Bitra Sivannarayana: పురంధేశ్వరిపై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ జోలికి వస్తే సహించమని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ హెచ్చరించారు. పురంధేశ్వరిపై విమర్శలు చేసే స్థాయి సజ్జలకు లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మద్యం స్కాంపై సీబీఐ విచారణ కోరగానే వైసీపీ నేతలకు వణుకు పుడుతోందన్నారు. రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనున్న రాజకీయ కక్షలను ఆసరాగా తీసుకుని పురంధేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించమన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆయన ఆరోపించారు.
Also Read: Chandrababu: చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
రాష్ట్రప్రభుత్వం పై ఆరోపణ చేస్తే సమాధానం చెప్పే దమ్ము వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు బిట్ర శివన్నారాయణ. మద్యం అమ్మకాల్లో నగదు ఎక్కడకు పోతోందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల నిధుల దారి మళ్లింపుపై ప్రజలకు శ్వేత పత్రం విడుదల చేయమంటే ఇంతవరకు ప్రభుత్వంలోని మంత్రులు ఎవ్వరూ నోరు మెదప లేదన్నారు. మద్యం స్కాంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రిని కోరగానే పురంధేశ్వరిపై సజ్జల అవాకులు చవాకులు పేలుతున్నారని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ వ్యాఖ్యానించారు.