‘సలార్’ టీజర్ వచ్చేసింది..
పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ విఫలం చెందడంతో సలార్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తెరకెక్కించాడు.. ఊరమాస్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తుండటం తో ఫ్యాన్స్ లో రెట్టింపు ఉత్సహం తో ఉన్నారు.. సలార్ టీజర్ టైం ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు డార్లింగ్ ను చూద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న సలార్ సినిమా ప్రభాస్‌కు సరిగ్గా సరిపోతుందనేది అంచనా. అందుకే సలార్ సినిమాపై ఇప్పుడు అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి..తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది.. ప్రభాస్ మాస్ లుక్ లో అదరగోట్టారు.. కే. జీ. ఎఫ్ మించిన యాక్షన్ ఇందులో ఉన్నట్లు టీజర్ లో చూపించారు.. టీజర్ లో డార్లింగ్ దుమ్ము దూళిపాడు..ఇక టీజర్ లో.. KGF ని మించి మాస్, యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు చూపించారు. KGF లో హీరోకి ఇచ్చినట్టే ఇక్కడ కూడా ప్రభాస్ గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఇక సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా ఉండబోతున్నట్టు ప్రకటించారు. సలార్ పార్ట్ 1 ceasefire అని టీజర్ చివర్లో వేశారు. మొత్తానికి ఈ టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది.. సినిమా సూపర్ హిట్ అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. దీని తర్వత NTR 31 మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కంప్లీట్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కంప్లీట్ చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది.పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యి ఈ సినిమా థియేటర్స్ లోకి రావడానికి మరో ఆరు నెలలకి పైగా టైం పడుతుంది..అప్పటివరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఏది ఏమైనా సలార్ టీజర్ మాత్రం ఇంటర్నెట్ షేక్ చేస్తుంది.. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
ఏపీలో భారీ వర్షాలు..ఆ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు..
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జల దిగ్బందంలో ఉన్నాయి.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. తెలంగాణాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరో మూడు రోజులు భారీ వర్షాలు కూరవనున్నాయని అధికారులు వెల్లడించారు… కొమురంభీం జిల్లాలోని కాగజ్‌నగర్ పెద్దవాగులో నీటి ప్రవాహం పెరిగింది. కాగజ్‌గనర్ మండలం అందవెల్లి బ్రిడ్జి తాత్కాలిక రోడ్డు నీట మునిగింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.. కాగజ్‌నగర్-దహెగాం రవాణ వ్యవస్థ పూర్తిగా బ్రేక్ పడినట్లయింది. కాగజ్‌నగర్ అందవెల్లి పెద్దవాగులో ఒకరు గల్లంతయ్యారు. పెద్దవాగు దాటే క్రమంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దాంతో సదరు వ్యక్తి నీటిలో కొట్టుకుపోయారు. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.. పలు ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మరో వైపు ఏపీ లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. దాంతో.. నంద్యాల జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఊపందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో వారం రోజులుగా మంచి వర్షాలు లేకుండా పోయాయి.. ఇప్పుడు బంగాలఖాతంలో ఆవర్తనం ఏర్పడింది.. దీంతో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కాగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..
చిన్నారి కిడ్నాప్ కలకలం
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం ఘటన మరువక ముందే ఘట్‌కేసర్‌లో నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ స్థానికంగా సంచలంగా మారింది. మేడ్చల్ లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని కనిపించకుండా పోయింది. పాప కోసం ఎంత వెతికినా ఫలితం లేకుండాపోయింది. భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇంటిముందుకు ఆడుకుంటుందని ఇంతలోనే ఎక్కడికి వెళ్లిందో తెలియటం లేదని వాపోయారు. మా పాపను సురక్షితంగా వారి వద్దకు చేర్చాలని కన్నీరుపెట్టుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాపను తెలిసిన వారే కిడ్నాప్ చేశారా? అక్కడ వున్న సీసీ ఫుటేజ్ ను ఆధారంగా చిన్నారిని జాడను కనిపెట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న పెద్ద అంబర్ పేట్ హైవే చెక్ పోస్ట్ సమీపంలో బైక్ పై ఓ బాలిక వెళుతున్న క్రమమంలో ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి అక్కడినుంచి హైవే పక్కకి లాక్కుని వెళ్లారు. తనపై అత్యాచారం చేశారు. ఆ ఇద్దరి యువకుల నుంచి బాలిక తప్పించుకొని రోడ్డుపైకి వచ్చింది. అక్కడి నుంచి వెళ్లే వారికి హెల్ప్ అంటూ అడిగినా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. నిస్సహాయ స్థితిలో రోడ్డుపై సహాయం కోసం అరుస్తున్న బాలికను చూసిన ఓ హిజ్రా చలించిపోయాడు. పరుగున ఆ బాలిక వద్దకు వచ్చి ఏం జరిగింది అని అడగగా జరిగిన విషయాన్ని ఆ హిజ్రాకు చెప్పింది. హిజ్రా వద్ద వున్న ఫోన్ తీసుకుని ఆ బాలిక తన అన్నకు కాల్ చేసింది. వెంటనే ఘటన స్థలానికిబాలిక తల్లిదండ్రులు.. పోలీసులు.. చేరుకున్నారు. యువకుల నుంచి తప్పించుకునే సమయంలో బాలిక తీవ్రంగా గాయాలయ్యాయి. బాలికను హయత్ నగర్ మ్యాక్సీ క్యూర్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.
