Prasanna Kumar Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. పుంగనూరులో చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలకు తెరలేపాడు. ఎన్నికలు వస్తున్నాయని తెలిసి ఏదో ఒక విధ్వంసం సృష్టించాలని ఆలోచిస్తాడు అని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాహనాల్లో రాళ్లు, రాడ్లు, కర్రలు, బీర్ బాటిళ్లు, గన్స్ ఉన్నాయి.. ఇది పక్కా చంద్రబాబు నాయుడు ప్లాన్.. ఆయనే గొడవలు చేయించి దానిని వైసీపీ నాయకులు.. కార్యకర్తలకు రంగు పులిమి లబ్ధి పొందాలని చూశాడని ఫైర్ అయ్యారు.
పరిటాల రవిని చంపినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు జిల్లా ఇంఛార్జ్‌గా ఉన్నాను అని గుర్తుచేసుకున్న నల్లపరెడ్డి.. ఆ సమయంలో నాకు.. కరణం బలరామకృష్ణమూర్తికి స్వయంగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఆర్టీసీ బస్సులు తగలబెట్టించండి.. విధ్వంసం చేయండి… బజార్ సెంటర్ వెళ్లి షాపులన్నీ ధ్వంసం చేయమని చెప్పారన్నారు. ఇన్ని కుట్రలు.. కుతంత్రాలు కలిగిన వ్యక్తి చంద్రబాబని ఆరోపించిన ఆయన.. అసలు అతను రాజకీయ నాయకుడే కాదు.. భారతదేశంలోనే ఒక పెద్ద రౌడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో పోలీసుల మీద దాడి చేశారు.. చాలామంది పోలీసులకు గాయాలయ్యాయి.. వాహనాలు తగలబెట్టారు. దీని వెనుక చంద్రబాబునాయుడు హస్తం ఉందన్నారు. కచ్చితంగా ఇటువంటివన్నీ ప్రోత్సహించేది చంద్రబాబే.. దానికి నేను, బలరామకృష్ణమూర్తిలే సాక్ష్యంగా చెప్పుకొచ్చారు.
కందుకూరులో చంద్రబాబు నాయుడు సభ పెట్టాడు ఆ సభకు వచ్చిన వాళ్ళలో ఎనిమిది మంది చనిపోయారు.. అక్కడికి వెళ్లి వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేస్తానన్నాడు.. కానీ, చంద్రబాబు ఇంతవరకూ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి.. మేమైతే మరుసటి రోజే ఆర్థిక సాయం అందించే వాళ్లం.. రాజకీయాలను.. రాజకీయాలు గానే చూడాలి ఇటువంటివి చేసి లబ్ధి పొంది అధికారంలోకి వస్తానంటే పగటి కలగానే మిగిలిపోతుందని సూచించారు. ఇకనైనా చంద్రబాబు బుద్ధులు మార్చుకోవాలన్న ఆయన.. ప్రజలు మా వైపు ఉన్నారు. రౌడీలు మీ వైపు ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా.. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు.. ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎంతమంది వచ్చినా ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రారా నా కొడకల్లారా అని అంటాడు.. ఇదీ ఆయన నైజం అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.