ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు మామూలోడు కాదని, భార్యాభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్ అని పేర్కొన్నారు. తమ లాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు ప్రభాకర్ పోసుకున్నాడన్నారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యిందని.. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారన్నారు. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బహిరంగ పర్చాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఏ1గా ఉన్న విషయం తెలిసిందే.
‘ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదు. మాలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్నాడు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యింది. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారు. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బహిరంగ పర్చాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పైనే కాదు.. నాతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘనడు ఆయన. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనమయ్యాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడు. భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితిని ఆయన కల్పించారు’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: CM Chandrababu: ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ.. ఆగస్ట్ 15న ఉచిత బస్!
‘ఎవరి ఆదేశం మేరకు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాలి. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు?, ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు, ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారు? అనే విషయాలు తెలియాలి. కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. 18 నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసులో విచారణ కూడా ముందుకు సాగలేదు?. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు విన్పించాలి. ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందే’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు నేడు హాజరయ్యారు. సుమారు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు.