డా.బీఆర్ అంబేడ్కర్‌ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ అని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. రాజ్యాంగం, అంబేడ్కర్‌ను బీజేపీ ఎన్నడూ అగౌరపరచదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తుందని బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అంబేడ్కర్ తమ నాయకుడని చెబుతున్న కాంగ్రెస్.. ఎందుకు భారత రత్న ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. వాజ్‌పేయీ హయాంలో అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చిన ఘనత తమ పార్టీది అని పురందరేశ్వరి పేర్కొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో పురందేశ్వరి స్పందించారు.
రాజమండ్రిలో ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ… ‘బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను అమితంగా గౌరవించిన పార్టీ బీజేపీ. ఎన్నికల సమయంలో బీజేపీ రాజ్యాంగంను ఎత్తివేస్తుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. పార్లమెంట్లో అమెండిమెంట్ (సవరణలు) ద్వారా రాజ్యాంగం మార్చడం వీలవుతుంది. బీజేపీ అధికారంలో ఉన్నకాలంలో ఎప్పుడు రాజ్యాంగం స్వలాభం కోసం మార్చలేదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమెండిమెంట్స్ చేసాము. కాంగ్రెస్ పార్టీ ఉపయోగపరంగా రాజ్యాంగాన్ని మార్చింది. అంబేడ్కర్‌కు భారత్ రత్న ఇవ్వాలని కాంగ్రెస్‌కి తట్టలేదు. బీజేపీ ప్రభుత్వంలోనే అంబేడ్కర్‌కు భారత్ రత్న ప్రకటించాము. అంబేడ్కర్‌ను రెండుసార్లు కాంగ్రెస్ అమానించింది. గతంలో అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవనివ్వలేదు. కాంగ్రెస్ చర్యలతో అంబేద్కర్ మానసికంగా కుంగిపోయారు’ అని అన్నారు.
‘హిందూ బిల్, యూనిఫాం సివిల్ కోర్టు బిల్ ప్రవేశపెట్టాం. రాహుల్ గాంధీ అంబేద్కర్ చిత్రపటానికి మాల వెయ్యలేదు. ప్రజా సమస్యలు చర్చించే దేవాలయంలో కాంగ్రెస్ అడ్డుకుంటుంది. బీజేపీ ఎన్నడూ రాజ్యాంగాన్ని ఉల్లంగించలేదు, మార్చాలన్న భావన లేదు. గతంలో ఆర్టికల్ 356ని రద్దును తీవ్రంగా వ్యతిరేకించారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వం రద్దు చేసే చట్టం ఆర్టికల్ 356. జమీలి ఎన్నికల బిల్లు లోక్ సభలో చర్చించడం జరిగింది. జేపీసీ వెయ్యడం జరిగింది. విధివిధానాలు రూపొందించి బిల్లు ప్రవేశ బెట్టడం జరుగుతుంది’ అని ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు.