Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలనలో ప్రజలందరి భాగస్వామ్యం కోసం ప్రజాస్వామ్యాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. అలాగని ప్రజాస్వామ్యంలో లోటుపాట్లు లేవని కాదు. కానీ ఉన్నంతలో.. అందుబాటులో ఉన్న పాలనా ప్రత్యామ్నాయాల్లో.. ఇప్పటికి ప్రజాస్వామ్యానికి మించిన మెరుగైన పాలనా వ్వవస్థ లేదని.. అందరూ ఏకీభవిస్తారు. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా నడవటానికి రాజకీయమే కీలకాంశం.కానీ ఆ రాజకీయం సరైన పద్ధతిలో నడిచినప్పుడు.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. పాలన గాడి తప్పకుండానే ఉంటుంది. అయితే అదే రాజకీయం కనీస స్పృహ లేకుండా.. కేవలం ఆధిపత్యమే లక్ష్యంగా సాగినప్పుడు.. పార్టీలకు అతీతంగా ఎవరు పాలించినా.. ప్రజలకు మిగిలేది శూన్యహస్తమే అనడంలో సందేహం లేదు. అందుకే మొదట్నుంచీ పాలించేవారికి ఎలాంటి లక్షణాలుండాలో మన పెద్దలు చెబుతూ వచ్చారు. అవేంటో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ నేతలతో సహా అందరికీ తెలుసు. కానీ సదరు లక్షణాలను ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ వస్తున్న రాజకీయ వ్యవస్థ.. రోజురోజుకీ మరింతగా భ్రష్టుపడుతోంది. వ్యవస్థల్ని నడిపించాల్సిన రాజకీయ వ్యవస్థే పతనావస్థలో ఉన్నప్పుడు.. ఇక మిగతా వ్యవస్థలు పనిచేస్తాయనుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం తాండవం చేస్తున్నాయి. ప్రజలు ఎలాపోతే మాకెందుకు అనే బరితెగింపు ఎక్కువైపోతోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ఎక్కడ చూసినా అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయమే పరమావధిగా ఉంటున్నాయి. పోనీ ప్రతిపక్షాలైనా ప్రజాసమస్యల్ని పట్టించుకుంటున్నాయా అంటే అదీ లేదు. విపక్షాలు కూడా అధికార పార్టీలకు పోటీగా రాజకీయమే చేస్తున్నాయి. అంతిమంగా ప్రజలు, ప్రజాసమస్యలు, సామాన్యుడి ఇబ్బందులు సైడ్ట్రాక్లోకి వెళ్లి.. రాజకీయ ఆధిపత్య ప్రదర్శనే మెయిన్ ట్రాక్ ఎక్కుతోంది. దీంతో పాలన అనేది మృగ్యమైపోయి.. అంతా రాజకీమయమైపోయిన దుస్థితి కళ్లకు కడుతోంది. ఏతావాతా రాజకీయ ఉధృతిలో పాలన రథం కొట్టుకుపోతున్న దారుణం దేశ ప్రజల మనసు కలుక్కుమనేలా చేస్తోంది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
రాజకీయ పార్టీలన్నాక రాజకీయం చేయాలనే కాన్సెప్ట్‌ను ఎవరూ కాదనడం లేదు. కానీ అలాగని ప్రజలు, వారి సమస్యల గురించి మర్చిపోయి.. కేవలం రాజకీయమే పరమావధిగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అనేదే ఎప్పటికప్పుడు పౌరసమాజం నుంచి దూసుకొస్తున్న ప్రశ్న. దేశంలో పార్టీలు గాడి తప్పినప్పుడల్లా.. ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, కేంద్రంలోగానీ, కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే, ఎక్కడా అడ్మినిస్ట్రేషన్ కనిపించడం లేదు. సమయానుకూలంగా కేవలం రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ స్థాయిలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. సమస్యలొచ్చినప్పుడు సంక్షోభాలు తలెత్తినప్పుడు, అప్పటికప్పుడు దానికి తాత్కాలిక పరిష్కారాలు చూపించి, అక్కడితో మమ అనుకుంటూ ముదుకెళ్లిపోతున్నాయి ప్రభుత్వాలు. ఎక్కడైనా తీసుకోండి. రాష్ట్రాల్లో గానీ, దేశం మొత్తంగానీ, వ్యవస్థలు పూర్తిగా విఫలమై చేతులెత్తేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ సమస్యల నుంచి జనం దారి మళ్లించడానికి, కన్నుగప్పడానికి, ప్రభుత్వాలు పార్టీలు వింతవింత వేషాలేస్తున్నాయి. నీట్ ప్రవేశ పరీక్షపత్రం లీక్ ఉదంతం దేశంలో అడ్మిన్ ఫెయిల్యూర్‌కి పెద్ద ఉదాహరణ. పదేళ్ల కాలంలో దేశంలో 150కి పైగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్, ఇతర పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయంటే మన వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందో.. మన అడ్మిన్ ఎంత దారుణంగా పనిచేస్తోందో అర్థమవుతోంది.
Also Read
అప్పటికీ 2024లో నీట్ క్వశ్చన్ పేపర్ ఒకసారి లీక్ అయింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకోలేదు. కట్టుదిట్టమైన ఏర్పాట్లూ చేయలేదు. వైఫల్యాలను సమీక్షించలేదు. అన్నింటికీ మించి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన సూచనలు కూడా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ ఈ ఏడాది నీట్ పేపర్ లీక్ అయింది. సింపుల్‌గా పరీక్షను రద్దుచేసి, మరోసారి నిర్వహిస్తామని ఒక ప్రకటనతో తేల్చేశారు. 22 లక్షల మంది పిల్లలు అహోరాత్రాలు కష్టపడి చదివి ప్రవేశ పరీక్ష రాస్తే, ఎవరో కొందరు పేపర్ లీక్ చేసి, వాళ్ల జీవితాలతో ఆడుకున్నారు. దానిని రద్దుచేసిన ప్రభుత్వం మరోసారి విద్యార్థుల జీవితంతో ఆడుకుంది. ఈ దారుణాన్ని చూడలేక, జీర్ణించుకోలేక.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 22 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది అడ్మిన్ ఫెయిల్యూర్ కాదా?
మన దేశంలో మనిషి ప్రాణానికి విలువ లేదా? ఇలాంటి సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణ చర్యల్లో భాగంగా ఒకమంత్రి రాజీనామా చేస్తే తప్పేంటి? తప్పుని కప్పిపుచ్చడానికి అహాన్ని ప్రదర్శిస్తూ, లక్షల మంది విద్యార్థులు ప్రధాని ఇంటిముందు ప్రదర్శన చేసేవరకు ఎందుకు తెచ్చుకోవాలి? ఇదే అడ్మిన్ ఫెయిల్యూర్ అంటే.. పకడ్బందీ ప్రణాళిక లేకపోవడం, వైఫల్యాల తర్వాత కనీసం సంక్షోభ నివారణకు ఆలోచించకపోవడమే వీటన్నిటికీ కారణం. అన్ని వ్యవస్థల్లోనూ విపరీతమైన నిర్లక్ష్యం. ఏమైతే నాకేంటి..? అని ఎవరికి వారే ప్రశ్నించుకుని, పాలనలో మానవీయ కోణం లేకుండా ముందుకెళ్లిపోతున్నారు.
