మన అకేషన్స్ కోసం పరీక్షలు అస్సలు వాయిదా పడవు. అందుకే పరీక్షలు ఉన్నప్పుడు.. పెళ్లి, ఇతర ముహూర్తాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడతాం. అయితే అప్పుడప్పుడు అనుకోకుండా పెళ్లి ముహూర్తం రోజున పరీక్ష రాయాల్సి వస్తుంది. అప్పుడు చాలా మంది తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ఓ వధువు మాత్రం అలా అనుకోలేదు. ఉదయం పెళ్లి చేసుకుని.. నేరుగా పరీక్షా హాలుకి చేరుకుంది.
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తొలి పేపర్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో పేపర్ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షకు చిత్తూరుకు చెందిన కొత్త పెళ్లి కూతురు మమత హాజరయ్యారు. మమత ఆదివారం ఉదయం వివాహం చేసుకుని.. పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ సెంటర్‌లో పరీక్షకు హాజరయ్యారు.
గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యేందుకు డెడ్ లైన్ 9.45 కావటంతో.. పరీక్షా కేంద్రాల వద్ద గేట్లకు సిబ్బంది తాళాలు వేశారు. విజయనగరం ఎంవీజీఆర్ కాలేజీ సెంటర్‌కు అక్కిన మనోహర్ నాయుడు ఆలస్యంగా చేరుకున్నాడు. పది నిమిషాలు ఆలస్యం కావడంతో ఎగ్జామ్ సెంటర్‌లోనికి అధికారులు అనుమతించ లేదు. నిరాశతో మనోహర్ ఏడ్చుకుంటూ వెనుదిరిగాడు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలోని పరీక్షా కేంద్రానికి అభ్యర్థి ఆలస్యంగా వచ్చాడు. అభ్యర్థి బ్రతిమాలినా అధికారులు అంగీకరించలేదు.