*జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షపై సీఎం జగన్ సమీక్ష
జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాల పై విస్తృత్రంగా ప్రచారం చేయాలన్నారు. రెవెన్యూ విభాగంలో వస్తున్న విప్లవాత్మకంగా మార్పులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చాలా రాష్ట్రాల్లో మండలానికి ఒకరిద్దరు సర్వేయర్లు మాత్రమే ఉన్నారని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయంలో కూడా సర్వేయరు ఉన్నారని సీఎం జగన్ ఈ సందర్భంగా చెప్పారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతోందన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకు వస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఇంటిలో నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా సాంకేతికతను తీసుకు వస్తున్నామన్నారు. అలాగే భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాలస్థాయిలో మొబైల్ కోర్టులు కూడా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.
*రాఖీ కట్టేందుకు 8 కి.మీ నడక.. కాళ్లకు చెప్పులేకుండా తమ్ముడి ఇంటికి అక్క
రాఖీ పండుగ అనగానే అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల బంధం గుర్తుకు వస్తుంది. రక్షా బంధన్ వారి మధ్య బంధానికి ప్రతీక. జీవితాంతం రక్షగా ఉంటాడనే విశ్వాసానికి ప్రతీకి ఈ రాఖీ పండుగ. కానీ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో ఈ బంధాలు కాస్త సన్నగిల్లుతున్నాయి. అలాంటి రోజుల్లో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఒంటరిగా 8 కిలోమీటర్లు నడిచింది. శరీరంలో బలం చచ్చిపోయినా.. తమ్ముడిపై తనకున్న ప్రేమకు చావు లేదని నిరూపించింది. ఎర్రటి ఎండను పట్టించుకోకుండా కాలినడకన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు బయలుదేరింది. తల్లిదండ్రుల కంటే తోబుట్టువులే ముఖ్యమని ఈ ఘటన నిరూపిస్తోంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు నడుచుకుంటూ పొరుగున ఉన్న కొండయ్యపల్లికి వెళ్లింది. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా చెప్పులు లేకుండా 8 కిలోమీటర్లు నడిచి వస్తున్న వృద్ధురాలిని చూసిన ఓ యువకుడు ‘ఎక్కడికి వెళ్తున్నావు’ అంటూ పలకరించాడు. అప్పుడు వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టబోతున్నానని బదులిచ్చింది. తను కొత్తపల్లిలో ఉంటున్నానని, కొండయ్యపల్లిలోని తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు నడుచుకుంటూ వెళ్తున్నానని చెప్పింది. ఆ వీడియోను ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. తమ్ముడంటే అంటే ఎంత ప్రేమో చెబుతూ తమ అక్కా, చెల్లెల్లను గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. మానవ సంబంధాలన్నీ డబ్బు సంబంధ బాంధవ్యాలుగా మారిన ఈ కాలంలో ఇలాంటి ప్రేమ నిజంగా అద్భుతం అని కొనియాడారు. ఇది కదా అక్క-తమ్ముడి అనుబంధానికి నిదర్శనం ఈ అనుబంధాన్ని మన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఇలాగే కొనసాగించాలని కమెంట్ చేస్తున్నారు.
*హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీ.. ఎందుకొచ్చాడంటే..?
పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఓ వ్యక్తి హైదరాబాద్ కు రావడం కలకలం రేపుతుంది. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీసా లేకుండా నేపాల్ మీదుగా భారత్ లోకి ఫయాజ్ వచ్చాడు. దీంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు పాకిస్థాన్ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఫయాజ్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. అయితే, హైదరాబాద్ కు చెందిన ఓ యువతి కోసం ఫయాజ్ ఇక్కడికి వచ్చినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి కి ప్రెగ్నెన్సీ కావడంతో ఆమెను కలవడానికి నేపాల్ మీదుగా హైదరాబాద్ ఫయాజ్ వచ్చినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఫయాజ్ నుంచి పోలీసులు పలు విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో సదరు యువతి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చింది. మహ్మద్ ఫయాజ్ ను చూపించాలని పోలీసులను వేడుకుంది. అయితే, ఫయాజ్ నుంచి పూర్తి విషయాలు తీసుకున్న తర్వాతే.. పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక, పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ అనే మహిళ తన నలుగురు పిల్లలతో పబ్జీలో పరిచయమై యువకుడి కోసం అక్రమంగా ఉత్తరప్రదేశ్ వచ్చిన ఇష్యూ ఇంకా దేశం మరిచిపోలేదు. అయితే, అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ.. తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లా ఖాన్ ను కలిసేందుకు పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఫ్రావిన్స్ లోని దీర్ నగరానికి వెళ్లింది. అయితే, పాకిస్థాన్-భారత్ రెండు దేశాలకు చెందిన వారి మధ్య ప్రేమ వ్యవహారాలు కొనసాగుతున్నాయి.
*చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇసుకాసురుడు అంటు చంద్రబాబు జగన్‌పై ఆరోపణలు చేశారని, ఇసుక విధానం పై 19 సార్లు చంద్రబాబు జీవోలు తెచ్చారని పేర్కొన్న మంత్రి.. ఇసుకను దోచిన వారే ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. శాఖను సక్రమంగా నిర్వహించటం వల్లే ఆదాయాలను పెంచగలిగామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉచితం అని చెప్పి ప్రజలకు సున్నం పెట్టింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. ఎమ్మార్వో వనజాక్షి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటే చంద్రబాబు ఏం చేశాడని మంత్రి ప్రశ్నలు గుప్పించారు. అప్పట్లో లోకేష్‌కు ప్రతి నెల 500 కోట్లు ముట్టేవని ఆరోపణలు ఉన్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్జీటీనే 100 కోట్ల జరిమానా విధించిందని.. కరకట్ట ఇసుక తవ్వకాలపై పెనాల్టీ వేసింది వాస్తవం కాదా అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే మెరుగైన ఇసుక విధానం తీసుకుని వచ్చామని ఈ సందర్భంగా చెప్పారు. జీవో 25తో ఆపరేషన్స్ అన్నీ చేస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో ఇన్ని వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఏడాదికి 750 కోట్ల ఆదాయం వస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుందని తెలిసి కూడా చంద్రబాబు ఎందుకు టెండర్లు వేయలేదన్నారు. సమస్యలు ఉంటే ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి అప్పుడు ఉండేదని.. ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టామని మంత్రి స్పష్టం చేశారు. మైనింగ్‌పై కఠిన చట్టాలు కూడా చేశామని మంత్రి వెల్లడించారు. దాదాపు 18 వేల కేసులు నమోదు చేశామన్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్ టీం ఏర్పాటు చేశామన్న మంత్రి.. వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. ఇసుక స్టోరేజ్ పాయింట్ల దగ్గరకు వెళ్ళి తండ్రి, కొడుకులు సెల్ఫీలు దిగుతారని.. చంద్రబాబు హయాంలో మైనింగ్‌లో రెవెన్యూ 2 వేల కోట్లు దాటలేదన్నారు.
*పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపు..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్ర పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18-22 వరకు 5 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. గురువారం ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఈ సమావేశాల గురించి వెల్లడించారు. ‘‘పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (17వ లోకసభ 13 సెషన్, రాజ్యసభ 261వ ఎడిషన్) సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించబడుతాయి. ఈ అమృత్ కాల్ లో పార్లమెంట్ లో ఫలవంతమైన చర్చల కోసం ఎదరుచూస్తున్నాము ’’ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. అయితే ఈ సమావేశాలకు కేంద్రం ఎందుకు పిలుపునిచ్చిందనే విషయాన్ని మంత్రి వెల్లడించలేదు.
*105 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. రైల్వే బోర్డు సీఈఓ, చైర్‌పర్సన్‌గా మహిళ
భారత రైల్వే చరిత్రలో అరుదైన నియామకం జరిగింది. 105 ఏళ్ల రైల్వే చరిత్రలో తొలిసారి ఓ మహిళను రైల్వే బోర్డు సీఈఓ, చైర్‌పర్సన్ గా నియామకం జరిగింది. జయ వర్మ సిన్హాను రైల్వే బోర్డు సీఈఓ, చైర్‌పర్సన్‌గా కేంద్రం నియమించింది. జయ వర్మ సిన్హా అలహాబాద్ విశ్వవిద్యాలయం విద్యనభ్యసించారు. 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS)లో చేరారు.నార్త్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, తూర్పు రైల్వే మూడు రైల్వే జోన్లలో పనిచేశారు. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (IRMS) (ఆపరేషన్స్ & బిజినెస్ డెవలప్‌మెంట్) సభ్యురాలిగా, రైల్వే బోర్డు ఛైర్మన్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి జయ వర్మ సిన్హా నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) ఆమోదించింది. ప్రస్తుతం రైల్వే బోర్డు సీఈఓగా ఉన్న అనిల్ కుమార్ లాహోటి స్థానంలో సెప్టెంబర్ 1 నుంచి జయ వర్మ సిన్హా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె పదవీ కాలం ఆగస్టు 31,2024తో ముగుస్తుంది. ఇటీవల కాలంలో బాలాసోర్ రైలు దుర్ఘటన సమయంలో సంక్షిష్టమైన సిగ్నలింగ్ వ్యవస్థ గురించి మీడియాకు వివరిస్తూ తొలిసారిగా ప్రముఖంగా కనిపించారు. అంతకుముందు బంగ్లాదేశ్ లోని ఢాకా, కోల్‌కతాలను కలిపే ‘మైత్రి ఎక్స్‌ప్రెస్’ ప్రారంభోత్సవంలో కీలక జయ వర్మ కీలక పాత్ర పోషించారు. ఢాకాలోని భారత హైకమిషన్‌లో రైల్వే సలహాదారుగా నాలుగు సంవత్సరాలు పనిచేశారు.
*పుతిన్ తర్వాత.. జీ20 సమ్మిట్‌కు జిన్‌పింగ్ డుమ్మా..!
జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ముస్తాబవుతోంది. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ20 దేశాధినేతలతో పాటు మరో 9 ఆహ్వానిత దేశాల అధినేతలు, అధికారులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా పుతిన్ పూర్తిగా సొంత దేశానికే పరిమితమయ్యారు. ఈ సమావేశాలకు పుతిన్ రావడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ కూడా ఈ సమావేశాలకు గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పలు రిపోర్టులు వస్తున్నాయి. అయతే దీనిపై ఇటు చైనా విదేశాంగ అధికారులు కానీ, విదేశాంగ అధికారులు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమావేశానికి వస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వాణిజ్యంగా, భౌగోళిక పరంగా అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండు దేశాధినేతలు జీ20 వేదికగా సమావేశమవుతారని అంతా అనుకున్నారు. చివరిసారిగా గతేడాది ఇండోనేషియా బాలిలో జరిగిన జి20 సమావేశాల్లో బైడెన్, జిన్ పింగ్ సమావేశమయ్యారు. ఇప్పటికే రష్యా అధినేత పుతిన్ రావడం లేదని చెప్పారు, తన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వస్తున్నట్లు తెలిపారు. జిన్ పింగ్ స్థానంలో చైనా ప్రధాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జీ20 సమావేశాలకు ముందు చైనా విడుదల చేసిన మ్యాపులు భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతను పెంచాయి. భారత అంతర్భాగాలైన అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ చైనా తన భూభాగాలుగా పేర్కొంటూ మ్యాపులను విడుదల చేయడంతో వివాదం మొదలైంది. అయితే ప్రస్తుతం ఏ కారణాల వల్ల జిన్ పింగ్ హాజరు కావడం లేదనే విషయం తెలియదు.
*జైలర్ కలెక్షన్స్ ను కూడా చిత్తు చేసిన మందు బాబులు
మందుబాబులు ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలు కొట్టే విషయంలో ముందే ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే న్యూ ఇయర్ కి మందు రికార్డు స్థాయిలో అమ్ముడుపోతుందో కేరళలో కూడా ఓనం పండుగకి ఈసారి మద్యం అమ్మకాల రికార్డులు బద్దలు అయ్యాయి. నిజానికి కేరళ ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ ఓనం. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడికో ఉద్యోగాల కోసం వెళ్లిన వారు సైతం ఇళ్ళకి తిరిగి వెళ్లి పండుగ పూర్తి చేసుకుని ఉద్యోగాలకి వెళుతూ ఉంటారు. ఇక కొద్దిరోజుల క్రితం జరిగిన ఓనం వేడుకల నేపథ్యంలో మద్యం విక్రయాలు కూడా దుమ్ము రేపినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ఓనం సందర్భంగా కేరళ రాష్ట్రంలో వందల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. ఉత్రాడం రోజు వరకు ఉన్న లెక్కలను పరిశీలిస్తే గత ఏడాది రికార్డులను కూడా బద్దలు కొట్టినట్లు తెలుస్తుంది. ఉత్రాడం రోజు వరకు గడిచిన ఎనిమిది రోజుల్లో బెవ్కో రూ.665 కోట్ల విలువైన మద్యం విక్రయించింది. గతేడాది ఇదే సమయానికి రూ.624 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. అంటే ఈసారి 41 కోట్ల విలువైన మద్యం అధికంగా అమ్ముడుపోయింది. ఒక్క ఉత్రాడం రోజునే 121 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 116.2 కోట్ల విలువైన మద్యం కేవలం అవుట్ లెట్ల ద్వారానే విక్రయించబడింది. గతేడాది అవుట్ లెట్ల ద్వారా రూ.112.07 కోట్ల