*తెలంగాణ విద్యావ్యవస్థపై బొత్స సీరియస్ కామెంట్స్
తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆఫ్ట్రాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉంది. తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లోనే ఏ రకంగా స్కాంలు జరిగాయో చూశాం. అన్ని చూచిరాతలే. ఎంత మంది అరెస్టులు అవుతున్నారో వార్తలు వస్తూనే ఉన్నాయి. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉంది. అందుకే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చకూడదు. ఎవరి ఆలోచన వారిది, ఎవరి విధానం వారిది” అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మరోసారి హీట్ పెంచాయి. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా..గతంలో కూడా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏపీలో రోడ్లు, విద్యుత్ సహా పలు అంశాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు ఘాటు విమర్శలు చేసుకున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ విద్యా వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు కూడా హీట్ పెంచేలా ఉన్నాయి.
*ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. పురంధేశ్వరికి సోము వీర్రాజు బాధ్యతలను అప్పగించారు. విజయవాడ నగరంలోని బీజేపీ పార్టీ కార్యాయలంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న పురంధేశ్వరికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గజమాలతో బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో ఏపీ బీజేపీ చీఫ్ బీజేపీ పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం జరిగింది. అనంతరం పురంధేశ్వరికి బీజేపీ నేతలు శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. తన మీద నమ్మకం విశ్వాసంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించినందుకు బీజేపీ అధిష్ఠానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతం కోసం పని చేస్తానన్నారు. గత అధ్యక్షుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ వారి మార్గదర్శకత్వంలో పని చేస్తానని ఆమె చెప్పారు. బీజేపీపై ఏపీలో దుష్ప్రచారం నడుస్తోందని.. ఓట్లతో నిమిత్తం లేకుండా ఏపీకి బీజేపీ పూర్తి సహకారం అందిస్తూనే ఉందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ. 6 వేలు ఇస్తున్నామని ఆమె తెలిపారు. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయన్నారు.
*తెలుగు రాష్ట్రాలపై వర్షాల ఎఫెక్ట్.. ఐఎండీ హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో తుఫాను కొనసాగింది. అది మరింత ఎత్తుకు వెళ్లడంతో నైరుతి దిశగా వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా మరో తుఫాను ఏర్పడింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు పశ్చిమ దిశ నుంచి అల్పస్థాయి గాలులు వీస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈరోజు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా చినుకులు కురుస్తాయి. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 28.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.9 డిగ్రీలు. గాలిలో తేమ 83 శాతంగా నమోదైంది. ఉత్తర తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో తుపాను కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రాలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలకు తోడు పిడుగులు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఈరోజు సాయంత్రం, రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ వర్షాలను మనం చూడవచ్చు. కానీ విశాఖపట్నంలోని ప్రధాన నగర ప్రాంతాల్లో ఈరోజు పెద్దగా వర్షాలు లేవు. కొద్దిసేపు భారీ వర్షాలు లేదా తేలికపాటి చినుకులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనకాపల్లి, పెందుర్తి, గోపాలపట్నంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్‌మన్ వెల్లడించారు. కాబట్టి పిడుగులు పడే సమయంలో రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
*టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసు.. కరీంనగర్‌కు చెందిన తండ్రి, కుమార్తె అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను కొనసాగిస్తుంది. తాజాగా ఈ కేసులో కరీంనగర్‌కు చెందిన తండ్రీకూతుళ్లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు చెందిన మద్దెల శ్రీనివాస్ తన కూతురు సాహితీ ఏఈ పరీక్ష రాయడానికి రమేష్‌ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో హైటెక్ మాస్ కాపీయింగ్ కు సంబంధించి రూ. 30 లక్షలకు రమేష్‌తో శ్రీనివాస్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో శ్రీనివాస్, సాహితిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు వారిని బుధవారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం మేజిస్ట్రేట్ జి ఈశ్వరయ్య వారిద్దరికీ ఈ నెల 26 వరకు రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఆరుగురిని సిట్ బృందం బుధవారం అరెస్ట్ చేసింది. నీటిపారుదల శాఖలో పనిచేసిన అసిస్టెంట్ ఇంజనీర్ పి రమేష్ నుంచి ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. వారి నుంచి సేకరించిన తర్వాత మరికొందరిని సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన రమేష్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఏఈఈ పరీక్షలో మాస్ కాపీయింగ్ నిర్వహించిన రమేష్.. ఆపై ఏఈ పరీక్ష పేపర్‌ను చాలా మందికి విక్రయించాడు. రమేష్ నుంచి దాదాపు 40 మంది ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రమేష్ నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన వారిని సిట్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. అలాగే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సిట్ కొన్ని బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 80 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
*పైలట్ రోహిత్ రెడ్డి మహా యాగంలో అపశ్రుతి
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యాగంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే దంపతులు యాగం నిర్వహిస్తున్నారు. రెండు రోజులు బాగానే నిర్వహించిన ప్రధాన యాగశాలలో ఇవాల మూడోరోజు అగ్నిప్రమాదం జరిగింది. యాగం చేస్తున్న మండపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో మండపంలోని వారందరూ భయాందోళకు గురయ్యారు. మండపంలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. ప్రధాన యాగం దగ్గర నిప్పురవ్వలు ఎగిరి పడడంతో టెంట్ కు మంటలు వ్యాపించాయి. మండపం మొత్తం అగ్ని ఆహుతి అయ్యింది. ఆప్రాంతం అంతా పొగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడే వున్న ప్రజలు తీవ్ర భాయాందోళనకు గురయ్యారు. పైర్ సిబ్బంది సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటా హుటిన మండపం దగ్గరకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎటువంటి హాని జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఎలాంటి హనీ జరగలేదని తెలిపారు. పార్టీశ్రేణులు, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు తన కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. మూడురోజులుగా సాగుతున్న యాగంలో ఇవాల అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమన్నారు.
