*త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు.. సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో కొత్త డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులందరికీ ఈ కార్డులు అందజేయనున్నారు. ఇప్పటి వరకు లబ్ధిదారులను గుర్తించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇక నుంచి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించనున్నారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఆరోగ్యశ్రీ బీమా పథకం ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్న రూ.2 లక్షల బీమా కవరేజీని రూ.5 లక్షలకు పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలో లబ్ధిదారులను గుర్తించి ధ్రువీకరించిన డిజిటల్ కార్డులను అందజేస్తామన్నారు. లబ్ధిదారులు నేరుగా ఆధార్ ధృవీకరణ ద్వారా వారి చిరునామాను ధృవీకరిస్తారు. స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు, డిజిటల్ కార్డుల జారీపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ కార్డుల జారీ, ఆరోగ్యశ్రీ సేవల విస్తరణకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆరోగ్యశ్రీ ఆరోగ్య సంరక్షణ సేవల ఆడిట్ చేసేందుకు నిమ్స్ నుంచి సీనియర్ వైద్యుల బృందాన్ని నియమించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కళాశాలకు అనుబంధంగా పనిచేస్తున్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేసి వినికిడి లోపం ఉన్న చిన్నారులకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కోఠి ENT ఆసుపత్రి మాత్రమే ఉచిత కోక్లియర్ ఇంప్లాంట్స్ ఆపరేషన్ మరియు పునరావాసం అందించే సదుపాయం. ప్రభుత్వం ఉచితంగా అందించే 105 డయాలసిస్ సేవలు పొందుతున్న రోగులను రిమోట్‌గా పర్యవేక్షించేందుకు నిమ్స్ వైద్యులు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని హరీశ్‌రావు సూచించారు. కరోనా సమయంలో 866 బ్లాక్ ఫంగస్ సర్జరీలు చేసిన కోఠి ఈఎన్‌టీ వైద్యులకు రూ.1.30 కోట్ల నిధులు మంజూరు చేస్తూ హరీశ్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే వారాల్లో ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు.
*తెలంగాణకు రెడ్ అలర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా ముసురు పడుతుండగా.. ఇవాళ్టి(బుధవారం) నుంచి మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ తెల్లవారు జాము నుంచి వరంగల్, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 30 -40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో జులై 22వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. సోమవారం నుంచి మొదలుకొని ఇవాళ (బుధవారం) ఉదయం వరకు పలు ప్రాంతాల్లో వర్షం లేదా ముసురు కురుస్తున్నది. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ఇక వర్షం కారణంగా భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే, తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాల ముప్పు నుంచి ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.
*జగనన్న సురక్షకు విశేష స్పందన
‘జగనన్న సురక్ష’ కార్యక్రమం రాష్ట్రంలో రికార్డు సృష్టిస్తోంది. అర్హత ఉండి కూడా రాష్ట్రంలో ఎవరూ ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం ‘జగనన్న సురక్షా’ కార్యక్రమాన్ని జులై 1న లాంఛనంగా ప్రారంభించింది. అంతేకాకుండా వివిధ పాఠశాలు, కాలేజీల ప్రారంభం, అడ్మిషన్ల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని సురక్షా శిబిరాల్లోనే వివిధ ధృవీకరణ పత్రాలను కూడా మంజూరు చేయిస్తోంది. వివిధ శాఖలు జారీ చేసే 11 రకాల ధృవీకరణ పత్రాలను ఎటువంటి యూజర్ ఛార్జీలు లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందజేస్తోంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజు నుంచే ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. మొదటిరోజు మొత్తం 1305 సచివాలయాల పరిధిలో 4,73,441 వినతులు వస్తే వాటిల్లో ప్రభుత్వం అక్కడిక్కడే పరిష్కరించినవి 4,57,642 ఉన్నాయి. 17వ తేదీ నాటికి మొత్తం 9,721 సచివాలయాల పరిధిలో ఉన్న 84.11 లక్షల కుటుంబాల నుంచి 53.24 లక్షల వినతులు వస్తే 51.14 లక్షల వినతులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. 11వ తేదీ ఒకరోజే 6.5లక్షలకు పైగా వినతులు పరిష్కారం కావడం విశేషం. ఇప్పటిదాక మొత్తం 1.69,891 మంది వాలంటీర్లు జగనన్న సురక్షా శిబిరాల కోసం తమ క్లస్టర్లలోని 84.11 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించారు. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి 4,56,147 అభ్యర్థనలు రాగా.. అధికారులు 4,37,509 పరిష్కరించారు. అలాగే అత్యల్పంగా పార్వతీపురం జిల్లా నుంచి 89,303 అభ్యర్థనలు రాగా పరిష్కారమైనవి 62,312. అంతేకాదు అధికారులు ఇప్పటిదాకా 25,39,136 ఇంటిగ్రేటెడ్ సరిఫికెట్లు, 23,25,388 ఆదాయ ధృవీకరణ పత్రాలు, 4,154 ఓబీసి సర్టిఫికెట్లు, 2,764 మ్యారేజ్ సర్టిఫికెట్లు, 9,968 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, 45,930 అడంగల్ సర్టిఫికెట్లు, 1, 08,005 వన్ బీ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇక ఆరోగ్య శ్రీ కార్డులు 3,224, కొత్త బియ్యం కార్డులు 9,378, బియ్యం కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించిన సేవలు 8, 263, ఆధార్ తో మొబైల్ అనుసంధానం చేసిన సేవలు 1,78,499 ఉన్నాయి. అలాగే పట్టాదారు పాసు పుస్తకాల సేవలు 2,841 ఉన్నాయి.
