడు కామారెడ్డి పోయిండని విమర్శించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే రసమయికి రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. తన దగ్గర గోసి, గొంగడి ఉందని ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిన వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అని దుయ్యబట్టారు. తెలంగాణ పాటను దొర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన రసమయి బాలకిషన్ అని అన్నారు. మానకొండుర్ ప్రజలు రెండు సార్లు స్థానికేతరునికి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయన్నారు. ఆ సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజల కోరిక మేరకు బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలిపే ఆలోచన చేస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక దొరల గడీలా పాలన బొంద పెడుదామని మండిపడ్డారు. కేసీఆర్ పుట్టిన చింతమడకలో కూడా కరెంట్ ఇచ్చింది.. గుడి, బడి కట్టింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. డిసెంబర్ 9నాడు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడబోతుందని.. ఆడబిడ్డలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులో తరలిరావలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలు తూచా తప్పకుండా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
*రేపు, ఎల్లుండి తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
ఎన్నికలకు మరో వారం రోజులపాటు సమయం ఉండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్నీ నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ చేసుకుని ప్రచారం చేస్తున్నారు ముఖ్య నేతలు.. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ. రేపు, ఎల్లుండి ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు పాలకుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మ. 1:30 గంటలకు హుస్నాబాద్ లో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 3:00 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. రేపు రాత్రి ప్రియాంక గాంధీ ఖమ్మంకు చేరుకుని.. రాత్రి అక్కడే బస చేయనున్నారు. 25న ఉదయం 11:00 గంటలకు ఖమ్మం, పాలేరులో ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి సత్తుపల్లి చేరుకుని.. మధ్యాహ్నం 1:30కి అక్కడ ప్రచారం చేయనున్నారు. అనంతరం 2: 40 నుండి 3:30 వరకు మధిర ప్రచార సభలో ప్రియాంక పాల్గొననున్నారు. సభ అనంతరం.. అక్కడి నుండి విజయవాడకు చేరుకొని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్ళనున్నారు.
*విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ నుంచే పరిపాలన విషయంలో కీలక పరిణామం జరిగింది. విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రిషికొండ మిలినియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను హై లెవెల్ కమిటీ గుర్తించింది. మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్స్‌ను కేటాయించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కమిటీ నివేదిక మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని వెల్లడించారు. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని గుర్తించారు.
*బిగ్ బాస్ లోకి బర్రెలక్క.. కారు గిఫ్ట్.. ?
సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా సెలబ్రిటీ అయిపోవచ్చు. టిక్ టాక్, రీల్స్ చేస్తూ సెలబ్రిటీలు అయినవాళ్లు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు అలా ఫేమస్ అయిన ఒక అమ్మాయి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడింది. ఇప్పటికే ఆమె ఎవరో తెలిసిపోయి ఉంటుంది. “హాయ్ ఫ్రెండ్స్.. డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. మా అమ్మకు చెప్తే నాలుగు బర్రెలను కొనిచ్చింది.. బర్రెలను కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్..” శిరీష అనే యువతీ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే.. ఆ వీడియో అప్పటిలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క వీడియోను పట్టుకొని ప్రభుత్వాలను ఏకిపారేసిన జనాలు కూడా లేకపోలేదు. అప్పటినుంచి శిరీష కాస్త బర్రెలక్క గా మారిపోయింది. అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. డిగ్రీ చదివిన శిరీష జాబ్ లేక.. రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది. ఇక ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి అందరికి షాక్ ఇచ్చింది. తనను గెలిపించమని ప్రజలను వేడుకుంటుంది. ఇక ఈ మధ్యనే ఆమెపై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే బర్రెలక్క.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ప్రజలకు తెలియజేస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. బర్రెలక్కకు బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చిందని, కారు కూడా గిఫ్ట్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బర్రెలక్క ఈ వార్తలపై స్పందించింది. ” బిగ్ బాస్ నుంచి నన్ను ఎవరు సంప్రదించలేదు. అసలు వారికి నేను ఎవరో కూడా తెలిసి ఉండదు. తెలిసి ఉంటే పిలిచేవారేమో. ఇక కారు గిఫ్ట్ ఇచ్చారు అన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అయితే నామినేషన్ వేశాక .. ప్రచారం కోసం అన్నవాళ్లు కారు కొన్నిరోజులు వాడుకోమని ఇచ్చారు. ఒక కారు మాత్రం ఒక అన్న ఫ్రీగా ఇచ్చాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బర్రెలక్క వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ఎలక్షన్స్ లో బర్రెలక్క ఎన్ని ఓట్లు సొంతం చేసుకుంటుందో చూడాలి.