*నిర్లక్ష్యపు అధికారులపై వేటు
ఒడిషా రైలు ప్రమాదంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన అధికారులపై రైల్వే శాఖ వేటు వేసింది. తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని.. వేలాది మంది గాయపడ్డారని పేర్కొంటూ.. ఏడు మందిపై రైల్వే శాఖ వేటు వేసింది. ఏడు మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఏడుగురు ఉద్యోగులను రైల్వేశాఖ తొలగించింది. వీరిలో ముగ్గురు ప్రస్తుతం సీబీఐ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ఎస్‌ఎండ్‌టీ అధికారులు కూడా ఉన్నారని ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనీల్‌కుమార్ మిశ్రా తెలిపారు. వారితోపాటు ప్రమాదానికి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన సిబ్బందిగా గుర్తించిన బహనాగా బజార్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, మెయింటైనర్లను సస్పెండు చేసినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 294మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,100 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. బహనాగా బజార్, బాలాసోర్ రైల్వే స్టేషన్లను సౌత్‌ఈస్ట్ రైల్వే జీఎం, డీఆర్‌ఎం బుధవారం ప్రత్యక్షంగా సందర్శించారు. అనంతరం సిబ్బందికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు. ఈ అధికారులు బాలాసోర్ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగితో కలిసి గోపీనాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను కూడా సందర్శించారు. బాలాసోర్–నీలగిరి సెక్షన్‌ను కూడా పర్యవేక్షించారు. సీబీఐ అరెస్ట్ చేసిన ముగ్గురు రైల్వే ఉద్యోగులు సీనియర్ సెక్షన్ ఇంజినీర్(సిగ్నల్), అరుణ్‌కుమార్ మహంత, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్‌ఖాన్, టెక్నీషియన్ పప్పుకుమార్ లను మరో 4 రోజులపాటు రిమాండ్‌కు కొనసాగించనున్నారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి లభించింది. రైలు ప్రమాదంపై ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్‌ఎస్) సమర్పించిన విచారణ నివేదిక బహనాగా బజార్ స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదానికి సిగ్నలింగ్ సమస్యలతో సహా అనేక మానవ లోపాలను ఎత్తి చూపింది. దీని ఆధారంగా రైల్వేశాఖ అధికారులు.. బాధ్యులుగా భావిస్తున్న వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. సీఆర్‌ఎస్ విచారణ పట్ల పలు రాజకీయ పక్షాలు విశ్వసనీయత ప్రదర్శించిన విషయం తెలిసిందే. రైలు దుర్ఘటనల్లో ఈ వర్గం విచారణ అత్యంత పారదర్శకతతో అనుబంధ లోటుపాటులను పటిష్టంగా ఖరారు చేయగలుగుతుందని పలు వర్గాల్లో నమ్మకం బలపడింది.
*కొత్త ఇంటికి మారనున్న రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త ఇంటికి మారనున్నట్టు తెలుస్తోంది. ఇల్లు, ఆఫీస్‌ను ఒకే చోట నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రాంతాన్ని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్నేయ ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్ ప్రాంతంలో తన నివాసం, కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నివాసం, కార్యాలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మోదీ ఇంటి పేరుకు సంబంధించిన పరువు నష్టం వ్యాఖ్యల కేసులో జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో.. రాహుల్ గాంధీ తన లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన విషయం తెలిసిందే. లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడంతో అప్పటి వరకూ ఆయన నివసిస్తున్న 12, తుగ్లక్ లేన్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని పార్లమెంట్ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేయడంతో.. రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఖాళీ చేసిన విషయం తెలిసిందే. ఎంపీ క్వార్టర్ ఖాళీ చేసిన తరువాత రాహుల్ గాంధీ ప్రస్తుతం తన తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10, జన్‌పథ్‌లో ఉంటున్నారు. అయితే రాహుల్ గాంధీని కలవడానికి పార్టీ నేతలతోపాటు ఇతరులు కూడా ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి మరో చోటుకు మారాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. తాను ఉండబోయే చోటు తన నివాసంతోపాటు… కార్యాలయం కూడా ఒకే చోట ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలిసింది. అలా ఉండేలాగా ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్ ప్రాంతంలోని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ నివాసాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. షీలాదీక్షిత్ మరణానంతరం ఆ ఇంట్లో నివసించిన ఆమె తనయుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ అక్కడికి దగ్గరిలోనే సమీప బంధువుల ఇంటికి మారడంతో ఆ ఇల్లు ఖాళీగా ఉంది. దీంతో అదే ఇంట్లో రాహుల్ గాంధీ ఉండటానికి నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే రాహుల్ గాంధీ ఆ ఇంట్లోకి మారనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
*కాపురంలో చిచ్చు పెట్టిన టమోటా.. మొగుడిని వదిలేసిన భార్య..
పెరిగిన టమోటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. టమోటాలతో చేసే వంటలను పూర్తిగా చేసుకోవడం మానేశారు.. ప్రస్తుతం మార్కెట్ లో ధరలు రూ.200 పలుకుతుంది.. ఇక దీంతో గృహిణులు ఆచితూచి చూసి టమోటా తో వంటను వినియోగిస్తున్నారు. పలు చోట్ల టమాట చోరీలు, హత్యలు జరుగుతున్నాయి కూడా. తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దాంతో ఈ ఘటన వెలుగు చూసింది… వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో ధన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెమ్‌హోరి గ్రామానికి చెందిన సందీప్ బర్మన్ చిన్న దాబాను నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం కూరలు చేస్తున్న సమయంలో.. సందీప్ భార్యకు తెలియకుండా టమాటా వినియోగింగాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య కోపంతో చిన్న కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లింది.. భార్య ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో భర్త చేసేదిలేక సందీప్ ధన్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.. ఇక పోలీసులు ఆమె ఫోన్ నెంబర్ ను తీసుకొని ట్రేస్ చేశారు.. ఉమరియాలోని తన సోదరి ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి దంపతులిద్దరికీ సర్దిచెప్పి పంపించినట్లు ధన్‌పురి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సంజయ్ జైస్వాల్ తెలిపారు. పెరుగుతున్న టమాటా ధరలతో సామాన్యులే కాదు.. బంధాలు కూడా తెగిపోతున్నాయని అంటున్నారు.. ధరలు గొడవలు పెడుతున్న.. రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.. వెంటనే ఏదొక నిర్ణయం తీసుకోవాలని సదరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
*టీసీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో మొదటి త్రైమాసికంలో లాభాలు వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో లాభాలు రావడంతో తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు టీసీఎస్ శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు 15 శాతం వరకూ వేతనాల పెంపును ప్రకటించింది. ఏప్రిల్ నెల నుంచే అమలు చేయనున్నట్టు తెలిపింది. టీసీఎస్ ఆర్డర్ బుక్ జోరుగా ఉందని… ప్రస్తుతం 10.2 బిలియన్ డాలర్ల ఆర్డర్లు ఉన్నాయని నూతనంగా నియమితులైన సీఈవో, ఎండీ కృతివాసన్ వెల్లడించారు. కొత్తగా ఆవిర్భవించిన టెక్నాలజీల ఫలితంగా తమ సర్వీసులకు దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందన్న విశ్వాసాన్ని సీఈవో వ్యక్తం చేశారు. భౌగోళిక ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా ఆదాయ వృద్ధి 4.6 శాతానికి తగ్గింది. దేశీయ ఐటీ రంగానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే ప్రాంతం ఉత్తర అమెరికా, బీమా రంగం బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఇన్సూరెన్స్) కాగా అమెరికాలో చిన్న బ్యాంక్‌ల సంక్షోభంతో టీసీఎస్ ప్రభావితమైనట్టు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. యూకే ఆదాయం అత్యధికంగా 16.1 శాతం వృద్ధి చెందింది. లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగం ఆదాయం 10.1 శాతం పెరగ్గా, బీఎఫ్‌ఎస్‌ఐ ఆదాయం 3 శాతమే అధికమయ్యింది.
*త్రివిక్రమ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
త్రివిక్రమ్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. మాటల రచయిత గా తన కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు త్రివిక్రమ్. తన డైలాగ్స్ తెలుగులో పిచ్చ పాపులర్ అయ్యాయి. తన మాటలతో ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేస్తారు త్రివిక్రమ్.దర్శకుడు కాకముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా పనిచేశారు త్రివిక్రమ్. ఆయన తెరకెక్కించిన ఖలేజా మరియు అజ్ఞాతవాసి సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఓ పక్క సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే.. మరోపక్క పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు కూడా స్క్రీన్ ప్లే ను అందిస్తున్నారు త్రివిక్రమ్. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. అలాగే తాజాగా విడుదలకి సిద్ధంగా వున్న ‘బ్రో ది అవతార్ ‘సినిమాకు కూడా ఆయనే స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ కలిసి నటించడం జరిగింది.ఈ మూవీ తమిళ్ చిత్రం వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జంటగా కేతిక శర్మ నటిస్తోంది. మరో హీరోయిన్ ప్రియాప్రకాశ్ వారియర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.’బ్రో’ సినిమాకు స్క్రీన్ ప్లే అందించినందుకు గాను త్రివిక్రమ్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.. ఈ మూవీ కోసం మాటల మాంత్రికుడు రూ. 15 కోట్ల రూపాయల భారీ పారితోషికం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్ బాబుతో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు సమాచారం