Telangana Assembly Elections 2023: కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.. దీంతో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసినట్టు అవుతుంది.. ఇక, ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈనెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా.. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా నిర్ణయించారు. ఇక, ఈనెల 30న పోలింగ్ నిర్వహించనుండగా.. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్, ఎన్నికల ఫలితాల ప్రకటన ఉండనుంది.
నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగుసెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. నామినేషన్ల దాఖలులో ఆర్వో, ఏఆర్వో కార్యాలయం సమీపంలోని వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
పోటీ చేసే అభ్యర్థులు.. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు సమర్పించవచ్చు. సువిధ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అభ్యర్థులు నామినేషన్‌తో పాటు.. అఫిడవిట్ దాఖలు చేసి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. విదేశీ ఓటర్లు అక్కడి నుంచే నామినేషన్ దాఖలు చేస్తే అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఏ-ఫారం, బీ-ఫామ్‌లతో నామినేషన్ల దాఖలుకు.. చివరిరోజు 3 గంటల్లోపు అఫిడవిట్ వేయాల్సి ఉంటుంది.
ఇక ఇవాళ్టి నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగుతారు. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఆర్ఎస్, ఐఆర్ఎస్ఎలను పరిశీలకులుగా నియమించగా.. నేటి నుంచి విధుల్లో చేరుతారు. అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టడంతో పాటు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు. కేటాయించిన నియోజకవర్గాల్లో శాంతిభద్రతల నిర్వహణ, సంబంధిత అంశాలను పర్యవేక్షిస్తారు.