శాసనమండలిలో నూతన పరిశ్రమల స్థాపనపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. ‘రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చెందితేనే పరిశ్రమలు వస్తాయని వైఎస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు. కొవిడ్ సమయంలో కూడా కొత్త పరిశ్రమలు తీసుకువచ్చారు. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ఉద్యోగ కల్పన జరగాలి. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేయాలి. పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలి’ అని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కోరారు. పీ4 పాలసీలో ఎంతమందిని పారిశ్రామిక వేత్తలుగా మార్చారు?.. ఎస్సీ, ఎస్టీలకు పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్స్ ఎప్పుడు విడుదల చేస్తారు? అని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రశ్నించారు.
ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి టీజీ భరత్ సమాధానం ఇచ్చారు. ‘2014-19 వరకు నాలుగు వేల కోట్లు ఇన్సెంటివ్స్ ఇచ్చాం. 2019-24 మధ్యలో కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. టెక్స్ టైల్ పాలసీ ఇచ్చి గైడ్లైన్స్ కూడా ఇవ్వలేదు.అశోక్ లేలాండ్ గత ప్రభుత్వ హయాంలో పారిపోయారు. నిన్న మళ్ళీ రీస్టార్ట్ చేయించటం జరిగింది. వాటర్ చార్జెస్ కూడా చాలా పెంచారు. పార్టనర్ షిప్ సమ్మిట్స్ కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే ఎక్కువగా చేస్తున్నాం. 2019-24లో అసలు ఈ శాఖనే పట్టించుకోలేదు’ అని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు.
మండలిలో గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ… ‘పీఎంఏవై క్రింద గత ప్రభుత్వ హయాంలో 27 లక్షల ఇళ్లు శాంక్షన్ అయితే కేవలం 6 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణం కోసం 2026 వరకు సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి సమయం తీసుకున్నారు. పేదలకు ఇళ్ల కోసం భారం పడకుండా చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో 25 వేల ఎకరాలకు మాత్రమే భూములు కొనుగోలు చేశారు. చాలావరకు నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు అదనంగా 50 వేలు ఆర్ధిక సాయం చేస్తున్నాం’ అని తెలిపారు.