Minister Lokesh: పంజాబ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అందరి సుఖశాంతి, ఆయురారోగ్యాల కోసం ప్రార్థించానని.. స్వర్ణ దేవాలయ సందర్శన మహా భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. ఈ రోజు ఉదయం అమృత్‌సర్‌కు చేరుకున్న లోకేష్ కుటుంబం, అత్యంత పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం తనకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించిందని తెలిపారు. ఈ పవిత్ర స్థలాన్ని దర్శించే అవకాశం లభించడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు.
Read Also: Ishan Kishan: ఇషాన్ కిషన్ ఊచకోత.. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇది ఎన్నో సెంచరీ తెలుసా?
మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆయన భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ కూడా స్వర్ణ దేవాలయంలో పలు ప్రత్యేకమైన ప్రాంతాలను సందర్శించారు. వారు అక్కడి కొలను, లంగర్‌ను దర్శించి గురుద్వారా సేవను అనుభవించారు. దేవాలయ పరిసరాల్లో శాంతి, భక్తి భావాన్ని ఆస్వాదించిన మంత్రి ఈ పుణ్యక్షేత్రం ఎంతో గొప్ప చారిత్రిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉందని పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయ సందర్శన ద్వారా తనకు మరింత మానసిక స్థైర్యం లభించిందని, ఇలాంటి పవిత్ర ప్రదేశాలు అందరికీ శాంతిని అందిస్తాయని లోకేష్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.