ఇక్కడ నేతలు, ఉన్నతాధికారులు, చిన్న ఉద్యోగులు మాత్రమే కాదు.. ప్రభుత్వాల్లో అన్ని వ్వసవ్థలు గబ్బుపట్టిపోయాయి. మనిషి ప్రాణానికి విలువ లేదు. ఒక వైఫల్యంపై స్పందించాలనే కనీన స్పృహ కూడా లేదు. ప్రతీ తప్పునీ కప్పిపుచ్చడానికి ఏదో ఒక ప్రత్యామ్నాయ ఉపాయాలు వేయడమే తక్షణ కర్తవ్యం. అంతేకానీ ఆ తప్పు మళ్లీ జరగకుండా కఠినమైన చర్యలు, కొత్త ప్రణాళికల లాంటివి మన అడ్మిన్‌లో మృగ్యమైపోయాయి. ఇక్కడ ఏదో ఒక్క పార్టీనో.. అలాగని ఒక సర్కారునో తప్పుబట్టే పరిస్థితి మన పార్టీలు, నేతలూ ఇవ్వడం లేదు. అన్నీ ఆ తాను ముక్కలే అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే కేంద్రమూ అలాగే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలూ అలాగే ఉన్నాయి. వ్యవస్థల పట్ల ఎలాగూ గౌరవం లేదు. కనీసం ఒక వైఫల్యం మళ్లీ జరగకుండా చేయాలనే చిత్తశుద్ధి కూడా ప్రభుత్వాలు నడిపించేవారిలో లేవు. నీట్ పరీక్ష కావొచ్చు.. సీబీఎస్ఈ పేపర్ వేల్యూయేషన్ కావొచ్చు. మరే అంశమైనా సరే, మన వ్యవస్థల్లో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా జీరో అయిపోయింది.
సహజంగా ఎన్నికల ఏడాదిలో పాలన వెనక్కిపోయి.. రాజకీయం ముందుకొస్తుంది. దీన్ని సహజ పరిణామంగా ప్రజలు కూడా చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న తీరే వేరు. పొద్దున లేచిన దగ్గర్నుంచీ.. పడుకునే దాకా.. ఎన్నికలు ఉన్నాయా.. లేదా అనే విషయంతో సంబంధం లేకుండా పార్టీలు అనుక్షణం రాజకీయ మంత్రమే పఠిస్తున్నాయి. అన్ని పార్టీలూ నిత్యం రాజకీయ గంగా ప్రవాహంలో మునిగి తేలుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు.. ప్రజాసమస్యలు వదిలేసిర్టీలూ నిత్యం రాజకీయ గంగా ప్రవాహంలో మునిగి తేలుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు.. ప్రజాసమస్యలు వదిలేసి.. ప్రత్యర్థుల్ని వెంటాడటం, వేటాడటమే పనిగా పెట్టుకున్నాయి. పోనీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలైనా.. కాస్త ప్రజల పక్షాన పోరాడుతున్నాయా.. అంటే అదీ లేదు. అక్కడ కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. అలాగని దేశంలో, రాష్ట్రాల్లో ప్రజాసమస్యలు లేవా.. అంటే ఎందుకులేవు. చాలా ఉన్నాయి. కానీ పార్టీలు మాత్రం సమస్యల పరిష్కారం పక్కనపెడితే.. అసలు వాటి ఉనికిని గుర్తిస్తున్న దాఖాలలు కనిపించడం లేదు. జనజీవితాలు ఎంత అధ్వాన్నంగానైనా ఉండనీ.. ఏ సమస్యలైనా రానీ.. కాలమే వాటిని పరిష్కరించాలి.. జనం వాళ్ల చావు చావాలి తప్ప లీడర్లు మాత్రం పట్టించుకోరు. వాళ్లు కేవలం రాజకీయాలే చేస్తారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ తో అంతర్జాతీయంగా మనం అభాసుపాలయ్యాం. కనీసం ఇలాంటి సంఘటనపై ప్రభుత్వం సిగ్గుకూడా పడటం లేదు. నీట్ పరీక్ష రాయటానికి వచ్చే విద్యార్థుల్ని నఖశిఖపర్యంతం క్షుణ్ణంగా తనిఖీలు చేసే యంత్రాంగం.. కీలకమైన పేపర్ తయారీ, దాని గోప్యత విషయాన్ని మాత్రం గాలికొదిలేస్తోంది. ఏటా నీట్ పరీక్ష సమయంలో జరిగే విద్యార్థుల తనిఖీలపై బోల్డన్ని ఆరోపణలున్నాయి. అయినా సరే ఏవో తిప్పలు పడి.. బాధని దిగమింగుకుని.. విద్యార్థులు చచ్చీచెడీ పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష కోసం అధికార యంత్రాంగం పెట్టే బాధల్ని పంటి బిగువన ఓర్చుకుంటున్నారు. దీంతో విద్యార్థులంటే అలుసైపోయినట్టుగా ఉంది. అందుకే లక్షల మంది విద్యార్థులు పోటీపడే పరీక్ష పేపర్‌ను యథేచ్ఛగా లీక్ చేసి.. చివరకు బాధ్యులపై చర్యలు తీసుకోవటానికి కూడా మీనమేషాలు లెక్కించే తోలు మందం వ్యవస్థలు పోగుపడ్డాయి.
చివరకు లక్షల మంది విద్యార్థులు రోడ్డెక్కి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినదించి.. ఉద్యమిస్తే కానీ.. దేశ చరిత్రలో తొలిసారి నిరసనకారులు పార్లమెంట్ గేట్లు టచ్ చేసిన తర్వాత కానీ.. సంబంధిత మంత్రి రాజీనామాకు ముందుకు రాలేదు. ఇక్కడ నీట్ పేపర్ లీకేజ్ వైఫల్యం ఒక ఎత్తైతే.. లక్షల మంది విద్యార్థులు రోడ్డెక్కేవరకు కనీస బాధ్యత తీసుకోవటానికి ఎవరూ ముందుకు రాకపోవడం.. వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిన దుస్థితికి పరాకాష్ట అని చెప్పక తప్పదు. పిల్లలు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో.. ప్రధాని వాళ్లకు సుద్దులు చెబుతుంటారు. కానీ పరీక్షలు ఎలా నిర్వహించాలో అధికారులకు మాత్రం ఎవరూ ఎందుకు చెప్పరు..? . ఇక్కడ ఒక్క విద్యా వ్యవస్థ అనే కాదు.. అసలు ఏ వ్యవస్థల మీద ప్రభుత్వాలకు పట్టుండటం లేదు. వ్యవస్థలు వాటికవే కిందామీద పడి పనిచేస్తున్నాయి. అంతేతప్పా, ప్రభుత్వాలకు వాటిపై ఏస్థాయిలోనూ పట్టుదొరకడం లేదు.
రాజకీయ సుస్థిరత ఉంటే.. దేశం బాగుపడుతుందనుకున్న జనం ఆలోచనల్ని పార్టీలు మొగ్గలోనే తుంచేస్తున్నాయి. తమ మీద అనవసరంగా ఆశలు పెట్టుకోవద్దనే సంకేతాలిస్తున్నాయి. ఎక్కడైనా అధికార పక్షం బాధ్యతగా ఉండాలి. ప్రతిపక్షం కూడా ప్రజల తరపున బాధ్యత తీసుకోవాలి. ప్రజాస్వామ్య రథం సరిగా నడవాలంటే అధికార, ప్రతిపక్షాలనే రెండు చక్రాలూ సజావుగా నడవాలని రాజ్యాంగ నిర్మాతలు ఎప్పుడో నిర్దేశించారు. కానీ దేశంలో పార్టీలు మాత్రం ఆ సూత్రాల్ని ఎప్పుడో గాలికొదిలేశాయి. వేటికవే స్వీయ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పొలిటికల్ షో నడిపిస్తున్నాయి. ఈ మధ్యలో సామాన్యులు,వారి సమస్యలు, వేదనలు అన్నీ మట్టికొట్టుకుపోతున్నాయి. ఓవైపు సాంకేతికత పెరుగుతోంది. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోంది. ప్రతిపక్షాలకు కూడా ప్రజాసమస్యలు తెలిసే మార్గాలు పెరుగుతున్నాయి. కానీ పరిష్కారం మాత్రం ఏ వైపు నుంచీ రావడం లేదు. పైగా ఈరోజు కంటే నిన్నే మెరుగు అని నిట్టూర్చాల్సిన దుస్థితిలో సామాన్యులున్నారు.
- Tags
- Chairman's Desk
- Governance
- ntv
తాజావార్తలు
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!