ఏపీలో వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. రేపు ఇప్పటం గ్రామంలోని కూల్చివేతలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటంలో అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం లోపు విడుదల చేయకపోతే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆందోళన చేపడతామని అన్నారు. రాజమండ్రిలో జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ మార్చి 14న మచిలీపట్నంలో అద్భుతమైన సభ నిర్వహించబోతున్నామని వెల్లడించారు.
సభకు పోలీసుల అనుమతి తీసుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందంతో ఇప్పటం గ్రామంలో భూములు ఇచ్చిన రైతుల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు. విశాఖ సమ్మెట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తారనే ఉద్దేశంతో రెండు రోజులు వైసిపిపై విమర్శలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అయినా వైసీపీ నేతలు కావాలనే ఇప్పటం గొడవను రెచ్చగొట్టారని , అందుకే విమర్శలు చేయకతప్పలేదని వివరణ ఇచ్చారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా జనసేన అధికారంలోకి రాబోతుంది. మీరు చేసే ఈ అన్యాయాలకి ప్రతి వైసిపి ఎమ్మెల్యే గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.మేము ఇప్పటం గ్రామ ప్రజలు పక్షాన నిలబడతామని నాదెండ్ల మనోహర్ అన్నారు.