New Born Baby: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో వైద్య శాస్త్రాన్ని ఆశ్చర్యపరిచే అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాజా తుకోజీరావ్ ఆసుపత్రి (MTH)లో ఆగస్టు 13న ఓ శిశువు జన్మించింది. ఈ శిశువుకు రెండు తలలు, రెండు గుండెలు, నాలుగు చేతులు, రెండు కాళ్లు ఉండగా ఛాతీ, పొట్ట మాత్రం ఒకటే శరీరంగా ఉన్నాయి. ఖరగోన్ జిల్లా, మోతాపుర గ్రామానికి చెందిన సోనాలి–ఆశారామ్ దంపతులకు పుట్టిన ఈ శిశువు వారి మొదటి సంతానం. పుట్టిన వెంటనే వైద్యులు శిశువును ప్రత్యేక పర్యవేక్షణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను ఎంవై ఆసుపత్రిలోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)లో ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉంచారు. పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, వైద్యుల ప్రత్యేక బృందం నిరంతరం మానిటరింగ్ చేస్తోంది.
Trump-Zelenskyy: జెలెన్‌స్కీతో భేటీకి ముందు ట్రంప్ ఝలక్.. మళ్లీ వాగ్యుద్ధం తప్పదా?
గత 24 గంటల పరిశీలనలో ఒక తల గల శిశువు ఏడిస్తే, మరొక తల గల శిశువులో కూడా కదలికలు మొదలవుతున్నాయని వైద్యులు గుర్తించారు. దీని వలన రెండవ శిశువుకూ నిద్ర భంగం కలుగుతోందని తెలిపారు. దీనితో ఇద్దరి మధ్య న్యూరోలాజికల్ కనెక్షన్ ఉన్నదని వైద్యులు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని “కంజాయిన్డ్ ట్విన్స్” అని వైద్య శాస్త్రంలో పిలుస్తారు. అయితే ఇది ఇలాంటి మొదటి కేసు కాదు. కేవలం 23 రోజుల క్రితమే జూలై 22న ఎంథిహెచ్‌లో మరో రెండు తలల శిశువు పుట్టింది. 16 రోజుల పాటు స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌లో ఉంచిన ఆ శిశువు ఆగస్టు 6న ఇంట్లో మృతి చెందింది.
పెడియాట్రిషన్ ప్రకారం, ఆ శిశువు శరీరం ఒకటే అయినప్పటికీ రెండు తలలు ఉన్నాయి. గుండెలు రెండు ఉండగా వాటిలో ఒకటి బలహీనంగా ఉంది. దీనివల్ల మరో గుండెపై ఒత్తిడి పెరిగి, దీర్ఘకాలం జీవించడం కష్టమవుతుందని తెలిపారు. ఇలాంటి కేసుల్లో బ్రతికే అవకాశం 0.1% కంటే తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకారం.. ఈ పరిస్థితి తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా జన్యు సమస్యల వల్ల రాదు. ఇది 50 వేల నుండి 2 లక్షల శిశువుల్లో ఒకసారి మాత్రమే కనిపించే అరుదైన పరిస్థితి. సాధారణంగా ఇలాంటి శిశువులు గర్భంలోనే మరణిస్తారు లేదా పుట్టిన 48 గంటల్లో మృతి చెందుతారు. ఈ కేసు వైద్యరంగానికి ఒక ముఖ్యమైన అధ్యయనంగా మారిందని వారు తెలిపారు. ఈ వింత శిశువు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, పాప పరిస్థితిపై దేశవ్యాప్తంగా వైద్యులు ఆసక్తిగా గమనిస్తున్నారు.