దేశంలో రెండు మల్టీప్లెక్స్ దిగ్గజాలు కలవబోతున్నాయి. పీవీఆర్-ఐనాక్స్ సంస్థలు విలీనం కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఆదివారం రెండు కంపెనీలు అధికారికంగా ధ్రువీకరించాయి. అయితే మెక్సికన్ మల్టీపెక్స్ దిగ్గజం సినీపోలీస్‌కు పీవీఆర్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్నిరోజుల కిందట వరకు సినీపోలీస్‌ను కొనుగోలు చేయాలని పీవీఆర్ ప్రయత్నించింది. అయితే తాజాగా సినీపోలీస్‌కు హ్యాండ్ ఇచ్చి ఐనాక్స్‌తో పీవీఆర్ సంస్థ చేతులు కలిపింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంస్థలు ఒకటి కావాలని నిర్ణయించాయి.
కాగా పీవీఆర్-ఐనాక్స్ డీల్ దేశీయ ఫిల్మ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చనుంది. గత పదేళ్లలో దేశీయ ఫిల్మ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీలో ఇదే తొలి కన్సాలిడేషన్. దేశవ్యాప్తంగా ఈ రెండు మల్టీప్లెక్స్ సంస్థలకు 1,500కి పైగా స్క్రీన్లు ఉండనున్నాయి. ఆ తర్వాత కార్నివాల్ సినిమాస్ 450 స్క్రీన్‌లు, సినీపోలీస్ ఇండియా 417 స్క్రీన్‌లను కలిగి ఉన్నాయి. పీవీఆర్-ఐనాక్స్ విలీన సంస్థలో ఐనాక్స్ లీజర్ అతిపెద్ద వాటాదారునిగా ఉండబోతుందని సమాచారం.
PVR and INOX announce their merger. pic.twitter.com/Z24VZogJi8
— ANI (@ANI) March 27, 2022