ప్రధాని డిగ్రీ వివరాలు అక్కర్లేదు.. కేజ్రీవాల్ కు కోర్టు జరిమానా

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురు అయింది. ప్రధాని నరేంద్రమోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశిస్తూ జారీ అయిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కొట్టేసింది. ఆ సమాచారం అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ వివరాలు అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూ. 25,000 జరిమానా విధించింది. కేజ్రీవాల్ నాలుగు వారాల్లో గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డబ్బును డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆర్డర్ పై స్పందిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘‘తమ ప్రధాని ఎంత చదువుకున్నాడో తెలుసుకునే హక్కు దేశానికి లేదా?, కోర్టులో అతని డిగ్రీని బహిర్గతం చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకు?, డిగ్రీని చూడమని అడిగిన వ్యక్తికి జరిమానా విధించారు ఏం జరుగుతోంది? చదువుకోని లేదా తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి ప్రమాదకరం.” అని తన ట్వీట్ లో కామెంట్స్ చేశారు. 2016లో సమాచార హక్కు(ఆర్టీఐ) అభ్యర్థనపై స్పందించిన కేంద్ర సమాచార కమిషన్ ప్రధాని మోదీ గ్యాడ్యుయేషన్, పోస్ట్ గ్యాడ్యుయేషన్ డిగ్రీలకు సంబంధించిన సమాచారాన్ని అందించాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ), గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలను ఆదేశించింది.
వైసీపీని పడగొట్టాలని కుట్ర చేస్తున్నారు

వైసీపీని పడగొట్టాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. YCPకి ఓటు వేయొద్దని మహిళలకు చెప్పేవారుoటారు మీ ఇంట్లోని మగవారు కూడా. ఎందుకంటే వాళ్ల చేతుల్లోకి వెళ్లాల్సిన చాలా వాటిని మీ చేతుల్లోకి మార్చాము. ఆ కోపం వాళ్ళకి ఉంది…. ఈ పార్టీని పడగొట్టాలని వాళ్ళు చూస్తున్నారు. వాళ్లు పార్టీని పడగొడితే మొట్టమొదట తగిలే గుండు ఆడవాళ్ళకే. శత్రువు నీ ఇంట్లోనే ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా వారిని నిలువరించాలి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు ఓటు వేయడం అంటే మీ చేతుల్ని మీరు నరుక్కోవడమే అన్నారు మంత్రి ధర్మాన. ధర్మాన ప్రసాదరావుని ఓడించిస్తే ఏమైపోతుంది. నేను పోటీ చేస్తానో, లేదో ఆరోజు పరిస్థితిని బట్టి చూద్దాం. కానీ మీకు సహాయం చేసిన పార్టీని,నాయకుడినీ మీరు ఓడిoచేస్తే మహిళలకు ఏమి చేసినా వేస్ట్ అని అనరా…?మగవారు కొంతమంది పోరంబోకుల్లా తయారయ్యారని బాధ్యతలు లేని వారిని ఉద్దేశించి అన్నాను. నేను అలా అంటే చాలామంది పోరంబోకులకి కోపం వచ్చింది. కోపం వచ్చిన పోరంబోకులకి ఒక నమస్కారం. పోరంబోకు అని ఎవడైనా ఒప్పుకుంటే వాడికో నమస్కారం అన్నారు మంత్రి ధర్మాన ప్రసదరావు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. తెలంగాణలో ఇరు పార్టీల మధ్య పోస్టర్ వార్..

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ ముదురుతోంది. నువ్వా నేనా అన్నరీతిలో పోస్టర్లు పెడుతూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ పోస్టర్ వెలిసింది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ మండిపడుతోంది. ఐదేళ్లు పూర్తి అయినా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు 40 శాతం కూడా పూర్తి కాలేదని, ఇంకెన్నినాళ్లు ఈ ఫ్లైఓవర్ కడుతారంటూ మోదీని ప్రశ్నిస్తూ అడుగడుగున పోస్టర్లు వెలిశాయి. ఇదిలా ఉంటే బీజేపీ కూడా అంతేధీటుగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వమే ఫ్లైఓవర్ నిర్మాణ జాప్యానికి కారణం అంటూ మంత్రి కేటీఆర్ పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై పసుపు బోర్డు గురించి ప్రశ్నిస్తూ పోస్టర్లు వెలుగులోకిరాగా.. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ తలదించుకునేలా చేశారంటూ పోస్టర్లు వెలిశాయి.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కుపై సీఎం సమీక్ష

వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, గనులశాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అత్యంత ప్రాధాన్యత అని స్పష్టంచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో సర్వే చేపట్టడంలేదన్నారు సీఎం. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామని, ఇది ఇప్పటివారికే కాకుండా భవిష్యత్తు తరాలవారికీ కూడా చాలా ఉపయోగమని తెలిపారు సీఎం. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసేదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, జాప్యానికి తావులేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. రెవిన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందన్నారు అధికారులు. మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలన్నారు సీఎం. అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్ చేయాలన్నారు సీఎం. దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందన్నారు సీఎం.
కోట్లు లాగేసుకున్నారు.. డెబ్భై ఏళ్ల వృద్ధ దంపతులు ఆత్మహత్య

కోటి విద్యలు కూటి కోసం మాత్రమే అనే సామెత వినే ఉంటారు. ఎన్ని వందల వేల కోట్లు సంపాదించినా జానెడు పొట్టకు తిండి లేకపోతే ఎంత కష్టపడినా వృథా. నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ బంధాలే. ప్రతీ వ్యక్తి తన స్వార్థం కోసం మాత్రమే ఇతరులపై ఆధారపడతాడు. అది బయట వారు మాత్రమే కాదు… కడుపున పుట్టినవారు, తోబుట్టువులు కూడా అంతే. ఇది హర్యానాలో జరిగిన సంఘటనతో స్పష్టమైంది. హర్యానాలోని చర్ఖీ దాద్రి జిల్లాలో డెబ్భై ఏళ్ల వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తమ మరణానికి కారణం ఏమిటో ఓ లేఖలో తెలిపారు. తమ పిల్లలే వారి చావుకి కారణమని లేఖలో పేర్కొన్నారు. 2021 బ్యాచ్ కి చెందిన హరియాణా కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ పేరెంట్స్, ఇతర కుటుంబ సభ్యులు తమను చూసుకోవడం లేదని.. కనీసం వేళకు తిండి కూడా పెట్టడం లేదని లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. జగదీష్ చంద్ర, ఆయన సతీమణి బాగ్లీ బాద్రాలోని గోపీ గ్రామంలో జీవించేవారు. తన కొడుకులకు పట్టణంలో 30 కోట్ల ఆస్తి ఉన్నా తమకు అన్నం పెట్టడంలేదని లేఖలో రాశారు. తమపై దౌర్జన్యం చేసిన కొడుకు, కోడళ్ళకు శిక్ష పడినప్పుడే చనిపోయిన మా ఆత్మలకు శాంతి చేకూరుతుందని రాసుకొచ్చారు.
ఫేస్ బుక్ లో ప్రేమించాడు.. అన్నీ అయ్యాక వద్దన్నాడు

ఆన్ లైన్లో ప్రేమలు చాలా వరకు ఫేక్ అని మరోమారు రుజువైంది. నేటి యువత ఆకర్షణకు ప్రేమకు తేడా తెలియకుండా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ యువకుడు ఫేస్బుక్లో యువతితో స్నేహం చేశాడు. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత యువతి కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా వారికి తెలియకుండా తన ప్రియుడి వద్దకు వెళ్లింది. దీని తర్వాత వారిద్దరూ ఛప్రాలో వివాహం చేసుకున్నారు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు నెలల పాటు వారి సంసారజీవితం సాఫీగానే సాగింది. ఆ తర్వాత భర్త కనిపించకుండా పోయాడు. తన భర్త ఏమైపోయాడని కంగారుతో భార్య అతడికి ఫోన్ చేసింది. ఆ సమయంలో అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. బాధితురాలి వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రంలోని సౌనోలి గ్రామానికి చెందిన అంకిత్ కుమార్, భాకురా భితాతి గ్రామానికి చెందిన ప్రీతి కుమారి అనే యువతితో ఫేస్బుక్లో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ మెసెంజర్లో చాటింగ్ చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ ఒకరి నంబర్ ఒకరు తీసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య వాట్సాప్‌లో సంభాషణ మొదలైంది. కొంతకాలం తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2022 డిసెంబర్ 27న కోర్టులో వివాహం జరిగిందని యువతి తెలిపింది. కొన్ని రోజుల తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం ఒక దేవాలయంలో పెళ్లిచేసుకున్నట్లు బాధితురాలు వెల్లడించింది.
ఉస్తాద్ డైరెక్టర్ కు పవన్ స్పెషల్ విషెస్

షాక్ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు హరీష్ శంకర్. మొదటి సినిమానే మంచి థ్రిల్లింగ్ గా తీసి.. పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అయితే అందుకోలేదు కానీ.. హరీష్ కు మంచి అవకాశాలను అందించింది. ఇక హరీష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కన్నా ముందు వరుస ప్లాపులతో ఉన్నాడు. ఒక్క హిట్.. ఒకేఒక్క హిట్ కోసం పవన్ అభిమానులు సైతం ఎదురుచూస్తున్న తరుణంలో హరీష్ శంకర్.. గబ్బర్ సింగ్ ను అనౌన్స్ చేశాడు. అప్పటికే హరీష్ రవితేజతో మిరపకాయ్ సినిమా తీసి మంచి మాస్ హిట్ ను అందుకున్నాడు. దీంతో గబ్బర్ సింగ్ పై అంచనాలు ఆకాశాన్నీ తాకాయి. అనుకున్నట్లే ఆ అంచనాలను హరీష్ అందుకున్నాడు. పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు భారీ కలక్షన్లను రాబట్టింది గబ్బర్ సింగ్. నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను అని పవన్ తోనే ట్రెండ్ సెట్ చేశాడు హరీష్ శంకర్. ఇక ఆ సినిమా తరువాత మళ్లీ పవన్ తో హరీష్ జత కట్టిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. త్వరలోనే పవన్ ఈసినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇకపోతే నేడు హరిశ శంకర్ పుట్టినరోజు. కాగా, పవన్ కళ్యాణ్, తన ఉస్తాద్ డైరెక్టర్ కు స్పెషల్ గా విష్ చేశాడు. “ప్రేక్షకుల నాడీ.. నవతరం అభిరుచులు తెలిసిన దర్శకుడు శ్రీ హరీష్ శంకర్. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు భాష, రచనలపైనా, కళల గురించి చక్కటి అవగాహన ఉన్న దర్శకుడు శ్రీ హరీష్ శంకర్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో హరీష్ శంకర్ ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.
సంవత్సరాంతం.. సంపద పెరిగెను అమాంతం..
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతాన్ని మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి ట్రేడింగ్ రోజుని శుభారంభం చేయటమే కాకుండా ఇన్వెస్టర్లలో మస్త్ జోష్ నింపింది. నిన్న గురువారం సెలవు అనంతరం ఇవాళ శుక్రవారం తిరిగి ప్రారంభమైన ఈక్విటీ మార్కెట్.. పెట్టుబడిదారుల సంపదను 3 పాయింట్ 7 లక్షల కోట్లు పెంచటం విశేషం.దీంతో.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎం-క్యాప్ మొత్తం విలువ 258 పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరింది. రెండు కీలక సూచీలు అద్భుతంగా రాణించాయి. ఎనర్జీ.. బ్యాంక్‌లు.. ఫైనాన్షియల్స్.. టెక్నాలజీ స్టాక్‌లు లాభాల బాటలో ముందు వరుసలో నిలిచాయి. ఏప్రిల్ సిరీస్ మంత్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌కి సంబంధించి ఇవాళ మొదటి ట్రేడింగ్ సెషన్ కావటం కూడా మరో చెప్పుకోదగ్గ అంశమే. సెన్సెక్స్ ఒక్కరోజే ఏకంగా వెయ్యీ 31 పాయింట్లు పెరిగి 58 వేల 991 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.నిఫ్టీ 279 పాయింట్లు లాభపడి 17 వేల 359 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 4 కంపెనీలు మాత్రమే తక్కువ వ్యాల్యూ వద్ద ముగిశాయి. రిలయెన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహింద్రా బ్యాంక్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ తదితర సంస్థలు మంచి పనితీరు కనబరిచాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లోని 15 సబ్-ఇండెక్స్‌లన్నీ మెరిశాయి.