ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంకు వెళ్లిన హరీష్ రావు.. కేసీఆర్‌ను కలిశారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, హరీష్ రావు ఇచ్చిన సమాధానాలపై కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ కూడా హాజరైనట్టు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిలు సైతం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.
Also Read: Bandi Sanjay: ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదు.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నేడు కాళేశ్వరం కమిషన్ ముందు ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారణ ముగిసింది. 40 నిమిషాల పాటు విచారణ జరగగా.. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. కమిషన్ మొత్తం 20 ప్రశ్నలు అడగ్గా.. ప్రతి దానికి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం కార్పొరేషన్, డిజైన్ల మార్పుపై ప్రధానంగా కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ను హరీశ్ రావు చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో జూన్ 11న కేసీఆర్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. ప్రాజెక్టు ఆరంభం నుంచి తీసుకున్న నిర్ణయాలు, అంచనాలు, అనుబంధ అభివృద్ధి అంశాలపై పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.