అందాల తార మృణాల్ ఠాకూర్ భాషా సరిహద్దులతో సంబంధం లేకుండా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇటీవలే ‘సన్ ఆఫ్ సర్దార్ 2’తో 2025కి విజయవంతంగా వీడ్కోలు పలికిన ఈ ముద్దుగుమ్మ, వచ్చే ఏడాది వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. తనకు సినిమాల విషయంలో ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకోవడం ఇష్టమని, ముఖ్యంగా తనను ప్రాణంలా ఆరాధించే తెలుగు అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచకూడదనే పట్టుదలతో ఉన్నట్లు స్పష్టం చేసింది. బాలీవుడ్ తనకు కంఫర్ట్ జోన్ అయినప్పటికీ, నటిగా సరిహద్దులు దాటి కొత్త సవాళ్లను స్వీకరించడమే తన అసలైన ఇష్టమని ఆమె చెప్పుకొచ్చింది.
Also Read : Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’ కోసం ఎన్టీఆర్ ఎంట్రీ..?
కాగా 2026లో మృణాల్ నటించిన రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి హిందీ చిత్రం ‘దో దీవానే సెహెర్ మే’ కాగా, మరొకటి అడివి శేష్‌తో కలిసి నటిస్తున్న క్రేజీ తెలుగు ప్రాజెక్ట్ ‘డెకాయిట్’. ఈ రెండు సినిమాలను ఏకధాటిగా చిత్రీకరించడం చాలా సవాలుతో కూడుకున్న పని అని, అయితే తన కలలను నిజం చేయడంలో సహకరించిన దర్శకనిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు భాషా చిత్రాలలో నటించడం కష్టమైనా, ఆ వైవిధ్యమే తనకు సంతృప్తినిస్తుందని మృణాల్ పేర్కొంది. మొత్తానికి సీతగా మెప్పించిన ఈ భామ, రానున్న సినిమాలతో మరింతగా వెలుగు వెలగడం ఖాయంగా కనిపిస్తోంది.