CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 571 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఐసీసీసీ కేంద్రంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శిక్షణ, ఇతర అవసరాల విషయంలో వ్యయానికి వెనుకాడమని తేల్చిచెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 మందికి పైగా విద్యార్థులు ఉన్న చోట్ల కొత్త పాఠశాలలు నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.
హైస్కూల్ స్థాయిలోనే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్‌లో తాము కోరుకునే రంగాల్లో విజయం సాధించేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే భాషా పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందించేలా విద్యా విధానాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.
Dil Raju : 2014 – 2023 సినిమా హీరో హీరోయిన్ దర్శకులకు కూడా అవార్డులు!
పట్టణీకరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, హెచ్ఎండీఏ, మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ భూముల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యాసంస్థలను హేతుబద్దీకరించి, ప్రతి పాఠశాలలో సరైన సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
గురుకుల పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు వల్ల విద్యార్థులు అక్కడికి ఆకర్షితులవుతున్నారని, అదే విధంగా డే స్కాలర్లకూ ఈ వసతులు అందించే అవకాశం పరిశీలించాలని అధికారులను కోరారు. పిల్లలలో కుటుంబం, సమాజం పట్ల అవగాహన పెంచేందుకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. దీనివల్ల వారు మానసింకగా దృఢంగా తయారై బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని సీఎం అభిప్రాయపడ్డారు.