*ఏపీ రాజకీయాలపై ఎన్డీయే సమావేశంలో చర్చ జరగలేదు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. నాని ఫాల్కివాలా చెప్పినట్లు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుండె ధైర్యంతో నిలబడడమే గొప్ప విషయమన్నారు. పార్లమెంట్ మీద తీవ్రవాదుల దాడి తర్వాత తనకు కూడా అదే అనిపించిందన్నారు. దేశానికి బలమైన నాయకత్వం అవసరం అనిపించిందన్నారు. 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంతో దేశం మరింత పటిష్టమైందన్నారు. దేశానికి పటిష్ట నాయకత్వం వల్ల వచ్చే జరిగే మేలు ఏమిటి అన్నది భారతదేశం అంతా గమనిస్తోందన్నారు. ఎన్డీఏ పక్షాల సమావేశంలో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. దేశ ప్రజలకు అత్యున్నత జీవన విధానం అందించేందుకు, అభివృద్ధి సాధించేందుకు ఎలాంటి విధానాలు తీసుకురావాలి అన్నదానిపై చర్చ జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు, సీట్ల సర్దుబాటు మీద మాట్లాడలేదన్నారు. మొత్తం భారతదేశ రాజకీయాలు, భవిష్యత్తు వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. ఎన్డీయే కూటమిలో ఇప్పటికే 38 పార్టీలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయా? అని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించగా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని సమాధానం ఇచ్చారు.
*మరో రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా ఇవాళ (బుధవారం) తెల్లవారు జామున మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో నార్త్ కొరియా రెండు క్షిపణులను ప్రయోగించడం సంచలనం రేపుతుంది. ఉత్తర కొరియా ఇవాళ తెల్లవారు జామున ప్యోంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని సైట్ నుంచి ఈ రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. జపాన్ సముద్రంలోకి నార్త్ కొరియా ఈ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. దీనిని జపాన్ కోస్టుగార్డు కూడా ధృవీకరించినట్లు తెలిపింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా దక్షిణ కొరియాలోని ఓడరేవుకు అణు బాలిస్టిక్ క్షిపణులను పేల్చగల జలాంతర్గామిని అమెరికా తీసుకొచ్చింది. ఈ జలాంతర్గామి వచ్చిన కొన్ని గంటల తర్వాత నార్త్ కొరియా తన తూర్పు తీరంలో ఉన్న సముద్రంలో రెండు క్షిపణులను లాంచ్ చేసింది. సియోల్, వాషింగ్టన్ ల మధ్య రక్షణ సహకారం పెరిగిన నేపథ్యంలో రెండు కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులను విశ్లేషిస్తున్నట్లు దక్షిణ కొరియా సైన్యం పేర్కొనింది. మిత్రపక్షాలు నిన్న (మంగళవారం) సియోల్‌లో మొదటి న్యూక్లియర్ కన్సల్టేటివ్ గ్రూప్ ఈ మీటింగ్ ను నిర్వహించాయి. 1981వ సంవత్సరం తర్వాత మొదటి సారిగా బుసాన్‌లో ఒక అమెరికన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ పోర్ట్ సందర్శన చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
*2023లో 100కి పైగా పులులు మృతి
ఈ ఏడాది ‘ప్రాజెక్ట్ టైగర్’ 50వ వార్షికోత్సవాన్ని భారతదేశం జరుపుకుంటోంది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు పులుల సంరక్షణ కోసం కోట్లాది రూపాయలను వెచ్చించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేడుకల కోసం ప్రభుత్వం 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ను కేటాయించింది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో 100కు పైగా పులులు చనిపోయాయి. చాలా వరకు సహజ మరణాలకు కారణమని చెప్పారు, అయితే పులుల మరణానికి ఇది సరైన కారణమా? నిధుల కొరతే కారణమా లేక మరేదైనా కారణం ఉందా? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) అధికారిక సమాచారం ప్రకారం, ఈ ఏడాది జూలై 10 వరకు దేశంలో 106 పులులు చనిపోయాయి. ఇందులో జూన్ 30కి ముందు అంటే 100 మంది చనిపోయాయి. వీటిలో గరిష్టంగా మధ్యప్రదేశ్‌లోని 3 రాష్ట్రాల్లో 27, మహారాష్ట్రలో 21, కేరళలో 19 మరణాలు నమోదయ్యాయి. పులుల మరణానికి అధికారిక కారణం లేదు, అయితే పబ్లిక్ డొమైన్‌లో దాని కారణం సహజమైనది. కానీ వేటాడటం కాదు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పులుల మరణానికి ‘వేటాడటం’ అతిపెద్ద కారణం అని కొట్టిపారేసింది. పులుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల సహజ కారణాల వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని మంత్రిత్వ శాఖ చెబుతోంది. మంత్రాలయంలో ప్రాజెక్ట్ టైగర్‌ను చూస్తున్న అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్.పి.యాదవ్ భారతదేశంలోని అడవులలో పులుల వృద్ధి రేటు 6 శాతంగా ఉందని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. సాధారణంగా పులి వయస్సు 10 నుండి 12 సంవత్సరాలు. ఆ కోణంలో పులుల సహజ మరణం దాని నిర్దిష్ట పరిధిలోనే జరుగుతుంది. వేటగాళ్లు పులుల కోసం వెతుకుతున్నారని అతను నమ్ముతున్నప్పటికీ, ఇతర దేశాలలో పులి శరీర భాగాలకు మంచి డిమాండ్ ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఏప్రిల్ 9, 2023న, ప్రాజెక్ట్ టైగర్‌కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో పెరిగిన పులుల సంఖ్య గురించి చెప్పారు. 2022లో దేశంలోని అడవిలో 3,167 పులులు ఉంటాయని అంచనా. కాగా, ఈ నెలాఖరులోగా పర్యావరణ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల వారీగా పులుల సంఖ్యను కూడా విడుదల చేయనుంది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతలు నిరంతరం చనిపోవడం కొత్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 8 చిరుతలు చనిపోగా, వాటిలో 3 పిల్లలు భారతదేశంలోనే జన్మించాయి. ఇప్పుడు పార్కులో 15 చిరుతలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
*మళ్లీ పెరిగిన బంగారం ధరలు
గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నిన్న కాస్త తగ్గాయి. అయితే నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జులై 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపైరూ. 120.. 24 క్యారెట్ల బంగారం ధరపై కూడా రూ. 120 పెరిగింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,130 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,130గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,550 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర బుధవారం రూ. 78,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 300 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 78,000లుగా ఉండగా.. చెన్నైలో రూ. 81,400లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 77,250గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 81,400లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 81,400ల వద్ద కొనసాగుతోంది.
*భర్తతో ఆ పని చేసి వాళ్ల నోరు మూయించిన ప్రణీత..
తెలుగులో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన కన్నడ భామ ప్రణీత హీరోయిన్ గా సౌత్ స్టార్ హీరోల పక్కన సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2021లో పెళ్లి చేసుకున్న ఈ భామ.. గత ఏడాది ఒక పాపకి కూడా జన్మనించింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెగ ట్రై చేస్తుంది.. సోషల్ మీడియాలో అందాలతో మత్తెక్కిస్తుంది.. రోజు రోజుకు అందాల ఆరాబోతలో బౌండరీలు చేరిపేస్తుంది.. ఇటీవల పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.. తనపై వస్తున్న ట్రోల్ల్స్ కు చెక్ పెడుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. హీరోయిన్ గా ఎంత మోడరన్ గా కనిపించినా.. వ్యక్తిగతంగా మాత్రం ప్రణీత సనాతన ధర్మాన్ని బాగా ఫాలో అవుతుంటుంది. ఈ క్రమంలోనే భీమన అమావాస్య సందర్భంగా తన భర్త పాదలకు పసుపు, కుంకుమ, పూలతో పూజ చేసింది. ఈ ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భీమన అమావాస్య రోజున ఇలా పూజ చేయడం కర్ణాటకలో సంప్రదాయంగా భావిస్తారు. ఇదే పూజని ప్రణీత గత ఏడాది కూడా నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అప్పటిలో విమర్శలు, ట్రోల్స్ ఎదురుకుంది. అంతేకాదు.. కొంతమంది ఫెమినిస్టులు ప్రణీత చేసిన పూజని విమర్శించారు. దీని పై డిబేట్ లు కూడా చేశారు. అప్పటిలో ఆ విమర్శలు, ట్రోల్స్ గురించి ప్రణీతని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ‘నేను హీరోయిన్ కాబట్టి, గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నానని పూజలు, పునస్కారాలు చేయనని అనుకోవడం వారి తప్పు’ అంటూ సున్నితంగా రియాక్ట్ అయ్యింది. ఇక ఈ ఏడాది మళ్ళీ తన భర్త పాదాలకు పూజ చేసి ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. విమర్శలు, ట్రోల్స్ చేసేవారికి గట్టి పంచ్ ఇచ్చింది. ‘భీమన అమావాస్య సందర్భంగా నేడు పూజ చేశాను. దీని వల్ల గత ఏడాది ట్రోల్స్ అండ్ విమర్శలు చూశాను. ఇది మీకు పురుష ఆధిపత్యంలా ఉండొచ్చు. కానీ నా వరకు ఇది నా సనాతన ధర్మం. ఈ పూజకి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి మరెన్నో పూజలకు అంతటి ప్రాముఖ్యత ఎందుకొచ్చింది అనేదానికి చాలా కథలే ఉన్నాయి..అంటూ ట్రోల్స్ చేస్తున్న వారి నోరు మూయించింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.