Minister Narayana: విజయవాడ, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులు ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులు రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్నామన్నారు. పీఎన్ బీఎస్ నుంచి గన్నవరం వరకూ 38.4 కిలోమీటర్లు మేర 11 వేల కోట్ల వ్యయం అవుతుందన్నారు. అలాగే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ 27 కిలోమీటర్ల మేర దూరానికి 14 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు.
Read Also: Minister Nara Lokesh: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన!
ఇక విశాఖలో కొమ్మాది నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ మొదటి దశ, కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రం వరకూ రెండో దశ మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మించాలన్నది ప్రణాళిక అంటూ పేర్కొన్నారు. మొదటి దశ 46.23 కిలోమీటర్లకు రూ. 11,400 కోట్లు, రెండో దశ కు రూ.5,700 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. అమరావతిలో రూ.160 కోట్లతో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యాలయంలోనే సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్, మున్సిపల్ శాఖ, టిడ్కో తదితర కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ప్రణాళిక చేశామన్నారు. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నిలిపివేయటం వల్ల సీఆర్డీఏకి రూ. 216 కోట్లు నష్టం వచ్చిందన్నారు. ఐదేళ్ల పాటు ప్రాజెక్టు ఆపేయటం వల్ల నిర్మాణ వ్యయం రూ.930 కోట్లకు పెరిగిపోయిందన్నారు. నష్టం వస్తోంది ప్రాజెక్టు నిలిపివేస్తామంటే రెరా కూడా అంగీకరించదన్నారు. ప్రభుత్వానికి భారమైనా హ్యాపీనెస్ట్ పూర్తి చేసి బుక్ చేసుకున్నవారికి అందిచాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.
అమరావతి రైతులకు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన రూ.175 కోట్ల యాన్యుటీ మొత్తాన్ని సెప్టెంబరు 15 లోగా చెల్లిస్తామన్నారు. ఈ ఏడాదిలో ఇవ్వాల్సిన రూ.225 కోట్లను కూడా వీలైనంత త్వరలోనే చెల్లింపులు చేస్తామని మంత్రి తెలిపారు. ఇంకా ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన భూమి 3558 ఎకరాల మేర ఉందన్నారు. అమరావతిలో నిర్మాణాలపై సెప్టెంబరు మొదటి వారంలో ఐఐటీ చెన్నై, హైదరాబాద్‌ల నుంచి నివేదికలు వస్తాయన్నారు. 2025 జనవరి నాటికి అమరావతిలో అన్ని పనులూ మళ్లీ ప్రారంభమవుతాయన్నారు. హైటెక్ నగరంగా అమరావతిని నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.