Minister Seediri Appalaraju: విశాఖ రాజధానిగా కావాలన్నదే మా ఆకాంక్ష.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ వస్తేనే విశాఖను రాజధానిగా చేసుకోగలం అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రథసప్తమి రోజు అరసవల్లి వచ్చి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం మాకు అలవాటుగా పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలోనీ దుష్టచతుష్టయాన్ని ఎదుర్కొనే శక్తిని జగన్మోహన్ రెడ్డికి సూర్య భగవానుడు ప్రసాదించాలని తద్వారా ప్రజలకీ మంచి జరగాలని కోరుకున్నానని తెలిపారు. సూర్యనారాయణ స్వామి ప్రజలందరి జీవితాలలో వెలుగును తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.
మరోవైపు.. నారా లోకేష్ కి అవగాహన లేదు అని ఫైర్ అయ్యారు అప్పలరాజు.. మా పలాస వచ్చి కోటి డబ్బే లక్షల టీచర్ పోస్టులు తామే వేశామన్నారు.. కానీ, అంతమంది విద్యార్థులే లేరు… అతని మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి అంటూ సెటైర్లు వేశారు. కుటుంబాన్ని, సచివాలయాన్ని, జిల్లాను,రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అభివృద్ధి, సంక్షేమం చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అని ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ను.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ దూషించడం.. దురదృష్టకరo అన్నారు. మీకు మంచి జరిగింది అనిపిస్తే జగన్ ని గెలిపించండని ప్రజలకు కోరుతున్నాను అంటూ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు అని చెబుతున్న లోకేష్.. మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుని ఆ ప్రశ్న అడగాలి అని సూచించారు. ఇక, సీఎం జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ వస్తేనే విశాఖను రాజధానిగా చేసుకోగలం.. యువత అది గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక, హైదరాబాద్ రాజధానిపై వైవీ సుబ్బా రెడ్డి చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి కాంట్రవర్సీ లేదన్నారు అప్పలరాజు.. విశాఖ రాజధానిగా కావాలన్నదే మా ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఉద్దానంపై అవగాహన లేని మనిషి గౌతు శిరీష అని ఫైర్ అయ్యారు.. అక్కడ పిల్లలకి ఏం కావాలో ఆమెకు అవగాహన ఉందా? అని నిలదీశారు. నల్లబొడ్లకొండను గ్రౌండ్ కోసం, లే అవుట్ సైట్ కోసం ఇటీవల రీసర్వ్ చేయటం జరిగిందని వివరించారు.. గౌతు శిరీష నాన్నగారు అనేకసార్లు ఎమ్మెల్యేగా చేసి విపరీతమైన ఆస్తులు కూడ పెట్టారు అని ఆరోపించారు మంత్రి సీదిరి అప్పలరాజు.