*నేడే ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ
ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరావతి ప్రాంతంలో.. పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కాసేపట్లో రాజధాని అమరావతి ప్రాంతంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేరనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు 50 వేల మంది లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు రెండు లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఆర్‌డీఏ పరిధిలోని ఆర్-5 జోన్‌లో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందికి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మందికి పట్టాలు పంపిణీ చేస్తారు. వీరికి ఇళ్ల నిర్మాణానికి సీఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లేఔట్లు ఏర్పాటుచేశారు. ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో గృహాలనూ లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే వేదికపై నుంచి అమరావతి ప్రాంతంలోని 5,024 టిడ్కో ఇళ్ల పంపిణీ కూడా చేపట్టనున్నారు. అమరావతి పరిధిలో మొత్తం 1402.58 ఏకరాల్లో 25 లే అవుట్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారు.
*నేడే టీఎస్ పాలిసెట్ ఫలితాలు
తెలంగాణ పాలిసెట్ (TS POLYCET-2023) ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాథ్ ఫలితాలను వెల్లడిస్తారు. పరీక్ష ముగిసిన 8 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 17న టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 17 ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 296 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు 92.94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పాలీసెట్ ప్రవేశ పరీక్షకు 58,520 మంది బాలురు, 47,222 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. 54,700 మంది బాలురు, 43,573 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా 98,273 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక ఆన్సర్ కీ ఇప్పటికే విడుదలైంది. అలాగే TS POLYCET ఫలితాలు 2023 మే 26న విడుదలయ్యే అవకాశం ఉంది. సంబంధిత సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.
*30 మంది చిన్నారుల హత్య.. వీడికి జీవిత ఖైదు కూడా చాలా చిన్న శిక్షే
మైనర్ బాలికలను హత్య చేసి అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సైకోకిల్లర్ రవీంద్ర కుమార్‌కు ఢిల్లీ రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2008 నుంచి 2015 మధ్య కాలంలో 30 మంది చిన్నారులను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో రవీందర్ ప్రమేయం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం మూడు కేసులు మాత్రమే విచారణకు వచ్చాయి. రవీందర్ ఒక సీరియల్ రేపిస్ట్, కిల్లర్. ఢిల్లీలో కూలీగా పనిచేసే అతడు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. 7 ఏళ్లలో 30 మంది చిన్నారులపై అత్యాచారం చేసి చంపేశాడు. అతను ఢిల్లీ-ఎన్‌సిఆర్, పశ్చిమ యూపీ ప్రాంతాల్లో పలు మార్లు చిన్నారులపై అత్యాచారాలకు ఒడిగట్టాడు. హంతకుడు రవీందర్ స్వయంగా నేరం అంగీకరించాడు. 2008లో తాను ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ నుంచి ఢిల్లీకి వచ్చానని చెప్పాడు. అప్పటికి అతని వయస్సు 18ఏళ్లు. తన తండ్రి ప్లంబర్‌గా పనిచేసేవాడు. ఆయన తల్లి ప్రజల ఇళ్లలో పని చేస్తుండేది. ఢిల్లీకి వచ్చిన తర్వాత రవీందర్ మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. అంతేకాకుండా పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నాడు. రవీందర్ రోజూ సాయంత్రం మద్యం తాగడం లేదా మందు తాగడం, ఆపై తన టార్గెట్‌ను వెతుక్కుంటూ బయటకు వెళ్లేవాడు. ఇందుకోసం రోజుకు 40 కిలోమీటర్లు నడిచేవాడు. మొదట 2008లో బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. మొదటి సారి నేరం చేసి పట్టుబడకపోవడంతో అతనిలో ధైర్యం పెరిగింది. తర్వాత అదే అతని దినచర్యగా మారింది. పిల్లలను ఆకర్షించేందుకు రూ.10 నోట్లు లేదా చాక్లెట్లతో ప్రలోభపెట్టేవాడినని రవీందర్ తెలిపాడు. తర్వాత వారిని కిడ్పాప్ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి.. వారిపై అత్యాచారం చేసి తర్వాత చంపేస్తాడు. ఇలా 7 ఏళ్లలో 6 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారం చేశాడని దోషి తన వాంగ్మూలంలో తెలిపాడు. 2014లో తొలిసారిగా రవీంద్రకుమార్ పోలీసులకు చిక్కాడు. 6 ఏళ్ల చిన్నారిపై కిడ్నాప్, హత్యాయత్నం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతనిపై అభియోగాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత అతడిని విడుదల చేశారు. దీని తరువాత.. 2015 లో 6 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును విచారిస్తున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఢిల్లీలోని రోహిణిలోని సుఖ్‌బీర్ నగర్ బస్టాండ్ సమీపంలో అతడిని పట్టుకున్నారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు డజన్ల కొద్దీ సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఇన్‌ఫార్మర్లను కూడా విచారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రవీందర్ బాలికను అపహరించి, అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. హత్య చేసి బాలిక మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. ఈ కేసులో కోర్టు అతడిని దోషిగా తేల్చింది.
*ఫలించిన చర్చలు.. కర్ణాటక క్యాబినెట్లోకి 24మంది మంత్రులు.. రేపే ప్రమాణం
ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు గెలిచిన ఎమ్మె్ల్యేలు 8మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం సిద్ధరామయ్య ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తోంది. దాని కోసం ఇప్పటికే కసరత్తు పూర్తయ్యింది. మొదటిసారిగా 24 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరంతా శనివారం (27వ తేదీ) ప్రమాణస్వీకారం చేయనున్నారు. క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలు గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఇద్దరు నేతలు కర్ణాటక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సూర్జేవాలా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఆయన నివాసంలో సమావేశం జరిగింది. అనంతరం సీఎం సిద్దరామయ్య, శివకుమార్ సహా కాంగ్రెస్ నేతలు పార్టీ గురుద్వారా రకాబ్ గంజ్ రోడ్ కార్యాలయంలో చర్చలు నిర్వహించారు. రాష్ట్ర విస్తరణ మంత్రివర్గంలో అర్హులైన వారి పేర్లపై చర్చించారు. శివకుమార్ బుధవారం సాయంత్రం దేశ రాజధానికి చేరుకోగా, సిద్ధరామయ్య రాత్రి వచ్చారు. ఈ నెల 20న కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారం జరిగింది. అయినా ఇప్పటి వరకు మంత్రులకు శాఖలు కేటాయించలేదు.
*ఏం కొట్టుకున్నారు.. అబ్బా అబ్బా.. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ను మించి..
ఉపాధ్యాయులే విద్యార్థులకు రోల్ మోడల్. వాళ్లను చూస్తూనే పిల్లలు పెరుగుతారు. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి వారిని భావి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన మహిళ టీచర్లు విచక్షణ కోల్పోయారు. నీళ్ల కోసం కుళాయి దగ్గర.. కుమ్ములాడుకున్నారు. కనీసం విద్యార్థులు చూస్తున్నారనే ఇంగీతం కూడా లేకుండా దారిలో పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. ఎన్నో రోజులుగా లోలోన రగులుతున్న కోపం ఒక్కసారిగా రచ్చకెక్కడంతో.. వివాదం కాస్త ఉన్నతాధికారుల వద్దకు చేరుకుంది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. పాట్నాలోని బిహ్తా బ్లాక్ కౌరియా పంచాయతీలోని పాఠశాలలో కాంతి కుమారి ఇన్‌ఛార్జ్ హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో అనితా కుమారి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య ఏదో విషయమై వివాదం నడుస్తోంది. దీనిపై గురువారం ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ విషయం ఎంత వేడెక్కిందంటే, కొద్దిసేపటికే టీచర్లిద్దరూ ఒకరితో ఒకరు కొట్టుకోవడంతో పాఠశాల ఆవరణ కుస్తీ వేదికగా మారింది. వీరిద్దరి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే.. ఒకరి జుట్టును ఒకరు లాగ్కుంటూ.. పిడిగుద్దుల వర్షం కురిపించుకుంటూ.. కాళ్లతో తన్నుకుంటూ గొడవకు పాల్పడ్డారు. ఈ సమయంలో అక్కడున్న గ్రామస్థులు ప్రేక్షకులు మౌనంగా ఉండిపోయారు. ఈ మొత్తం ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారి రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇద్దరు మహిళా ఉపాధ్యాయుల మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోందన్నారు. అయిదు నెలల క్రితం కూడా ఈ విషయమై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి, పంచాయతీ ప్రతినిధుల మధ్య సమావేశం నిర్వహించి సద్దుమణిగిన నేపథ్యంలో మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఉపాధ్యాయులిద్దరినీ బదిలీ చేయాలని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారిని కోరారు. ఈ విషయంపై బిహ్తా బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నభేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటన బ్లాక్‌లోని కౌరియా పంచాయతీ మిడిల్ స్కూల్‌కు సంబంధించినది. ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వ్యక్తిగత వివాదం ఉంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
*నేడు ముంబై vs గుజరాత్ బిగ్ ఫైట్.
ఐపీఎల్ 16వ సీజన్ లో ఇవాళ రెండో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఘన విజయంతో ముంబై ఇండియన్స్ దూకుడు మీదుంటే.. లీగ్‌లో తొలిసారి గుజరాత్ టైటాన్స్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇవాళ జరిగే క్వాలిఫయర్–2లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్‌తో ఐదుసార్లు విజేత ముంబై టీమ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. ఓడిన టీమ్ ఇంటిముఖం పట్టనుంది. సరైన సమయంలో టాప్ గేర్ వేసిన ముంబై ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కష్టంగా నాకౌట్‌కు చేరినా.. ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుచేసి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. లీగ్ సాగేకొద్దీ ముంబై బ్యాటర్లు గాడినపడడంతో ఆ జట్టు భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తోంది. టాపార్డర్‌లో రోహిత్, ఇషాన్ అంతగా ప్రభావం చూపలేకపోయినా.. మిడిలార్డర్‌లో గ్రీన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచారు. నేహల్ వధేరా కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక, బౌలింగ్ విషయానికొస్తే బ్రుమా, ఆర్చర్ లేకపోయినా.. ఆకాష్ మధ్వాల్ ఆ లోటును తీరుస్తున్నాడు. సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్ కూడా అతడికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా లక్నోతో ఎలిమినేటర్‌లో మధ్వాల్ 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.. ఈ మ్యాచ్ లో కూడా ఆకాష్ నుంచి టీమ్ అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది. లీగ్ మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలతో టాప్‌లో నిలిచిన గుజరాత్.. క్వాలిఫయర్–1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో తగిలిన షాక్‌తో ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. ఛేజింగ్‌లో బలమైన గుజరాత్‌ను చెన్నై చాకచక్యంగా నిలువరించింది. అయితే, హైవోల్టేజ్ మ్యాచ్‌ను సొంతగడ్డపై ఆడుతుండడం టైటాన్స్‌కు కొంత ఊరట లాభించేదే అంశం. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో చెలరేగి పోతున్నాడు. మరోసారి జట్టు అతడిపైనే ఎక్కువ భారాన్ని వేయనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తురుపుముక్క ఆకాష్, గిల్ మధ్య పోరు రసవత్తరం కానుంది. విజయ్ శంకర్ రాణిస్తున్నా.. హార్దిక్ పాండ్యా, మిల్లర్, రాహుల్ తెవాటియా లాంటి హిట్టర్లు ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వరుసగా రెండోసారి ఫైనల్ చేరాలంటే మాత్రం వీరి నుంచి జట్టు మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. బౌలింగ్‌లో షమి, రషీద్ రాణిస్తున్నా.. ముంబై బ్యాటర్లు నుంచి వీరికి విషమ పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ఓవరాల్‌గా నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎలా నెగ్గాలో తెలిసిన ముంబైతో తలపడడం గుజరాత్‌కు పెద్ద సవాలే..!
*నా సామర్థ్యం మేరకు బౌలింగ్ చేస్తా..
బుధవారం జరిగిన ఐపీఎల్ 2023 ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ఆకాష్ మధ్వల్ పేరు మారిమ్రోగిపోయింది. 3.3 ఓవర్లలో 5 పరుగులిచ్చి 5 వికెట్లను తీసుకుని.. అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. కొన్నేళ్ల క్రితం ఇంజనీర్‌గా పని చేస్తూ టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్న మధ్వల్ ఇప్పుడు LSGకి వ్యతిరేకంగా తన అద్భుతమైన బౌలింగ్ తో IPL చరిత్ర పుస్తకాల్లోకి ప్రవేశించాడు. అతను ఇప్పుడు ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. MI యొక్క డ్రెస్సింగ్ రూమ్ వేడుకల సందర్భంగా, మాధ్వల్‌కు మ్యాచ్ బాల్‌ను బహుకరించారు. ఈ జ్ఞాపికను అందుకున్న తర్వాత అతను నవ్వుతూ ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా మరియు జోఫ్రా ఆర్చర్ ఇద్దరూ గాయపడటంతో.. టీమ్ లో ఆకాశ్ మధ్వల్ చోటు దక్కింది. అతను గత సంవత్సరం ముంబై ఇండియన్స్ టీమ్ లో చేరాడు, అయితే ఈ సీజన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అతన్ని పెద్ద వేదికకు పరిచయం చేయడానికి ముందు, ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటానికి మాత్రమే పరిమితమయ్యాడు. అయితే లక్నో తో జరిగిన మ్యాచ్ లో ఆకాశ్ మధ్వాల్ ను రోహిత్ తుది జట్టులోకి తీసుకున్నాడు. జట్టు నాకు బాధ్యతను అప్పగించింది కాబట్టి నేను దానిని చేయడానికి ప్రయత్నిస్తున్నాను” అని మాధ్వల్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన తర్వాత విలేకరులతో అన్నారు. నేను అతని (బుమ్రా) స్థానాన్ని తీసుకోగలనని కాదు.. కానీ నా సామర్థ్యంతో నేను చేయగలిగినదంతా చేస్తున్నాను అని మాధ్వల్ తెలిపాడు. క్రికెట్ అనేది నా ప్యాషన్, భారం కాదు అని అన్నాడు. కాబట్టి నేను ఇంజినీరింగ్‌ని వదిలిపెట్టి క్రికెట్ లోకి వచ్చినట్లు ఆకాశ్ మాధ్వల్ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-37తో మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన ఇచ్చినందుకు కెప్టెన్ ( రోహిత్ శర్మ ) తనకు మరో ఛాన్స్ ఇచ్చాడని ఆకాశ్ మాధ్వల్ వెల్లడించారు. అయితే లక్నోతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు తీసుకున్న బంతిని ఆకాశ్ మాధ్వల్ కు ఇవ్వడంతో తాను సాధించిన విజయానికి గుర్తుగా దాచుకుంటానని ఇన్ స్టా గ్రామ్ లో వీడియోను పోస్ట్ చేశాడు. కాగా.. MI ఇప్పుడు క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత ఆదివారం ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.
*SSMB 28: తుఫాన్ వస్తుంది… అలర్ట్ గా ఉండండి
సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా క్లాస్ మిక్స్డ్ విత్ లైట్ మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల్లో మెసేజ్ ఎక్కువగా ఉండడంతో ఫాన్స్ అన్ని సినిమాలని క్లాస్ మూవీస్ కిందే లెక్కేశారు. ఎంత క్లాస్ సినిమాలు చేసినా, చొక్కా నలగకుండా ఫైట్స్ చేసినా ఫాన్స్ మహేష్ నుంచి ఒక పోకిరి పండుగాడిని, ఒక బిజినెస్ మాన్ సూర్య భాయ్ ని, ఒక ఒక్కడు అజయ్ ని, ఖలేజా సీతా రామరాజుని, అతడు నందుని కోసం వెయిట్ చూస్తూ ఉంటారు. ఆ లోటు తీర్చడానికి, ఘట్టమనేని అభిమానుల ఆకలిని ఎండ్ కార్డు వేయడానికి మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసాడు. ఈ కాంబినేషన్ లో ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలకి కల్ట్ స్టేటస్ ఉంది. ఈసారి మాత్రం మూడో సినిమాకి ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మహేష్ అండ్ త్రివిక్రమ్. సితార ఎంటర్టైన్మెంట్స్ పై SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీకి టైటిల్ ని అనౌన్స్ చెయ్యడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు.మే 31న కృష్ణ జయంతి సందర్భంగా SSMB 28 టైటిల్ ని ‘గుంటూరు కారం’గా అనౌన్స్ చెయ్యనున్నారు. ఈ అనౌన్స్మెంట్ కి సంబంధించిన అప్డేట్ ఈరోజు బయటకి రానుంది. చాలా రోజులుగా ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ‘SSMB 28’ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇక అప్డేట్ కూడా బయటకి వచ్చేస్తుంది కాబట్టి మహేష్ ఫాన్స్ మరింత అలర్ట్ గా ఉంటే ఇప్పటివరకూ ఉన్న అన్ని డిజిటల్ రికార్డ్స్ బ్రేక్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. ఈ సినిమాకి టైటిల్ దాదాపుగా ‘గుంటూరు కారం’గానే ఫిక్స్ అయినట్లు సమాచారం. టైటిల్ ఏదైనా మాస్ మాత్రం మిస్ అవ్వకుండా మహేష్-త్రివిక్రమ్ ఒక సాలిడ్ సినిమా ఇచ్చేస్తే ఆ తర్వాత పని ఫాన్స్ చూసుకుంటారు.