Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్ రెండో రోజు సీఐడీ విచారణ ముగిసింది. ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి పలు అంశాలపై సీఐడీ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలు, జీఓఎమ్ నిర్ణయం, లోకేష్ పాత్రపై సీఐడీ ప్రశ్నలు వేసింది. చాలా ప్రశ్నలకు నాకు సంబంధం లేదు, తెలియదు అని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. పలు ప్రశ్నలకు సమాధానాలు దాట వేశారు అని సీఐడీ వర్గాలు అంటున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నారా లోకేష్‌ను సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు.
Also Read: Bitra Sivannarayana: పురంధేశ్వరిపై సజ్జల కామెంట్లకు బీజేపీ కౌంటర్.
లోకేష్ మాట్లాడుతూ.. “హైకోర్టు ఒక్కరోజే హాజరు కావాలని చెప్పింది. అయినా సీఐడీ అధికారుల సూచన మేరకు రెండో రోజు కూడా హాజరయ్యా. వాషింగ్ మెషిన్‌లో తిప్పినట్టు నిన్నటి ప్రశ్నలే అడిగారు. 47 ప్రశ్నలు అడిగారు. రెండు, మూడు మాత్రమే కొత్త ప్రశ్నలు. మా అమ్మ ఐటీ రిటర్న్స్ నా ముందు పెట్టారు. భువనేశ్వరి ఈ కేసులో నిందితురాలు కాదు. అయినా మా అమ్మ ఐటీ రిటర్న్స్ మీ చేతికి ఎలా వచ్చాయి అని అడిగాను. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాం. దీనిపై న్యాయపరంగా పోరాటం చేయాలనుకుంటున్నా.” అని నారా లోకేష్ వెల్లడించారు.