టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్చల్ చేశారు. తిరువూరులోని వైన్స్ షాపుల ప్రక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేయించారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయాలని సూచించారు. పట్టణంలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
మంగళవారం ఉదయం తిరువూరులోని వైన్స్ షాపుల ప్రక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనిఖీలు చేశారు. పట్టణంలో మద్యం వికయిస్తున్న బెల్ట్ షాపులను తనిఖీ చేసి పోలీసులకు పట్టించారు. నిబంధనలను విరుద్ధంగా ఉన్న నాలుగు మద్యం షాపులను మూయించారు. పాఠశాలకు, గృహాలు, బస్టాప్ సమీపంలో ఉన్న మద్యం షాపులను పట్టణ శివారుకు తరలించాలని డిమాండ్ చేశారు. తిరువూరు మండలంలో 43, నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు 130 పైగా బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపులు నడిపిస్తోంది వైన్స్ షాప్ వారే అని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు.