సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ లేఖ.. ఆ రోజులు వస్తాయని హెచ్చరిక
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు, ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆ లేఖలో డిమాండ్ చేశారు. తమ సమస్యల్ని పరిష్కరించమంటూ ఆర్టిజన్లు, ఉద్యోగులు అనేక నెలల నుంచి ఆందోళన చేస్తున్నారని.. దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వారి సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గర్హనీయమని అన్నారు. వారి పట్ల విద్యుత్ శాఖ యాజమాన్యం, రాష్ట్ర సర్కార్ కనీసం శ్రద్ధ చూపకపోవడం.. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీ ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని కనబరుస్తోందని మండిపడ్డారు.జీపీఎఫ్, పీఆర్‌సీ వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. 1999 నుండి 2004 మధ్యకాలంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైన వారికి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌లు న్యాయబద్ధమైనవని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని.. అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యమంలో వాళ్లు చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. ప్రభుత్వ పాలనలో విద్యుత్ శాఖ అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు. ఒకవేళ ఆర్టిజన్లు, విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి దిగితే.. మొత్తం పాలనా యంత్రాంగమే కుప్పకూలుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి నుండీ చిన్నచూపే ఉందని విమర్శించారు.
అన్నా రాంబాబు విమర్శలపై వైవీ సుబ్బారెడ్డి వివరణ
భక్తులు సౌకర్యార్ధం బ్యాటరీతో నడిచే ఉచిత ధర్మరథాలను ప్రారంభించారు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమలలో అనేక చర్యలు తీసుకుంటున్నాం. ప్లాస్టిక్ నిషేధంతో పాటు టిటిడి,ఆర్టిసి వాహనాలను బ్యాటరితో నడిపేవి అంచెలు వారిగా అందుభాటులోకి తీసుకువస్తున్నాం. 18 కోట్లు విలువ చేసే 10 ధర్మరథాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ ఉచితంగా అందజేసింది అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. విమర్శలు చేయడానికే వీఐపీలు తిరుమలకు వస్తే ఏమీ చేయలేం. ఆ ఎమ్మెల్యే 28 మందిని తీసుకొచ్చారు.అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలంటే కుదరదు..అయినప్పటికీ 18 మందికి ప్రోటోకాల్ కేటాయించారు.. వీఐపీలకు నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం అన్నారు. ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా టీటీడీపై విమర్శలు చేస్తే ఏమీ చేయలేం అన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఇదిలా ఉంటే ….తిరుమలలో దర్శనం సందర్భంగా తనకు గౌరవం లేదని ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీటీడీపై మండిపడ్డారు. నీ వాళ్ళకు, నీ చుట్టాలకు ఒక చట్టం.. ఇతరులకో చట్టమా..?” -టీటీడీ మీ ఎస్టేట్ అనుకున్నారా..? -సిఎంవో సిఫారసును కాదంటారా..? ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. టీటీడీ ఈఓ ఒంటెత్తు పోకడపై గిద్దలూరు ఎమ్యెల్యే అన్నా రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలు, సౌకర్యాల కల్పనలో ప్రోటోకాల్ ప్రక్రియను టిటిడి ఈఓ ,ఇతర అధికారులు దుర్వినియోగం చేస్తున్నారంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆదివారం ఆరోపించారు..
బావిలో సెక్యూరిటీ గార్డ్ డెడ్ బాడీ.. హంతకుడెవరంటే?
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మధ్య వివాదం తలెత్తింది. ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మధ్య గొడవ హత్యకు దారి తీసింది. తానే హత్య చేశానని చెప్పి మరో సెక్యూరిటీ గార్డ్ పరారయ్యాడు. ఈ సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టిస్తోంది. అసోం రాష్ట్రానికి చెందిన శ్రీ ప్రొబిన్ (39), తీటరాం లు లాల్ గడి మలక్ పేట్ గ్రామ పరిధిలోని హై టెక్ సీడ్ కంపెనీలో గత ఏడాదిగా సెక్యూరిటీ గార్డ్స్ గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి వారి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందో?… పాత కక్షలే ఉన్నాయో కాని శ్రీ ప్రొబిన్ ను కత్తితో గొంతు కోసి చంపి మృతదేహాన్ని బావిలో పడేశాడు. అనంతరం కంపెనీ లో పనిచేస్తున్న సిబ్బందికి ఫోన్ చేసి తానే హత్య చేశానని చెప్పి నిందితుడు తీటారం పరారయ్యాడు. విషయం తెలుసుకున్న శామీర్ పేట్ సీఐ సుధీర్ కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న తీటరాం ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టైమ్ సంఘటన స్థలంలో లభ్యమైన సామగ్రిని సీజ్ చేశారు. అంతేకాకుండా బావి నుండి శ్రీ ప్రొబిన్ మృతదేహన్ని సీఐ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో వెలికి తీశారు. హత్యకు గల కారణాలపై పోలీస్ లు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సమ్మర్ రద్దీకి తగ్గట్టుగా భక్తులకు సౌకర్యాలు
విద్యార్ధినీ, విద్యార్ధులకు పరీక్షలు ప్రారంభం అయ్యాయి. త్వరలో ముగియనున్నాయి. దీంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. రాబోయే వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్ధం అలిపిరి మార్గంలో 10వేలు,శ్రీవారీ మెట్టు మార్గంలో 5వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తాం..రాబోవు మూడు నెలలు పాటు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం వుంది..వేసవి రద్దీ నేపథ్యంలో మూడు నెలలు పాటు ప్రజాప్రతినిధులు సిపారస్సు లేఖలను జారీ చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.తిరుమల కొండ పై 40వేల మంది భక్తులకే మాత్రమే వసతి సౌకర్యం కల్పించే అవకాశం వుంది..80శాతం గదులను సామాన్య భక్తులకు కేటాయిస్తాం..రద్దీకి అనుగుణంగా భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తాం..కల్యాణకట్టలను 24గంటలు భక్తులకీ అందుబాటులో వుంచుతాం అని వివరించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మరోవైపు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 5 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 79,415 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు 28,454 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.86 కోట్లు అని టీటీడీ తెలిపింది.
చెల్లిమీద వల్లమాలిన ప్రేమ.. అన్నలు ఎంత కట్నం ఇచ్చారంటే ?
ఈ రోజుల్లో ఆస్తికోసం సొంతవాళ్లనే చంపుకుంటున్నారు. జీవితంలో తమకు బంధాల కన్నా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న ఈ రోజుల్లో ఆ అన్నలు మాత్రం అలా ఆలోచించలేదు. ఆస్తులు కాదు తమకు చెల్లెలె ముఖ్యమని పెళ్లిని ఘనంగా జరిపించారు. కట్నం కింద రూ.8కోట్లు సమర్పించుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇలా పెళ్లి వేడుకకు కట్న కానుకలు సమర్పించడాన్ని మైరా అంటారు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని ధింగ్‌సార గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు తమ సోదరి వివాహ వేడుకలో ఎన్నడూ లేని విధంగా మైరాను చెల్లించి చరిత్ర సృష్టించారు. ఆమె సోదరి వివాహానికి మైరాగా సోదరులు మొత్తం రూ.8.1 కోట్లు చెల్లించారు. ధింగ్‌సార గ్రామానికి చెందిన అర్జున్ రామ్ మెహారియా, భగీరథ్ మెహారియాలు కలిసి తన సోదరి వివాహాన్ని ఘనంగా జరిపించారు. దీనిలో భాగంగా వీరు తమ చెల్లికి కానుకగా దాదాపు రూ.8.1 కోట్ల విలువ చేసే ఆస్తులను కానుకగా అందించారు. ఈ సోదరులు తమ సోదరికి మైరాలో రూ.2.21 కోట్ల నగదుతో పాటు, రూ.4 కోట్ల విలువైన 100 బిగాల భూమి, 1.105 కేజీల బంగారం, 14 కేజీల వెండి, గూడా భగవాన్‌దాస్ గ్రామం వద్ద ట్రాక్టర్ నిండా గోధుమలు, 1 బిగా భూమి ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా ఎంతంటే?
ఏపీకి ప్రధాన వరంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఇటీవల పోలవరం ఎత్తు గురించి కేంద్రం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయంపై కేంద్రం వివరణ ఇచ్చింది. రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 47,725 కోట్లు. 2019లో జలశక్తి శాఖకు వచ్చిన సవరించిన అంచనా వ్యయం 2017-18 ధరల ప్రకారం రూ. 55,548.87 కోట్లు. మారిన ఈ వ్యయ అంచనాలను జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది. 2020లో “రివైజ్డ్ కాస్ట్ కమిటీ” (ఆర్సీసీ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. “రివైజ్డ్ కాస్ట్ కమిటీ” సిఫార్సుల ప్రకారం అంచనా వ్యయం రూ. 47,725 కోట్లుగా నిర్థారించాం అని కేంద్రమంత్రి తెలిపారు. 2013-14 ధరల ప్రకారం ఈ అంచనా వ్యయం రూ. 29,027.95 కోట్లు. అంచనా వ్యయం పెరుగుదలలో భూసేకరణ, పరిహారం, పునరావాసం ఉంటాయన్నారు. ధరల్లో పెరుగుదలే ప్రధాన కారణం. 2014 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 13,463.21 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తిరిగి చెల్లింపులు చేసింది కేంద్ర జల సంఘం, “పోలవరం ప్రాజెక్టు అథారిటీ” లు చేసిన సిఫార్సులు మేరకు ఈ చెల్లింపులు చేశామని మంత్రి వివరణ ఇచ్చారు.
రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘మెగా పవర్’ ఫస్ట్ లుక్ విడుదల!
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీస్సులతో సత్య ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.1గా ఇటీవల ప్రారంభమైన ‘మెగా పవర్’ చిత్రం టైటిల్ లోగోను సోమవారం విడుదల చేశారు. శ్రీ కల్యాణ్, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకుడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మాతలు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని దర్శకులు మెహర్ రమేష్, కె.ఎస్ రవీంద్ర (బాబీ) ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ “రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవిగారి మీద ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాం. మేం అడగ్గానే బిజీ షెడ్యూల్‌లో ఉన్నా మెహర్ రమేశ్, బాబీ మా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చరణ్ పుట్టినరోజున మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. అలాగే మెగా ఫ్యామిలీ హీరోల సపోర్ట్‌తో ముందుకెళ్తున్నాం. ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో మొదలైన మా చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మెగా హీరోల అభిమానులు అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో బావిలో దూకిన భార్య
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకేసింది. ముందుగా తన పిల్లలను బావిలో తోసేసి ఆ తర్వాత తానూ దూకేసింది ఆ తల్లి. కానీ, అందులో దూకిన తర్వాత ఆమెకు మళ్లీ ప్రాణాలపై ఆశ పుట్టింది. ఎలాగైనా బతకాలని నిర్ణయించుకుంది. బావిలోకి లోతుగా వేలాడుతున్న ఓ తాడును అందుకుంది. పెద్ద బిడ్డను పట్టుకుని ఆమె బయటకు వచ్చేసింది. ఈ ఇద్దరు బయటకు వచ్చారు. కానీ, ముగ్గురు పిల్లలు ఆ బావిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన భార్య ప్రమిలా ఆత్మహత్య చేసుకోవాలనే క్షణికావేశానికి లోనైంది. అంతేకాదు, తన పిల్లలనూ వెంట తీసుకెళ్లాలని అనుకుంది. ఇంటికి సమీపంలోని బావి వద్దకు వారందరినీ తీసుకెళ్లింది. నీటిలో పడిపోవడంతో మహిళ ప్రాణ భయంతో తన పెద్ద కుమార్తెతో సురక్షితంగా పైకి ఎక్కేందుకు బావిలోకి వేలాడుతున్న తాడును పట్టుకుంది. ఆమె తన ముగ్గురు పిల్లలను విడిచిపెట్టింది, అందులో 18 నెలల కుమారుడు వరుసగా మూడు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుర్హాన్‌పూర్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్ది గ్రామంలో ఈ ఘటన జరిగిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ కుమార్ తెలిపారు. ప్రమీలా భిలాలా అనే మహిళ తన భర్త రమేష్‌తో గొడవపడిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలిపారు.