తెలంగాణలో ఇటీవల ఐటీ సోదాలు పెరిగాయి. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా నేడు ఉదయం నుంచి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే.. దీనిపై తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. మోడీ సర్కార్ విచ్చలవిడిగా కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుతోందన్నారు. ఆ సంస్థలు బీజేపీ కార్యకర్తలల వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులం కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తో ఎదుర్కొంటామని, ఈ దర్యాప్తు సంస్థల దాడులకు భయపడి ఇతర పార్టీలోకి వెళ్ళే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. కేంద్రం రైతులకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటోందని, రైతులకు ఉపయోగపడే ఒక్క నిర్ణయం లేదని ఆయన మండిపడ్డారు. పీఎం కిసాన్ యోజన కింద 14.5 కోట్లు రైతులు ఉన్నారని, 87,500 కోట్లు వేస్తామన్నారని, నాలుగు సంవత్సరాలలో అనేక ఆంక్షలు పీఎం కిసాన్ యోజన లో పెట్టారని ఆయన మండిపడ్డారు.
Also Read : Jogi Ramesh: పవన్ కళ్యాణ్ ప్యాకేజీ సైకో.. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ
అంతేకాకుండా.. తాజాగా 3 కోట్ల 88 లక్షల మంది రైతులకు మాత్రమే పీఎం కిసాన్ యోజన కింద 6 వేల రూపాయలు పంపిణీ చేశారన్నారు. పీఎం కిసాన్ యోజన కింద రైతు లబ్ధిదారుల సంఖ్య పడిపోయిందని, రాష్ట్రాలలో పీఎం కిసాన్ యోజన కింద లబ్ధి పొందే రైతులు లేరు అని అంటున్నారన్నారు. ముందు 50 లక్షల మందికి రైతు బంధు ఇస్తే …ఇప్పుడు 65 లక్షల మందికి ఇస్తున్నామని, తెలంగాణలో 2014 నుంచి రైతు ఆత్మ హత్యలు తగ్గాయన్నారు. ఈ సీజన్ లో 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొన్నామని, సంయుక్త కిసాన్ మోర్చ నిర్వహించే కార్యక్రమాలకు మా మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడం అంటే టైం వేస్ట్ అన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. రైతుల రుణమాఫీ కచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు.