*చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంగళ్లు కేసులో రేపటి(గురవారం) వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ సోమవారం(16వ తేదీ) వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు చంద్రబాబు సహకరిస్తాడని ఆయన తరఫున లాయర్లు కోర్టుకు విన్నవించారు. ఈ రెండు కేసుల్లో టీడీపీ అధినేత దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోర్టు కోరింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందని.. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని ఏజీ శ్రీరామ్ కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
*ఓటుకు నోటు కేసు.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఓటుకు నోటు కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. అయితే, ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును చేర్చాలి అంటూ సుప్రీం కోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.. 2017లో ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లు వేశారు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి.. రెండు పిటిషన్ల విషయానికి వెళ్తే.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఒక పిటిషన్ వేయగా.. తెలంగాణ ఏసీబీ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అయితే, సిద్ధార్థ లూత్రా అందుబాటులో లేరని కేసు నాలుగు వారాలు వాయిదా వేయాలని కోరారు చంద్రబాబు తరపు న్యాయవాది.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది.. అయితే, విచారణ తేదీని ఖరారు చేస్తామన్న తెలిపిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, గతంలో తెలంగాణలో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే.
*స్కాంలలో సూత్రధారి, పాత్రధారి, లబ్ధిదారుడు చంద్రబాబు
స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నేరం జరగలేదగని చంద్రబాబు నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేశారని మండిపడ్డారు. సీమెన్స్ సంస్థ కూడా తమకు సంబంధం లేదని చెప్పిందని వెల్లడించారు. సీమెన్స్ సంస్థ 3 వేల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇస్తామన్న డబ్బు ఎటు వెళ్ళిందని ప్రశ్నించారు. రూ. 300 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ స్కాంలో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారని సజ్జల పేర్కొన్నారు. అన్ని ఆధారాలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిందన్నారు. ఫేక్ ఇన్వాయిస్‌తో నిధులు పక్కదారి పట్టించారని.. అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయన్నారు. ఈడీ కూడా నలుగురిని అరెస్ట్ చేసిందని.. ఈ స్కామ్‌కు సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే అంటూ ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు.”కోర్టు కూడా జ్యుడీషియల్ రిమాండ్ కావాలని భావించింది. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య కేసులు విచారణకు రాకుండా అడ్డుకోవటం ఎలా అన్నదే. టిడ్కో హౌసింగ్ కాంట్రాక్టులు ఇచ్చినందుకు కోట్లాది రూపాయల ముడుపులు అందాయని ఐటీ నోటీసులు ఇచ్చింది. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌కు చంద్రబాబు పరిధులు చెబుతున్నాడు. పెండ్యాల శ్రీనివాస్, పార్థసాని ఇద్దరూ రాత్రికి రాత్రి దేశం వదిలి పారిపోయారు. సాక్షులను చంద్రబాబు దేశాలను దాటించగలడు అని తేలుతుంది. స్కాంలలో సూత్రధారి, పాత్రధారి, లబ్దిదారుడు చంద్రబాబు. ఇన్నేళ్ళు సాంకేతిక అంశాలు చూపిస్తూ తప్పించుకున్నాడు. స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. బరితెగించి ప్రజల సొమ్ము పక్కదారి పట్టించాడు. పట్టపగలు నిలువు దోపిడి చేశారు. కుంభకోణాల్లో ఇది ఒక క్లాసిక్ కేసు. 3300 కోట్ల ప్రాజెక్టులో క్యాబినెట్ నిర్ణయం అంటున్నారు. దీనిలో రూ.3000 కోట్లు ఎగిరి పోయినా క్యాబినెట్ నిర్ణయం అనే పేరుతో వదిలేయాలా? ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత గవర్నర్ సంతకం లేదు అంటే ఎలా??. దేశంలోనే అరుదైన కేసు ఇది. ధర్మకర్తే నిలువు దోపిడీ చేస్తే ఎలా చూడాలి??.రికార్డు స్థాయి మెజారిటీతో 2019లో గెలిచినప్పుడే అరెస్టు చేసి ఉంటే అప్పుడు కక్ష సాధింపు అనటానికి ఆస్కారం ఉండేది. ముఖ్యమంత్రి చెప్పినట్లు చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా తేడా ఏమీ లేదు. లోకేష్ ఎందుకు జనంలో తిరగటం లేదు. ఢిల్లీ ఎందుకు వెళుతున్నాడు??. జోకుల స్టేజ్ కూడా దాటిపోయి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.”అని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
*బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీమ్.. భట్టి కీలక వ్యాఖ్యలు
రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేసి ఓట్లను కొల్లగొట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అనాసాగరం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి భ్రమలు కల్పించేందుకు బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందన్నారు. మూడు ఎకరాలు, ఇంటికో ఉద్యోగం పేరుతో గతంలో చేసిన మోసం మళ్ళీ చేయనున్నారని ఆయన ఆరోపించారు. మోసం చేసే కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, దొరల కోసం కాదన్నారు. బీఆర్‌ఎస్ బీజేపీతో చేతులు కలిపి బీజేపీకి బీ టీమ్‌గా మాదిరిగా పనిచేస్తోందని భట్టి ఆరోపించారు. ఎంఐఎం ఈ టీమ్‌కు వంత పలుకుతోందన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం బీజేపీ వేయడమేనని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రం రెండింటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని పని చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర భూములను అమ్మేసుకున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను ఆరు నెలల్లో అమలు చేస్తామన్నారు. జాతీయ పార్టీగా జాతీయ స్థాయిలో కూటమిగా ఉన్న పార్టీలతో చర్చలు సాగుతున్నాయన్నారు. లెఫ్ట్ పార్టీలతో కలసి పోవడం కోసం చర్చలు సాగుతున్నాయన్నారు. లెఫ్ట్ పార్టీ అధిష్ఠానంతో చర్చలు చేస్తోందన్నారు. అభ్యర్థుల ప్రకటన నామినేషన్ సమయంలో కాంగ్రెస్ ప్రకటన చేస్తుందన్నారు. అభ్యర్థులపై సంపూర్ణ కసరత్తు జరుగుతోందని ఆయన చెప్పారు. పద్దతి ప్రకారం ఇప్పటికే అభ్యర్థుల ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. ప్రకటన త్వరలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఇంకా జరుగలేదని.. మీడియాలో వస్తున్న లిస్ట్ కథనాలపై పార్టీకి ఎటువంటి సంబందం లేదన్నారు. అవన్నీ అభూత కల్పన మాత్రమేనన్నారు. లెఫ్ట్ కు కేటాయించిన సీట్లు ఇవే అంటూ తప్పుడు కథనాలు నమ్మవద్దన్నారు. చర్చలు జరుగుతున్న మాట వాస్తవమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
*మోస్ట్ వాంటెడ్ ఖలిస్తాన్ ఉగ్రవాది లఖ్బీర్ రోడ్ ఆస్తులు జప్తు..
ఖలిస్తాన్ ఉగ్రవాదులు, మద్దతుదారులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూకు సంబంధించిన, అతని కుటుంబం, సన్నిహితులకు సంబంధించిన ఆస్తుల్ని ఎన్ఐఏ జప్తు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా బుధవారం ఖలిస్తాన్ మద్దతుదారు లఖ్బీర్ సింగ్ రోడ్ ఆస్తుల్ని జప్తు చేసింది. పంజాబ్ లోని మోగాలో ఎన్ఐఏ దాడులు నిర్వహించిందవి. ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) అధినేత అయిన లఖ్బీర్ సింగ్ రోడ్‌ని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించింది. ఆర్డీఎక్స్ తో పాటు పలు ఆయుధాలు, పేలుడు పదార్థాల స్మగ్లింగ్ తో పాటు పలువురు కీలక నాయకులపై దాడి చేయడానికి కుట్ర పన్నిన కేసులో లఖ్బీర్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. పంజాబ్ లో విద్వేషాలను పెంచుతున్నాడు.లఖ్బీర్ సింగ్ ప్రముఖ ఖలిస్తానీ ఉద్యమకారుడైన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేకు మేనల్లుడు. ప్రస్తుతం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద చర్యలు తీసుకోవాలని NIA ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర ఏజెన్సీ రోడ్ ఆస్తులను జప్తు చేసింది. ఎన్ఐఏ, పంజాబ్ పోలీసులు కలిసి రోడ్ పూర్వీకుల గ్రామంలోని 11 ఆస్తుల్ను జప్తు చేసింది.
*మునిగిపోయిన “టైటాన్” చివరి శిథిలం వెలికితీత..
అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను చూసేందుకు ఐదుగురితో సముద్రంలోకి వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ విషాదకరంగా పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ టైటాన్ చివరి భాగాలను యూఎస్ కోస్ట్ గార్డు వెలికితీసింది. టైటాన్‌కి సంబంధించి గతంలో కొన్ని భాగాలను ఉపరితలంపైకి తీసుకువచ్చారు. మిగిలిన అవశేషాలను సముద్రం అడుగు భాగాల నుంచి సేకరించినట్లు యూఎస్ కోస్ట్ గార్డు మంగళవారం తెలిపారు. వైద్య అధికారులు మానవ అవశేషాలను విశ్లేషిస్తున్నారు. మునిగిపోయిన నౌక టైటానిక్ శిథిలాలను చూపించేందుకు ఓషన్ గేట్ అనే సంస్థ టైటాన్ అనే సబ్ మెర్సిబుల్‌ని రూపొందించింది. ఈ ప్రమాదానికి ముందు పలుమార్లు టైటాన్ విజయవంతంగా టైటానిక్ వద్దకు వెళ్లి వచ్చింది. అయితే ఈ ఏడాది ఇలాగే మరోసారి టైటాన్ సబ్‌మెర్సిబుల్ టైటానిక్ వద్దకు ప్రయాణమైంది. దీనిలో బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ప్రెంచ్ నేవీ డైవర్ పాల్ హెన్రీ నార్గోలెట్, ఓషన్ గేట్ కంపెనీ చీఫ్ స్టాక్ టన్ రష్ మొత్తం ఐదుగురు టైటాన్ లో ప్రయాణించి మృత్యువాతపడ్డారు. సముద్రం అడుగుభాగంలోకి వెళ్లే కొద్ది నీటి ఒత్తిడి టైటాన్‌పై చాలా ఉంటుంది. అయితే అందుకు తగ్గట్లుగానే దీన్ని నిర్మించారు. ఇదే టైటాన్ పేలిపోయేందుకు కారణమైంది. ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇన్‌ప్లోజన్ అనే పేలుడు వల్ల టైటాన్ పేలిపోయింది. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఇది జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వారికి ఏం జరుగుతోందో తెలియకుండానే మరణించారు.
*ఇజ్రాయిల్‌పై మూడు వైపుల నుంచి దాడి.. పోరాడుతున్న ఐడీఎఫ్
ఇజ్రాయిల్‌పై హమాస్ తీవ్రవాదులు శనివారం భీకరదాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. గాజాలోని ప్రముఖ భవనాలను బాంబులతో కుప్పకూలుస్తోంది. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి, హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డయిఫ్ ఇంటిని టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో డయిఫ్ కుటుంబ సభ్యులు మరణించినట్లుగా హమాస్ ధృవీకరించింది. ఇప్పటి వరకు ఇరు వైపుల మరణాల సంఖ్య 3000ను దాటింది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ మూడు వైపుల నుంచి ముప్పును ఎదుర్కొంటోంది. గాజా నుంచి ఇప్పటికే హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయిల్ పోరాడుతుంటే, ఉత్తరం నుంచి లెబనాన్, తూర్పు నుంచి సిరియా నుంచి పలు మిలిటెంట్ సంస్థలు హమాస్ కి మద్దతుగా పోరాటం కొనసాగిస్తున్నాయి. దీంతో ముప్పేల ముప్పుపై ఐడీఎఫ్ బలగాలు పోరాడుతున్నాయి. సిరియా వైపు నుంచి గోలన్ హైట్స్‌పైకి సిరియా దాడులు చేసింది. బుధవారం ఈ దాడుల్ని తిప్పికొట్టినట్లు ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది. 1967లో ఇజ్రాయిల్ ఈ గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. మరోవైపు లెబనాన్ నుంచి హమాస్ మద్దతుదారులైన హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. హమాస్ దాడులు మొదలైన తర్వాత తొలిరోజే హిజ్బుల్లా ఇజ్రాయిల్ పై దాడులు చేస్తోంది. తాజాగా లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పోస్టులపై దాుడలు జరిగాయి. మిలిటెంట్ గ్రూప్ యాంటీ ట్యాంక్ క్షిపణిని పేల్చేసింది. ఇలా మూడు వైపుల నుంచి ఇజ్రాయిల్ పోరాడుతోంది.
*యూఎస్ వేదికగా ఇండియా-కెనడా విదేశాంగ మంత్రుల రహస్య సమావేశం..
