Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు (ANR) 100వ జయంతిని పురస్కరించుకుని “మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ” అనే గ్రంథాన్ని ప్రధాని మోదీకి అందించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత, పద్మభూషణ అవార్డు గ్రహీత, మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించారు. ఆయన విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ అక్కినేని నాగేశ్వరరావు సమగ్ర కృషిని, భారతీయ సినీ రంగానికి చేసిన విశేష సేవలను కొనియాడారు. ప్రత్యేకించి, తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుండి హైదరాబాద్‌కు మళ్లించి.. ప్రస్తుతం అభివృద్ధి చెందే స్థాయికి తీసుకువెళ్లడంలో ఏఎన్ ఆర్ పాత్ర అపూర్వమైనదని కొనియాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏఎన్ఆర్ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మహానటుడు అని పేర్కొన్నారు. ఆయన చేసిన చిత్రాలు తెలుగు సినిమా ప్రత్యేకతను ప్రపంచానికి చాటించాయని ప్రశంసించారు.
మన్ కీ బాత్ లో ఏఎన్ఆర్ ప్రస్తావన
117వ “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ ఏఎన్ఆర్ గురించి ప్రస్తావించిన విషయాన్ని నాగార్జునతో పంచుకున్నారు. ఏఎన్ఆర్ తో పాటు, టపన్ సిన్హా, రాజ్ కపూర్ లాంటి భారతీయ సినిమా దిగ్గజాలను తన ప్రసంగంలో గుర్తుచేసినట్లు తెలిపారు. ఏఎన్ఆర్ కేవలం నటుడే కాకుండా, విద్య, సాహిత్యం, సేవారంగాల్లోనూ ఎనలేని కృషి చేశారు అని మోదీ ప్రశంసించారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి తెలుగు చిత్రపరిశ్రమకు బలమైన మద్దతునిచ్చారని, అక్కినేని నాగేశ్వరరావు కళాశాల (గుడివాడ) వంటి విద్యాసంస్థల స్థాపన ద్వారా విద్యాభివృద్ధికి దోహదపడ్డారని గుర్తు చేశారు.
Read Also:Virat Kohli: ‘కింగ్ కోహ్లీ’ తర్వాత మ్యాచ్‌పై అప్‌డేట్.. ఇంతకీ ఆడుతాడా.. లేదా..?
ఏఎన్ఆర్ సినీ ప్రయాణం
ఏడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఏఎన్ఆర్ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి, సినీ ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మోదీ వ్యాఖ్యానించారు. “నేను నా జీవితం”, “మనసులోని మాట” వంటి రచనల ద్వారా ఆయన జీవన సత్యాలను విశ్లేషించారని అభిప్రాయపడ్డారు. ఏఎన్ఆర్ భారతీయ సినిమాకు అంకితభావంతో పనిచేసిన మహానుభావుడు మాత్రమే కాకుండా, భారతీయ కళా, సాహిత్య సంప్రదాయాలకు గౌరవం తీసుకువెళ్లిన మేధావి అని ప్రధాని కొనియాడారు.