సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కాసేపటికి క్రితం ముగిశాయి. అగ్నివీరుడు మురళీ భౌతికకాయానికి స్వగ్రామం కళ్లితండాలో అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. వీరజవాన్‌ను కడసారి చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు భారీగా తరలివచ్చారు. మంత్రి నారా లోకేశ్ మురళీ శవపేటికను మోశారు. అంతకుముందు మురళీ తల్లిదండ్రులను లోకేశ్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఓదార్చారు.
Also Read: IND vs ENG: రోహిత్ శర్మ స్థానంలో భారీ హిట్టర్.. ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు!
మురళీ నాయక్ అంత్యక్రియల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… ‘దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయి. దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో పోరాడుతూ మురళీ వీరమరణం పొందారు. చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని కలలు కన్నారు. తాను చనిపోతే జాతీయ జెండా కప్పుకునే చనిపోతానని మురళీ అన్నారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి వీరజవాన్ మురళీ. సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉండగలగుతున్నాం. చిన్న వయసులోనే అగ్నివీర్ మురళీ నాయక్ చనిపోవడం బాధాకరం. వీరజవాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం అందిస్తాం. 5 ఎకరాల పొలంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. మురళీ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం’ అని తెలిపారు.