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యవివాదాన్ని పెంచింది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఉప్పునిప్పుగా ఉన్నాయి. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన చర్యల ద్వారా ఇండియాను మరింతగా రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా-కెనడా విదేశాంగ మంత్రుల మధ్య అమెరికా వేదికగా రహస్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మధ్య రెండు రోజుల క్రితం వాషింగ్టన్ లో రహస్య సమావేశం నిర్వహించారు. అయితే రెండు దేశాలు ఇప్పటి వరకు ఈ సమావేశాన్ని ధృవీకరించలేదు. కెనడా దౌత్యవేత్తలు పలువురిని ఇండియా వదిలివెళ్లాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో, వారి దౌత్యపరమైన రక్షణలు తొలగించే ప్రమాదం ఉన్న సమయంలో భారతదేశంతో దౌత్య పరిస్థితిని పరిష్కరించడానికి కెనడా ప్రయత్నిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇటీవల దౌత్య ఉద్రిక్తతలపై ఇండియాతో ప్రైవేటుగా మాట్లాడుకుంటామని కెనడా ప్రకటించిన తరుణంలో ఈ సమావేశానికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా భారతదేశంతో ఉద్రిక్తతలను పెంచుకోవడం తమ ఉద్దేశం కాదని వెల్లడించారు. ఇదిలా ఉంటే ట్రూడో మాటలకు చేతలకు సంబధం ఉండటం లేదు. ఇటీవల యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజుతో భారత దేశ అంశాన్ని చర్చించాడు. దీనిపై ఇండియా తీవ్రం ఆగ్రహంతో ఉంది. ఈ ఏడాది జూన్ నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించడం ఒక్కసారిగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. అయితే కెనడా ఆరోపణల్ని భారత్ అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలుస్తోందని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
*మోక్షజ్ఞతో శ్రీ లీల పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్
హీరోయిన్ల పెళ్లి అనేది నెవర్ ఎండింగ్ గాసిప్ మెటీరియల్. నిజానికి గత కొన్నాళ్లుగా కీర్తి సురేశ్‌పై పెళ్లి పుకార్లు వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఇలాంటి పుకార్లను పదే పదే ఖండిస్తూ వచ్చినా ఎదో ఒక సమయంలో అవి మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు అత్యంత బిజీగా ఉన్న నటి శ్రీ లీలను ఈ గాసిప్ రాయుళ్లు టార్గెట్ చేశారు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి శ్రీలీల ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేయగా అది రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మధ్య ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చేయగా ఆ ఈవెంట్ లో శ్రీలీలతో తాను హీరోగా నటిస్తానంటే మోక్షజ్ఞ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని అడిగాడని బాలకృష్ణ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. మరోపక్క భగవంత్ కేసరి టీంతో కలిసి బాలయ్య, శ్రీలీల ఉన్న ఫొటోలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా కనిపించడం దానికి తోడు శ్రీలీల పక్కనే మోక్షు ఉండడంతో వీళ్ళిద్దరికీ పెళ్లయిపోతున్నట్లు రూమర్లు పుట్టించేస్తున్నారు. నిజానికి ఒక్క ఫొటోను చూసి పెళ్లి గురించి ఊహాగానాలు పుట్టించడం ఏమాత్రం అభినందనీయం కాదు. వాస్తవానికి మోక్షును త్వరలో హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఓ వైపు ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీద దృష్టిపెడుతూనే సినిమాల మేకింగ్ మీద కూడా అవగాహన పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ‘భగవంత్ కేసరి’ టీంతో అసోసియేట్ అయిన క్రమంలో టీంతో కలిసి ఫొటోల్లో కనిపిస్తున్నాడు. ఆ మాత్రానికే శ్రీలీలను అతను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు పుట్టించడం హాట్ టాపిక్ అయింది. ఈ వార్తల మీద శ్రీలీల టీమ్ స్పందించింది, ఇలాంటి బాధ్యతారహిత జర్నలిజాన్ని చూసి శ్రీలీల ఆశ్చర్యపోయిందని పేర్కొంటూ ఒక నోట్ రిలీజ్ చేసి ఆమె ఈ వార్తలు ను తప్పు అని కొట్టిపారేసిందని వెల్లడించింది. బాలయ్య సినిమాలో శ్రీ లీల ఆయనకు కుమార్తెగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.