మోచా తుఫాన్ ప్రభావం మనదేశంపై అంతగా ఉండదని.. అయితే, బంగ్లాదేశ్,మయన్మార్ దేశాలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈనెల 14న మయన్మార్ వద్ద తీరం దాటే చాన్స్ వుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి మంగళవారానికి వాయుగుండంగా మారనుంది. తర్వాత ఉత్తర వాయవ్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి ఈనెల పదో తేదీకల్లా తుఫాన్‌గా మారనుంది. ఆపై మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి ఈనెల 11వ తేదీ వరకు తొలుత ఉత్తర వాయవ్యంగా, ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
ఈశాన్యంగా పయనించే క్రమంలో అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి ఈనెల 14న దక్షిణ బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య తీరం దాటనుందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఈ తుఫాన్‌కు ‘మోచా’ (ఎంఓసీహెచ్‌ఏ) అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. పలకడంలో మాత్రం దీనిని మోకా అంటున్నారు. ఈ తుఫాన్ మయన్మార్- బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ.. దీని ప్రభావం ఒడిసా, పశ్చిమబెంగాల్ తీరాలపైనా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ తుఫాన్ పట్ల ఆందోళనగా ఉన్నాయి.
Read Also: Tues day Bhakthi Tv Live: మంగళవారం ఈ స్తోత్రాలు వింటే..
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, ఉక్కపోత పెరిగింది. గత రెండు రోజులు వాతావరణం చల్లబడింది. దీంతో జనం ఉపశమనం పొందారు. సోమవారం కర్నూలులో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మోచా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఎండలు ఒక్కసారిగా పెరగనున్నాయి. ఈనెల 12 తర్వాత రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంటుందని, అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, ఈనెల 14 తర్వాత తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులతో సోమవారం రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాయలసీమలో సోమవారం పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. మంగళవారం వడగాలులు వీస్తాయని, జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also: Man beats wife : అన్నం వండలేదని భార్యనే చంపేసావా! .. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తిను