AP News: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బుధవారం ఓ ప్రైవేట్ వైద్యుడి నిర్వాకం వల్ల నెల రోజుల వయస్సున్న బాలుడు మృతి చెందాడు. బొడ్డు కింద చీము వస్తుందని చికిత్స కోసం తల్లిదండ్రులు ప్రైవేట్ దవాఖానకు తీసుకొచ్చారు. అయితే వైద్యుడు నిర్లక్ష్యంగా బొడ్డు కింద కోసేయడంతో బాలుడి పేగులు బయటపడ్డాయి. దీంతో ఆ వైద్యుడు పేగులను కడుపులో వేసి ప్లాస్టర్ వేశాడు. ఈ క్రమంలో బాలుడిని వెంటనే కర్నూలుకు తీసుకుపోవాలని వైద్యుడు చెప్పాడు. దీంతో వెంటనే కర్నూలులోని ఆస్పత్రికి బాలుడి తల్లిదండ్రులు తరలించారు. అక్కడి వైద్యులు బాలుడిని పరిశీలించగా.. అప్పటికే చనిపోయాడని తెలిపారు.
Read Also: Asia Cup 2023: బంగ్లాదేశ్కు ‘డూ ఆర్ డై’ మ్యాచ్.. శ్రీలంకతో ఓడిపోతే సర్దుకోవాల్సిందే
ఎమ్మిగనూరులో వైద్యుని నిర్లక్ష్యంతో శిశువు మృతి పై అధికారులు స్పందించారు. శిశువు మృతిపై NTV లో వరుస కథనాలు ప్రసారం కావడంతో.. జిల్లా వైద్యాధికారిణి సత్యవతి విచారణ చేపట్టారు. బాలుడికి చికిత్స కోసం తీసుకొచ్చిన సూర్యతేజ హాస్పిటల్ లో రిటైర్డ్ సూపరెంటెండెంట్ డా. బాలయ్యను వైద్య అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా.. శిశువుకు చికిత్స చేసిన డాక్టర్ రాఘవేంద్ర వివరాలపై ఆరా తీస్తున్నారు. అయితే బాలుడికి బొడ్డు కింద చీము వస్తుందని తల్లిదండ్రులు తీసుకురాగా.. డా. రాఘవేంద్ర ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు. మరోవైపు తమ చిన్నారి ఇక లేదంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన ఆ వైద్యుడిని వదలొద్దని వారు వేడుకుంటున్నారు.