తగ్గనున్న వందేభారత్ ట్రైన్ ఛార్జీలు.. కొన్ని రూట్లను సమీక్షిస్తున్న రైల్వేశాఖ..
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లను ఇప్పటికే పలు రూట్లలో ప్రవేశపెట్టారు. సెమీ హైస్పీడ్ రైలుగా ప్రసిద్ధి చెందిన వందేభారత్ రైళ్లు తక్కువ సమయంలోనే ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఇదిలా ఉంటే వందేభారత్ ట్రైన్ ఛార్జీలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఛార్జీలపై రైల్వే శాఖ సమీక్షిస్తుంది. అయితే ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న మార్గాల్లో మాత్రమే ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని రూట్లలో వందేభారత్ రైళ్ల ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది. దీంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఛార్జీలను తగ్గించేందుకు రైల్వే శాఖ యోచిస్తోంది. తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కొన్ని స్వల్ప-దూర వందే భారత్ రైళ్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది. ఇండోర్-భోపాల్, భోపాల్-జబల్‌పూర్, నాగ్‌పూర్-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వంటి వందే భారత్ రైళ్లు ఈ కోవలోకి వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భోపాల్-జబల్పూర్ వందే భారత్ సర్వీస్ 29 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయగా, ఇండోర్-భోపాల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 21 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే కలిగి ఉంది. ప్రయాణానికి ఏసీ చైర్ కార్ టిక్కెట్‌కు రూ.950 మరియు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టిక్కెట్‌కు రూ.1,525 ఖర్చవుతుంది. రైల్వే శాఖ సమీక్ష తర్వాత ఎక్కువ మంది రైలు సేవలు వినియోగించుకునేలా ఈ వందే భారత్ సర్వీస్ ఛార్జీలు గణనీయంగా తగ్గించవచ్చని తెలుస్తోంది. నాగ్‌పూర్-బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలను కూడా సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఆక్యుపెన్సీ 55 శాతం ఉంది. దాదాపుగా 5.30 గంటల ప్రయాణ సమయం ఉన్న ఈ రైలులో ధరలను తగ్గిస్తే మరింత మంది ప్రయాణికులను ఆకర్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ రైలులో ఎగ్జిక్యూటివ్ తరగతికి రూ. 2,045 అయితే చైర్ కార్‌కు రూ. 1,075 ఛార్జీగా వసూలు చేస్తున్నారు. ఆక్యుపెన్సీ కారణంగా ఈ మే నెలలో ఈ రైలు స్థానంలో తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును తీసుకువచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 46 వందే భారత్ రైళ్లు సేవల్ని అందిస్తున్నాయి. అత్యధికంగా కాసరగోడ్ నుండి త్రివేండ్రం రైలు ఆక్యుపెన్సీ(183 శాతం) గా ఉంది. ఆ తరువాత త్రివేండ్రం నుండి కాసరగోడ్ వందే భారత్ రైలు (176 శాతం), గాంధీనగర్-ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (134 శాతం) ఉన్నాయి. కొన్ని రూట్లు మినహా మిగతా అన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.
మెక్సికోలో ఘోరం.. 27 మంది ప్రాణాలు తీసిన బస్సు ప్రమాదం.
మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పర్వత ప్రాంతం గుండా బస్సు వెళ్తున్న సమయంలో లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది మరణించారని పోలీసులు తెలిపారు. 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి మెకానికల్ వైఫల్యమే కారణం అని అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. పర్వతాలు, మలుపులు ఉంటే రియోట్ ప్రాంతం అయిన మాగ్డలీన పెనాస్కో పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక రవాణా సంస్థ నిర్వహించే బస్సు మంగళవారం రాత్రి రాజధాని మెక్సికో సిటీ నుండి బయలుదేరి శాంటియాగో డి యోసోండువా పట్టణానికి వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని.. దీంతో 25 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయిందని రాష్ట్ర అధికారి జీసస్ రోమెరో విలేకరుల సమావేశంలో తెలిపారు. బస్సు నడుపుతున్న సంస్థ మెక్సికో సిటీ నుంచి రోజూవారీ సేవలు అందిస్తుందని అతను తెలిపారు. మెక్సికోలో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సర్వసాధరణంగా మారాయి. ఆ దేశంలో చాలా మంది ప్రజలు బస్సులపై ఆధారపడుతారు. మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఐస్‌లాండ్ రాజధాని చుట్టూ ఒకే రోజులో 1600 భూకంపాలు..
ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జావిక్ పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే దాదాపుగా 1600 భూ ప్రకంపాలు నమోదు అయ్యాయని ఆ దేశ వాతావరణ కార్యాలయం బుధవారం వెల్లడించింది. అగ్నిపర్వతం విస్పోటనం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అగ్నిపర్వత వ్యవస్థపై ఉన్న మౌంట్ ఫాగ్రాడాల్స్‌ఫ్జల్ క్రింద ప్రకంపనలు ప్రారంభమయ్యాయని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపాయి. ఐస్ లాండ్ దేశంలో నైరుతి కొనలో ఉన్న రేక్‌జానెస్ ద్వీపకల్పంలో గత రెండేళ్లలో రెండు విస్పోటనాలు సంభవించాయి. 1600 ప్రకంపనలు సంభవిస్తే ఇందులో నాలుగు ప్రకంపనలు 4 కన్నా ఎక్కువ తీవ్రతతో సంభవించాయి. భూకంప కార్యకలాపాల వల్ల విమానయాన సర్వీసులకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మొత్తం యూరప్ లోనే ఐస్‌లాండ్ లో అత్యంత చురుకైన అగ్ని పర్వతం ఉంది. ఉత్తర అట్లాంటిక్ ద్వీపం ఆర్కిటిక్ సర్కిల్ కు సరిహద్దుల్లో ఉంది. ఇది యూరేషియన్, ఉత్తర అమెరికా టెక్టానిక్ ప్లేట్ వేరు చేసే ప్రాంతంలో ఈ అగ్నిపర్వతం ఉంది. 2021, 2022లో జరిగిన అగ్ని పర్వతం విస్పోటనాల్లో బయటకు వచ్చిన లావా దాదాపుగా ఫాగ్రాడల్స్‌ఫ్జాల్ పర్వతం వరకు వ్యాపించింది. ఇది రాజధాని రెక్జావిక్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్నిచూసేందుకు వేలాది మంది సందర్శకులు కూడా వచ్చారు. గతంలో ఈ అగ్నిపర్వత విస్పోటనం వల్ల విడుదలైన బూడిద ఆ ప్రాంతంలో వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం చూపించింది.
అమెరికాలో మరో జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన.. నల్లజాతి మహిళపై పోలీసుల దాష్టీకం
అమెరికాలో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన పునరావృతం అయింది. భర్త అరెస్టును రికార్డు చేస్తున్న ఓ నల్లజాతి మహిళపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఆమెను నేలపైకి తోసి, మోకాలితో ఆమెను తొక్కేసి దాడి చేశారు. ఆమె కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టారు. ఈ ఘటన లాస్ ఏంజెలెస్ లోని లాంకాస్టర్ ప్రాంతంలో వింకో గ్రాసరీ స్టోర్ సమీపంలో జూన్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రాసరీ స్టోర్ లో దొంగతనం చేశారనే ఆరోపణలపై ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాము ఏం నేరం చేయలేదని, తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెబుతూ.. ఆమె అరెస్ట్ ఉదంతాన్ని మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. భర్త చేతికి సంకేళ్లు వేస్తుండగా ఆమె రికార్డ్ చేసింది. ఇది చూసిన సదరు పోలీస్, ఆమె చేతి నుంచి మొబైల్ లాక్కుని, నేలపైకి తోసేశాడు. అక్కడితో ఆగకుండా గతంలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని తలపించే విధంగా ఆమెను మోకాలితో తొక్కిపట్టి, కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టారు. కళ్లముందే తన భార్య పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న పోలీసుల భర్త వేడుకున్నాడు. తన భార్యను ఏం చేయొద్దని, ఆమె క్యాన్సర్ తో బాధపడుతుందని చెప్పాడు. ఈ ఉదంతాన్ని అక్కడ ఉన్న వారు ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పోలీసులు తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై లాస్ ఏంజెలిస్ కౌంటీ పోలీసులు ఓ ప్రకటిన విడుదల చేశారు. ఈ ఘటనకు కారణమైన పోలీసులను విధుల్లోంచి తొలగించినట్లు ప్రకటించారు. 2020లో మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఓ పోలీస్ దాడి చేసి మెడపై మోకాలితో అదిమిపట్టడంతో ఊపిరాడక ఆ ఆఫ్రో-ఆఫ్రికన్ మరణించారు. ఈ ఘటన యూఎస్ లో సంచలనంగా మారింది. ఫ్లాయిడ్ మరణానికి జాతి వివక్ష కారణం అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఉదంతం డొనాల్డ్ ట్రంప్ అధికారం కోల్పోవడానికి కూడా ఓ కారణమైంది.
పెరిగిన బంగారం ధరలకు బ్రేక్
మహిళలకు గుడ్‌న్యూస్. పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (జులై 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,060లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. పసిడి ధరలు (Gold Price Today 6th July 2023) దేశంలోని పలు నగరాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,220గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,600లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,560 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060 వద్ద కొనసాగుతోంది.