మద్యం విక్రయించారు. మద్యం అమ్మకాలంలో ఈసారి ఇరింగలకుడ ప్రథమంగా నిలిచింది. ఇరింగలకుడలో 06 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ విషయంలో కొల్లం రెండో స్థానంలో ఉంది. కొల్లం ఆశ్రమ ఔట్‌లెట్ విక్రయాల్లో కూడా కోటి దాటింది. ఇక్కడ రూ.1.01 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. అయితే ఈసారి మద్యం విక్రయాల్లో చినకనాల్ వెనుక పడింది. ఈ సారి ఉత్రాడం నాడు అతి తక్కువ మద్యం విక్రయించిన ఔట్‌లెట్‌గా చినకనాల్ పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఉత్రాడం రోజు రూ.6.32 లక్షల విక్రయాలు మాత్రమే జరిగాయి. కాగా, అమ్మకాల ఆదాయంలో మార్పు ఉంటుందని బెవ్కో ఎండీ చెప్పుకొచ్చారు. తుది టర్నోవర్‌ను లెక్కించినప్పుడు అమ్మకాలు మరింత పెరుగుతాయని బెవ్‌కో ఎండీ చెబుతున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఓనం మద్యం అమ్మకాలు రజనీకాంత్ జైలర్ సినిమా కలెక్షన్స్ ను దాటేశాయి అని చెప్పక తప్పదు. అదేమంటే జైలర్ సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ 600 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా మద్యం అమ్మకాలు అయితే ఏకంగా ఎనిమిది రోజుల్లో 665 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం.
*రజినీ విలన్ పై లైంగిక వేధింపుల కేసు
సమాజంలో ఒక సాధారణ వ్యక్తి తప్పు చేయడానికి, ఒక సెలబ్రిటీ తప్పు చేయడానికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఒక నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్న సమయంలో వారు ఎలాంటి తప్పు చేసినా అది వారి కెరీర్ నే దెబ్బ తీస్తుంది. అయితే ఇక్కడ.. సెలబ్రిటీ అవ్వకముందు వరకు ఒక నటుడు చేసిన తప్పును మర్చిపోయిన నెటిజన్స్ .. అతను సెలబ్రిటీగా మారక మళ్లీ ఆ తప్పును తిరగతోడి అతనిని విమర్శిస్తున్నారు. అతడు ఎవరో కాదు.. నటుడు వినాయకన్. ఈ పేరు గత కొన్ని రోజులుగా చాలా గట్టిగ వినిపిస్తున్న విషయం తెల్సిందే. జైలర్ లో రజినీకాంత్ కు ధీటుగా విళబీజాన్ని చూపించిన నటుడే వినాయకన్. ముఖ్యంగా వర్మ ప్లే లిస్ట్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నాడు. మొదటి చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను స్టార్ చేసిన వినాయకన్ .. ఇప్పుడు జైలర్ సినిమాతో ఒక స్టార్ డమ్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో అతడి నటనను ప్రశంసిస్తున్న నేపథ్యంలో కొంతమంది మాత్రం అతడి పాస్ట్ లో ఉన్న ఒక లైంగిక వేధింపుల కేసును తిరిగితోడి వైరల్ గా మారుస్తున్నారు. అస్సలు ఆ కేసు ఏంటి.. అంటే.. 2019 లో వినాయకన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. మృదుల దేవి అనే మోడల్ తో అతను ఫోన్ లో అసభ్యంగా మాట్లాడాడు. “నీతో పాటు నీ తల్లిని తీసుకొని రూమ్ కు రా” అంటూ మాట్లాడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువవ్వడంతో అతడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే కొద్దిరోజులకే బెయిల్ పై వినాయకన్ బయటికి వచ్చాడు. దాదాపు నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ ఘటనను జైలర్ రిలీజ్ అయ్యాక వినాయకన్ హేటర్స్ మరోసారి తెరమీదకు తీసుకొచ్చారని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వార్త విన్న అభిమానులు. తప్పు ఎవరు చేసినా .. ఎప్పుడు చేసినా తప్పే. వినాయకన్ చేసింది కూడా తప్పే అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.