*జగనన్న ఆరోగ్య సురక్ష, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం సమీక్ష
జగనన్న ఆరోగ్య సురక్ష, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. దాదాపు 98శాతం గ్రామ, 77 శాతం వార్డు సచివాలయాల్లో వైద్య శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందని ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల్ని ప్రజలకు వివరించడంతో పాటు అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వాళ్ల విషయంలో వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చూయూత నివ్వడం చాలా ముఖ్యమని వారికి సూచించారు.శిబిరాలు నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుందని చెప్పారు. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నయం అయ్యేంత వరకూ చేదోడుగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. అర్బన్ ఏరియాల్లో 91 శాతం, రూరల్ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్ పూర్తయ్యిందని.. 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తిచేశారన్నారు. 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారని.. జగనన్న సురక్ష యాప్‌లో క్యాంపులకు వచ్చే వారి ఆరోగ్య పరిస్థితులను నమోదు చేస్తున్నామన్నారు. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలన్న దానిపై డేటా ఉంటుందన్నారు. జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా మండలంలో నాలుగు క్యాంపులు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రెండు గంటలకు పైగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష చేశారు. నవంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ‘వై ఏపీ నీడ్స్ జగన్’పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
*సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం.. పైలట్ ఏం చేశాడంటే.!
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ లోపాన్ని గమనించి హెలికాప్టర్‌ను సురక్షితంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు చేర్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్‌లో దేవరకద్రకు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన పర్యటన ఆలస్యమైంది. అయితే సీఎం పర్యటన రద్దు చేసుకోలేదని, మరో హెలికాప్టర్ వస్తే యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి బీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ సోమవారం పర్యటించనున్నారు. మూడు జిల్లాలు, నాలుగు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు ప్రగతి ప్రతాద హాజరవుతారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అన్ని చోట్లా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ అభ్యర్థులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తాజాగా సీనియర్ నేతలంతా పార్టీలో చేరారు. కీలక సమావేశాలకు కేసీఆర్ హాజరుకావడం రాజకీయ వేడిని రాజేస్తోంది.
*వేములవాడను దత్తత తీసుకుంటాను.. గెలిపించక పోతే ఇక్కడికి రాను
వేములవాడ ను దత్తత తీసుకుంటాను, గెలిపించక పోతే ఇక్కడికి రాను అంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చి, తెలంగాణ ను ఆగం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలా అని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాందీ ఛాలెంజ్ కి నేను సిద్దమన్నారు. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు, డిసెంబర్ నాడు చూద్దామన్నారు. హైద్రాబాద్ లో ఇడ్లీ సాంబార్ గ్యో బ్యాక్ అంటూ అప్పుడు ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ముత్తాత జవహర్ లాల్ తెలంగాణ బిడ్డల్ని చంపిచారని గుర్తు చేశారు. 1968 లో తెలంగాణ కి అన్యాయం జరుగుతుంది అని మర్ల పడ్డామని అన్నారు. ముదనష్టపు కాంగ్రెస్, 370 మంది పిల్లల్ని చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2001 లో గులాబీ జెండా ఎగిరింది, 2001 నుండి 2014 వరకు అన్నం తిన్నాడో, అటుకులు బుక్కరో కేసీఆర్, ఉద్యమం చేశారని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ తో నమ్మి పొత్తు పెట్టుకున్నమని, ఆ రోజుల్లో బలిదేవత సోనియా అమ్మ అని.. రేవంత్ రెడ్డి అన్నాడు, నేను అనడం లేదన్నారు. ఒక్క బేవకూఫ్ అన్నాడు. వాడు వీడు, కాంగ్రెస్ వాడు మేము తెలంగాణ ఇచ్చినాము అని అంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గాడు, హౌల గాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడు తుండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు మా కోసం కాదు, తెలంగాణ ఆగం కావద్దన్నారు. ఇక్కడ పోరాటం నిలబడ్డ వ్యక్తి తో కాదు, కాంగ్రెస్ తో మాత్రమే పోటీ అన్నారు. ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ కాదన్నారు. ఒక్క కేసీఆర్ ఎంత ఉంటాడు.. గింతంత ఉంటాడు, ఆయనను కొట్టడానికి ఎక్కడెక్కడో నుండి వస్తున్నారని తెలపారు. సింహం సింగిల్ గానే వస్తుంది, పందులు గుంపు గుంపు లుగా వస్తాయన్నారు. గిట్ల అన్నందుకు ఏమైనా కేసు పెడితే బోయిన పల్లి వినోద్ కుమార్ పై పెట్టండని అన్నారు. డికే శివ కుమార్ మన నెత్తి మీద పాలు పోసి పోయాడని, వాడు నాశనం చేసి పోయాడు, ఇక పిలవడం లేదన్నారు. బేకర్ గాల్లు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. గుజరాత్, ఢిల్లీ వాడు వచ్చిన కేసీఆర్ ను ఏం చేయలేరన్నారు. కేసీఆర్ ను బొండిగే పిసుకెందుకు చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవిషత్ తెలంగాణ గల్లీ లోనే కావాలన్నారు. లక్ష్మీ నరసింహ రావు కోసం కాదు, కేసీఆర్ కోసమే ఆలోచన చేయాలన్నారు. డిసెంబర్ 3 నాడు లక్ష్మీ నరసింహ రావు ను గెలిపించాలని కోరారు. వేములవాడ ను దత్తత తీసుకుంటాను, గెలిపించక పోతే ఇక్కడికి రాననని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటే నమ్మకం, భరోసా అన్నారు. సెంటి మెంట్స్, అయింట్ మెంట్ లకు లొంగొద్దని తెలిపారు.\
*అభివృద్ధి చేయలేదు కాబట్టే.. నా సవాల్ ను కేసీఆర్ స్వీకరించలే..
దత్తత కాదు ధైర్యం ఉంటే కొడంగల్ లో పోటీ చెయ్ తేల్చుకుందామని కేసీఆర్ కు నేను సవాల్ విసిరా! కానీ.. అభివృద్ధి చేయలేదు కాబట్టే నేను విసిరిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించలేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ సమాజమంతా కూర్చుని ఆలోచన చేయాలన్నారు. మీ ఆశీర్వాదమే అండగా.. మీరిచ్చిన బలంతో ఈ కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్టా అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇంత గొప్ప అవకాశం కొడంగల్ కు వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాది కాదు… మీదే.. కొడంగల్ లో ప్రతీ బిడ్డ కాంగ్రెస్ కు అధ్యక్షుడే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. కృష్ణా రైల్వే లైన్, జూనియర్, పీజీ కాలేజీలు, కృష్ణా జలాలు వస్తాయని ఆనాడు కేసీఆర్ గుర్నాధ్ రెడ్డిని నమ్మించారని తెలిపారు. ఐదెళ్లలో కొడంగల్ కు కేసీఆర్ , కేటీఆర్ ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదు… అభివృద్ధి జరగలేదన్నారు. హామీలు ఇచ్చి మోసం చేసిన బీఆరెస్ సన్నాసులు ఇవాళ ఏ ముఖంతో ఓట్లు అడుగుతారు? అని ప్రశ్నించారు. అన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కేనా… కొడంగల్ కు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. దత్తత కాదు ధైర్యం ఉంటే కొడంగల్ లో పోటీ చెయ్ తేల్చుకుందామని కేసీఆర్ కు నేను సవాల్ విసిరా.. అభివృద్ధి చేయలేదు కాబట్టే నేను విసిరిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించలేదన్నారు. ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు.. కేసీఆర్ కు మధ్య జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదు.. ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ఎన్నికలన్నారు. దేశ ముఖ చిత్రంలో కొడంగల్ కు ఒక గుర్తింపు తెచ్చే ఎన్నికలు అని తెలిపారు. గ్రూపులు, గుంపులు కాదు.. కొడంగల్ అంతా కలిసి రావాలి… కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. చీలిపోతే కూలిపోతాం.. కూలిపోతే మీ జీవితాలు ఆగమైతాయ్ అన్నారు. ఈ ఎన్నికల్లో కర్ణాటక కంటే గొప్ప తీర్పు కొడంగల్ ప్రజలు ఇవ్వాలన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ కంటే ఎక్కువ మెజారిటీతో కొడంగల్ లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. గెలిచిన రెండేళ్లలో నారాయణపేట కొడంగల్ ఎత్తి పోతల పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తా.. అని హామీ ఇచ్చారు. ఏడాదిలో మహబూబ్ నగర్ చించొలి జాతీయ రహదారి పూర్తి చేయిస్తానని తెలిపారు. ఇక్కడి ఆడబిడ్డలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు తీసుకోస్తాం అని స్పష్టం చేశారు. అండగా నిలబడే మీ ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత నాది అన్నారు.
*కాళ్ళ కింద భూమి కదులుతుంది.. కేసీఆర్ గ్రహించటం లేదు
కాళ్ళ కింద భూమి కదులుతోన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించటం లేదని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటారన్నారు. వాస్తవాలు, నిజాలను తెలుసుకోవటానికి కేసీఆర్ ఇష్టపడరని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళ్ళ కింద భూమి కదులుతోన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించటం లేదన్నారు. వాస్తవాలు చెప్తే కేసీఆర్ దబాయింపుతో వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ళు, నియామకాల విషయంలో కేసీఆర్ సంపూర్ణంగా విఫలమైందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మాదిరి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల 5,800 ఎకరాల భూమిని అభివృద్ధి పేరిట అతి చౌక ధరలకు కేసీఆర్ కుటుంబం తీసుకుందన్నారు. ఒక్క గజ్వేల్ లోనే 30వేల మంది కేసీఆర్ బాధితులున్నారని తెలిపారు. కేసీఆర్ అడుగులకు మడుగులు వత్తే వారికే బీసీబంధు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంగ్ వస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. గతంలో కలసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే నేను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తాను? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ కలసి పోటీ చేయలేదన్నారు. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను నిలువరించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. హుజూరాబాద్ రిజల్ట్ గజ్వేల్‌లోనూ పునరావృతం అవుతుందని.. 7న గజ్వేల్‌లో నామినేషన్ వేస్తున్నానని ప్రజలంతా తరలిరావాలని ఈటల కోరారు. ఆదివారం రాత్రి ములుగు మండలం కొక్కొండ, ఉమ్మడి కొండపాక మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.
*సంక్షేమం, అభివృద్ధి జగన్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలు..
సంక్షేమం, అభివృద్ధి జగన్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలు అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. యాత్రకు వెళ్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన చెప్పారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటూ అక్కున చేర్చుకున్న జగన్.. ప్రతీ కష్టాన్ని తీరుస్తున్నారని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతీ పేదవాడు లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. 2019లో ఒక్క అవకాశం అడిగిన జగన్‌కు ప్రజలు అవకాశం ఇవ్వటం వల్లే అభివృద్ధి సాధ్యమైందన్నారు. సీఎం జగన్ అభివృద్ధి అంటే కొత్త నిర్వచనం చెప్పారన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేశారని.. అబద్ధాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నారని మంత్రి మండిపడ్డారు. అనారోగ్యం పేరు చెప్పి బయటకు వచ్చిన చంద్రబాబు కాన్వాయ్‌తో ర్యాలీగా ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యం బాగుందని ఏఐజీ వైద్యులే చెప్పారన్నారు. ప్రజలు మోసపూరిత వాగ్దానాల ద్వారా మోసపోవద్దన్నారు. అప్పటి పాలనకు, ఇప్పటి సంక్షేమ పాలనను బేరీజు వేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పటానికి వచ్చిన మాకే బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
*\జనసేనలో చేరిన మొగలిరేకులు RK నాయుడు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా జనసేన విజయపథకం ఎగురవేయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ అంతకు ముందులా కాకుండా తనను, తన పార్టీని విమర్శించినవారిపై తనదైన మాటతీరుతో అలరిస్తున్నాడు. ఇక ఆయన నిజాయితీ నచ్చినవారు జనసేనలో జాయిన్ అవుతున్నారు. తాజాగా సీరియల్ నటుడు సాగర్.. జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. మొగలి రేకులు సీరియల్ తో నటుడు సాగర్ బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. RK నాయుడు పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సీరియల్ ఎంతగా గుర్తింపు తెచ్చింది అంటే.. సాగర్ కన్నా RK నాయుడు పేరుతోనే ఎక్కువగా ప్రాచుర్యం తెచ్చుకున్నాడు. ఇక ఈ సీరియల్ తరువాత హీరోగా రెండు మూడు సినిమాల్లో నటించిన సాగర్.. ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. నేడు పార్టీ కండువా కప్పి జనసేనలోకి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సాగర్ ను ఆహ్వానించాడు. నటుడు సాగర్ స్వస్థలం రామగుండం నియోజకవర్గం.. రానున్న ఎన్నికల్లో రామగుండం అభ్యర్థిగా జనసేన నుండి పోటీ చేసే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి జనసేన గెలుపులో సాగర్ ఎలాంటి కృషి చేస్తాడో చూడాలి.
*బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ విడుదల.. ఆమె పేరు మిస్సింగ్..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ విడుదల అయింది. ఈ లిస్ట్ లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా పలు జాతీయ నేతలు ఉన్నారు. ఇక, క్యాంపెయినర్ లిస్ట్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రాజాసింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కూడా తెలంగాణలో ప్రచారానికి రానున్నారు. బీజేపీ ప్రచార లిస్ట్ లో విజయశాంతికి చోటు దక్కకపోవడంతో ఈ అంశంపై ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే, రేపు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని బీసీ గర్జన సభకు తెలంగాణ బీజేపీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
40 మంది స్టార్ క్యాంపెయినర్స్ వీరే..!
నరేంద్ర మోడీ
జేపీ నడ్డా
రాజ్‌నాథ్ సింగ్
అమిత్‌షా
నితిన్ గడ్కరీ
యడియూరప్ప
కె.లక్ష్మణ్
యోగి ఆదిత్యనాథ్
పీయూష్ గోయల్
నిర్మలా సీతారామన్
స్మృతి ఇరానీ
పురుషోత్తం రూపాలా
అర్జున్ ముండా
భూపేంద్రయాదవ్
కిషన్‌రెడ్డి
సాధ్వి నిరంజన్ జ్యోతి
ఎల్.మురుగన్
ప్రకాశ్ జావడేకర్
తరుణ్ ఛుగ్
సునీల్ బన్సల్
బండి సంజయ్
అరవింద్ మేనన్
డీకే అరుణ
పి.మురళీధర్‌రావు
దగ్గుబాటి పురందేశ్వరి
రవికిషన్
పొంగులేటి సుధాకర్‌రెడ్డి
జితేందర్‌రెడ్డి
గరికపాటి మోహన్‌రావు
ఈటల రాజేందర్
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
ధర్మపురి అర్వింద్
సోయం బాపూరావు
రాజాసింగ్
బూర నర్సయ్యగౌడ్
గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
కాసం వెంకటేశ్వర్లు యాదవ్
టి.కృష్ణ ప్రసాద్
దుగ్యాల ప్రదీప్‌కుమార్
బంగారు శ్రుతి
*శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్లో అనూహ్య ఘటన.. ఒక్క బాల్ ఆడకుండానే..!
ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఢిల్లీలో శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లలోనే కుశాల్ పెరీరా (4) పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ పథుం నిస్సాంకా 41 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత కుశాల్ మెండీస్ 19, సమర విక్రమ 41 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమర విక్రమ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. టైం ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే ఔట్ అయ్యాడు. మాథ్యూస్ హెల్మెట్ క్లిప్ ఊడిపోవడంతో మరో హెల్మెట్ తెప్పించుకునేందుకు కొంత సమయం తీసుకున్నాడు. అయితే అప్పటికే టైం అయిపోతుందని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అప్పీల్ చేశాడు. దీంతో టైమ్ ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే వెళ్లిపోయాడు. అయితే బంగ్లాదేశ్ తన అప్పీల్ ని వెనక్కి తీసుకుంటే మాథ్యూస్ బ్యాటింగ్ చేయొచ్చని అంపైర్లు చెప్పారు. కానీ.. బంగ్లాదేశ్ తన అప్పీల్ ని వెనక్కి తీసుకోకపోవడంతో.. బ్యాటింగ్ చేయకుండానే మాథ్యూస్ ఔట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 30 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో చరిత్ అసలంక (47), డి సిల్వ (8) ఉన్నారు. ఇక బంగ్లా బౌలర్లలో కెప్టెన్ షకీబ్ ఇప్పటివరకు 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత తంజీమ్ హాసన్, షోరిఫుల్ ఇస్లాం తలో వికెట్ తీశారు.
*డీప్ ఫేక్ వీడియో.. స్పందించిన రష్మిక
టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతుందని ఆనందపడాలో.. ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని బాధపడాలో తెలియని సందిగ్ద స్థితిలో ఉంది సమాజం. ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం AI టెక్నాలజీ ఒక ఊపు ఊపేసిన విషయం తెల్సిందే. ఎలాంటి మనిషిని అయినా AI టెక్నాలజీ మార్చేస్తుంది. ఒకప్పుడు మార్ఫింగ్ వీడియోలు అంటూ.. ఎవరో గుర్తుతెలియని మనుషుల ముఖాల ప్లేస్ లో సెలబ్రిటీల ముఖాలను అతికించి సోషల్ మీడియాలో వదిలేవారు. ఇక ఇప్పుడు అదే AI టెక్నాలజీ తో చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారు. ఇక నేటి ఉదయం నుంచి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. బ్లాక్ కలర్ టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లో వల్గర్ గా ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు పోజులివ్వడానికి రష్మిక నిలబడిన వీడియో సెన్సేషన్ సృష్టించింది. దీంతో రష్మిక ఏంటి.. ఇలాంటి వీడియో ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఇది ఒరిజినల్ వీడియో కాదని, ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదని.. వేరే అమ్మాయి ముఖాన్నీ AI టెక్నాలజీతో రష్మిక ఫేస్ పెట్టి రిలీజ్ చేశారు. ఇక దీంతో ప్రతి ఒక్కరు రష్మికకు సపోర్ట్ గా నిలిచారు. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ సైతం.. దీనిపై లీగల్ చర్యలు తీసుకోవాలని తెలిపాడు. ఇక తాజాగా ఈ ఫేక్ వీడియోపై రష్మిక ట్విట్టర్ ద్వారాస్పందించింది ” ఈ ఘటన గురించి మాట్లాడడం చేయడం నాకు చాలా బాధగా ఉంది. ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడవలసి వచ్చింది. ఇలాంటివి నిజం చెప్పాలంటే.. నాకే కాదు, చాలామందిని భయానికి గురిచేస్తోంది. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే భయంతో పాటు.. వాటి వలన నష్టాలు ఎలా ఉంటాయో అని చాలామంది భయపడుతున్నారు. ఈ రోజు ఒక మహిళగా మరియు నటిగా నాకు రక్షణ మరియు మద్దతు వ్యవస్థగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ ఇలాంటి ఘటనే నేను స్కూల్‌లో లేదా కాలేజీలో ఉన్నప్పుడు జరిగితే.. నేను దీన్ని ఎలా ఎదుర్కోగలనో నిజంగా ఊహించలేను. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మనమందరం ఒక కమ్యూనిటీగా మారి త్వరగా వీటికి పరిష్కారం చూపాలి” అని తెలుపుతూ సైబర్ క్రైమ్ ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.