Vasantha Krishna Prasad: ఎన్నికల తరుణంలో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమా భేటీ అయ్యారు.. అయితే, ఈ రోజు మైలవరం టీడీపీ నేతలను కలుస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. అంతేకాదు.. దేవినేని ఉమాతో కలిసి పనిచేయడానికి సిద్ధం అంటున్నారు.. నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మైలవరం నాయకులతో సమావేశం అయిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరుతానని ప్రకటించారు.. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం అని స్పష్టం చేశారు.
Read Also: Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
తమిళనాడు రాష్ట్రం లాగా ఇక్కడ నాయకులు వంగి దండాలు, పాదాభివందనాలు, బూతులు మాట్లాడితే చెల్లదు అని హెచ్చరించారు వసంత కృష్ణ ప్రసాద్.. అమరావతి రాజధాని అని చెప్పి… మాట మార్చడం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికే చెల్లిందని దుయ్యబట్టారు.. తాను ఎమ్మెల్యేగా మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను.. నా నియోజకవర్గం అభివృద్ధిపై ఎంపీ కేశినేని నాని చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. కాగా, మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన విషయం విదితమే.. అయితే, మంత్రి జోగి రమేష్‌తో ఆయనకు ఆది నుంచి పొసగలేదు.. కొన్నిసార్లు వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకుని సర్దిచెప్పినా.. అప్పటి వరకు సమస్యలు పరిష్కారం అయినట్టే కనిపించినా.. ఆ తర్వాత యథాస్థితి కొనసాగుతూ వచ్చింది.. మరోవైపు.. ఓ దిశలో ఆయన అలగడం.. టీడీపీతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం కూడా సాగింది.. అయితే ఉన్నట్టుండి మళ్లీ వైసీపీ వైపునే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మైలవరం ఇంఛార్జ్‌గా మరో వ్యక్తిని వైసీపీ రంగంలోకి దించడంతో.. తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు.