Minister Merugu Nagarjuna: టీడీపీ, చంద్రబాబుకు వైసీపీని చూస్తే ఎందుకు అంత భయమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వైసీపీ ఇంఛార్జ్‌లను మార్చుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పురంధేశ్వరి టీడీపీ బీ టీం అన్న మంత్రి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే స్థితికి పురంధరేశ్వరి వెళ్ళిందని.. కారంచేడులో దళితులు ఎంత మంది చనిపోయారో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఏమైపోయావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: YS Jagan: మోసాలు చేసి కుటుంబాలను చీలుస్తారు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
పురంధరేశ్వరి ఒక పార్టీ, ఆమె భర్త ఒక పార్టీ.. కొడుకు రేపు ఇంకో పార్టీలో చేరతాడని ఎద్దేవా చేశారు. ఆమె ఇంట్లో ఒక్కొకరు ఒక్కొక పార్టీలో ఉన్నారని.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా పురంధేశ్వరి మా పార్టీ గురించి మాట్లాడుతున్నారన్నారు. మీ నాన్న పెట్టిన పార్టీని, ఆస్తులను లాక్కుంటే ఎందుకు నోరు తెరవ లేకపోయావంటూ మంత్రి ప్రశ్నించారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన మరిదితో ఈమె లాలూచి పడుతోందని ఆయన విమర్శించారు. మీ మరిది పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉందా అంటూ పేర్కొన్నారు. దమ్మున్న నాయకుడు జగన్ కనుకే పొత్తుల్లేకుండా ప్రజా ఆమోదం పొందుతున్నారన్నారు. పురంధేశ్వరి మాటలకు విలువ లేదని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పొలిటికల్ బ్రోకర్ అంటూ ఆయన అన్నారు.
Read Also: Daggubati Purandeswari: వచ్చే ఎన్నికలకు ఈ సమావేశం చివరిది.. రెండు రోజుల సమావేశాల్లో కీలక నిర్ణయాలు
మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు ఎస్సీలు ఎప్పడైనా గుర్తొచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని హేళన చేసిన చంద్రబాబుకు మళ్ళీ తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఎంపీ సీట్లు అమ్ముకుని ఎస్సీలతో కన్నీళ్లు పెట్టించారన్నారు. తన హయాంలో ఏ వర్గం బాగు పడిందో చంద్రబాబు చెప్పాలన్నారు. రాద్దాంతం తప్ప సిద్దాంతం లేని వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీలో ఎస్సీలను మార్చితే ఇంకో ఎస్సీకే అవకాశం వస్తుందన్నారు. అందరికీ అవకాశం కల్పించాలన్నదే జగన్ లక్ష్యమన్నారు. అందరం కలిసి జగన్‌ను గెలిపిస్తామన్నారు. ఎంఎస్ బాబు మా ఎమ్మెల్యే, ఆయన మా వాడు.. మా సీఎం జగన్ అందరివాడు, అందరికీ న్యాయం చేస్తారన్నారు. ఇప్పుడు టికెట్ రాకపోయినా సరైన రీతిలో జగన్ న్యాయం చేస్తారని మంత్రి తెలిపారు. పేదలను చంద్రబాబు ఏనాడైనా పట్టించుకున్నాడా అంటూ మంత్రి ప్రశ్నించారు. బీసీలు జడ్జీలుగా పనికి రాడని లేఖలు రాసింది చంద్రబాబు కాదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ కోరుకున్న పాలన ఏపీలో నడుస్తోందన్నారు. సీఎం జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం జరుగుతోందన్నారు.