టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేనప్పుడు తాను మరింత మెరుగ్గా రాణిస్తా అని హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. బుమ్రా లేనపుడు తనపై బౌలింగ్ బాధ్యత ఉంటుందని, ఆ సమయంలో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తా అని చెప్పాడు. బాధ్యత తనలో ఆనందాన్ని రేకెత్తిస్తుందని, అలానే ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుందన్నాడు. సహచర బౌలర్లతో ఎప్పుడూ మాట్లాడుతానని, మనం సాధించగలమనే నమ్మకాన్ని వారిలో కలిగించేందుకు కృషి చేస్తా అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025, ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో సిరాజ్ సత్తాచాటిన విషయం తెలిసిందే.
రెవ్‌స్పోర్ట్జ్‌తో మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ… ‘జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేనప్పుడు నేను మరింత మెరుగ్గా రాణిస్తా. బాధ్యతను మోయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు సాధారణ సిరీస్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తా. బాధ్యత నాలో ఆనందాన్ని రేకెత్తిస్తుంది, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుంది. వెన్ను గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో లేడు. ఆ సమయంలో బౌలింగ్ యూనిట్‌లో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి నావంతు ప్రయత్నం చేస్తా. నా సహచరు బౌలర్లతో ఎప్పుడూ మాట్లాడుతుంటా. మనం దీన్ని సాధించగలమనే నమ్మకాన్ని వారిలో కలిగించేందుకు కృషి చేస్తా. మనం గతంలో సాధించిన వాటిని వారికి గుర్తు చేస్తా’ అని తెలిపాడు.
Also Read: Rabies Virus: కుక్క మాత్రమే కాదు.. వీటిల్లో ఏది కరిచినా రేబిస్ వస్తుంది!
ఇంగ్లండ్ పర్యటనలో మహ్మద్ సిరాజ్ సత్తా చాటాడు. 5 టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. రెండు సార్లు అయిదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆఖరి టెస్టులో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రా సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడి గైర్హాజరీలో సిరాజ్ పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు. సిరాజ్ ఇప్పటి వరకు 41 టెస్ట్ మ్యాచ్‌లలో 123 వికెట్లు పడగొట్టాడు. 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 44 వన్డేల్లో 32 వికెట్లు, 16 టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు.